9 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34 పరుగులు
బౌలింగ్‌లో 3 వికెట్లు
పుదుచ్చేరిపై పంజాబ్ గెలుపు
ముస్తాక్ అలీ టి20 టోర్నమెంట్
సాక్షి, హైదరాబాద్: టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (9 బంతుల్లో 34; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు; 3/23) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. దేశవాళీ టి20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘సి’లో భాగంగా గురువారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ జట్టు 54 పరుగుల తేడాతో పుదుచ్చేరిపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.
‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అభిషేక్ క్రీజులో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించగా... సలీల్ అరోరా (44 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), సాన్‌వీర్ సింగ్ (38; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), నమన్ ధీర్ (37; 3 ఫోర్లు, 1 సిక్స్), రమణ్‌దీప్ సింగ్ (34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) తలాకొన్ని పరుగులు చేశారు. పుదుచ్చేరి బౌలర్లలో విజయ్ రాజా రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో పుదుచ్చేరి 18.4 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. సిదాక్ సింగ్ (61; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేయగా... మిగిలిన వాళ్లు విఫలమయ్యారు.
ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అభిషేక్ 4 ఓవర్లలో 23 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఆయుశ్ గోయల్ 3 వికెట్లు తీశాడు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లాడిన పంజాబ్ 3 విజయాలు, 2 పరాజయాలతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకొని గ్రూప్ ‘సి’లో రెండో స్థానంలో ఉంది. ఇదే గ్రూప్‌లో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో హర్యానా 7 వికెట్ల తేడాతో హిమాచల్ ప్రదేశ్‌పై గెలిచింది.
ముంబైకి కేరళ షాక్
ముస్తాక్ అలీ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ ముంబై జట్టుకు షాక్ తగిలింది. ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు 15 పరుగుల తేడాతో కేరళ చేతిలో పరాజయం పాలైంది. మొదట కేరళ 20 ఓవర్లలో 5 వికెట్లకు 178 పరుగులు చేసింది. కెప్టెన్ సంజూ సామ్సన్ (28 బంతుల్లో 46; 8 ఫోర్లు, 1 సిక్స్), విష్ణు వినోద్ (43 నాటౌట్; 3 ఫోర్లు), మొహమ్మద్ అజహరుద్దీన్ (32; 3 ఫోర్లు), ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ షర్ఫుద్దీన్ (15 బంతుల్లో 35 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు.
ముంబై బౌలర్లలో శివమ్ దూబే, శార్దుల్ ఠాకూర్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం ముంబై జట్టు అనూహ్యంగా ఓడింది. లక్ష్యం పెద్దది కాకపోయినా... ముంబై జట్టు 19.4 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. గత మ్యాచ్ సెంచరీ హీరో సర్ఫరాజ్ ఖాన్ (40 బంతుల్లో 52; 8 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో రాణించగా... టీమిండియా టి20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (32; 4 ఫోర్లు), అజింక్యా రహానే (32; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు.
అయితే ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో కేరళ బౌలర్ కేఎమ్ ఆసిఫ్ మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. తొలి బంతికి సాయిరాజ్ పాటిల్ (13)ను అవుట్ చేసిన అతడు... మూడో బంతికి సూర్యకుమార్ యాదవ్‌ను, నాలుగో బంతికి శార్దుల్ ఠాకూర్ (0)ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఒక్కసారిగా ఒత్తిడిలో పడ్డ ముంబై విజయానికి దూరమైంది. ఆసిఫ్ 24 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.
ఇతర మ్యాచ్‌ల్లో రాజస్తాన్ 2 వికెట్ల తేడాతో సౌరాష్ట్రపై, అస్సాం 58 పరుగుల తేడాతో విదర్భపై, ఉత్తరప్రదేశ్ 40 పరుగుల తేడాతో చండీగఢ్‌పై, జార్ఖండ్ 7 వికెట్ల తేడాతో ఉత్తరాఖండ్‌పై, గోవా 5 వికెట్ల తేడాతో బిహార్‌పై, ఢిల్లీ 5 వికెట్ల తేడాతో కర్ణాటకపై, ఒడిశా ఒక పరుగు తేడాతో రైల్వేస్‌పై, మధ్యప్రదేశ్ 21 పరుగుల తేడాతో మహారాష్ట్రపై, తమిళనాడు 61 పరుగుల తేడాతో త్రిపురపై విజయాలు సాధించాయి.


