యాషెస్ సిరీస్ రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఓపెనింగ్ జోడీ జేక్ వెదరాల్డ్-ట్రవిస్ హెడ్ అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 77 పరుగులు జోడించారు. తద్వారా ఇంగ్లండ్‌పై డే అండ్ నైట్ టెస్ట్‌లో తొలి వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా సరికొత్త రికార్డు నెలకొల్పారు.
గతంలో ఈ రికార్డు టీమిండియా ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ-శుభ్‌మన్ గిల్ పేరిట ఉండేది. ఈ జోడీ 2021 అహ్మదాబాద్ టెస్ట్‌లో తొలి వికెట్‌కు అజేయమైన 49 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.
మ్యాచ్ విషయానికొస్తే.. ఓవర్‌నైట్ స్కోర్‌కు (325/9) మరో తొమ్మిది పరుగులు జోడించిన అనంతరం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌కు 334 పరుగుల వద్ద తెరపడింది. లబూషేన్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టడంతో జోఫ్రా ఆర్చర్ (38) చివరి వికెట్‌గా వెనుదిరిగాడు.
ఆసీస్ గడ్డపై తొలి శతకం బాదిన రూట్ (138) అజేయ బ్యాటర్‌గా నిలిచాడు. ఆర్చర్ వికెట్ బ్రెండన్ డాగెట్‌కు దక్కింది. తొలి రోజు ఆటలో నిప్పులు చెరిగిన స్టార్క్ 6 వికెట్లతో ఇన్నింగ్స్‌ను ముగించాడు. మైఖేల్ నెసర్, స్కాట్ బోలాండ్‌కు తలో వికెట్ దక్కింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే 76, బ్రూక్ 31, స్టోక్స్ 19, విల్ జాక్స్ 19, అట్కిన్సన్ 4 పరుగులు చేయగా.. డకెట్, పోప్, జేమీ స్మిత్, కార్స్ డకౌట్లయ్యారు.
అనంతరం బరిలోకి దిగిన ఆసీస్ ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. అరంగేట్రం టెస్ట్‌లో విఫలమైన ఓపెనర్ జేక్ వెదరాల్డ్ చెలరేగి ఆడాడు. శైలికి భిన్నంగా హెడ్ నిదానంగా ఆడాడు. వీరి జోడి తొలి వికెట్‌కు 77 పరుగులు జోడించిన తర్వాత బ్రైడన్ కార్స్ బౌలింగ్‌లో హెడ్ (33) ఔటయ్యాడు.
అనంతరం లబూషేన్ వెదరాల్డ్‌తో జత కలిశాడు. హెడ్ ఔటయ్యాక వెదరాల్డ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లబూషేన్‌తో కలిసి రెండో వికెట్‌కు అజేయమైన 53 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
రెండో రోజు టీ విరామం సమయానికి వెదరాల్డ్ 59, లబూషేన్ 27 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 21 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 130/1గా ఉంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 204 పరుగులు వెనుకపడి ఉంది.


