రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువలో 6.7% పెరిగిన వ్యవసాయ వాటా
రెండేళ్లుగా వ్యవసాయంలో పురోగతి
వరిలో పంజాబ్‌ను దాటేసిన తెలంగాణ
వైఎస్ స్ఫూర్తితో కొనసాగుతున్న ఉచిత విద్యుత్ పథకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ రంగం నిరంతర వృద్ధి దిశగా సాగుతోందని ప్రభుత్వం రూపొందించిన ‘రైజింగ్ తెలంగాణ డాక్యుమెంట్’స్పష్టం చేస్తోంది. సుస్థిర వ్యవసాయ విధానాలు, రైతు సంక్షేమ పథకాల అమలు, క్షేత్రస్థాయి విస్తరణ ఫలితంగా తెలంగాణలో వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం...గత రెండేళ్లలో వ్యవసాయ రంగం రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువలో (జీఎస్‌వీఏ:గ్రాస్ స్టేట్ వ్యాల్యూ యాడెడ్) 6.7 శాతం పెరుగుదలను నమోదు చేయడం అందుకు నిదర్శనం.
2023–24లో వ్యవసాయ రంగం విలువ రూ.1,00,004 కోట్లు ఉండగా, 2024–25 అంచనాల్లో ఇది రూ. 1,06,708 కోట్లకు పెరిగింది. రైతులకు ఇచ్చిన ప్రోత్సాహం, ఉచిత విద్యుత్, పంట రుణాల మాఫీ, పెట్టుబడి సాయం వంటి చర్యలు వ్యవసాయ రంగాన్ని నిలకడగా ఎదిగేలా చేశాయని ప్రభుత్వం పేర్కొంది.
పంటల సాగు..ఉత్పత్తిలో ముందంజ
పంటల సాగు విస్తీర్ణం, ఉత్పత్తిలోనూ రాష్ట్రం ముందంజలో ఉంది. వరి పంటలో మాత్రం తెలంగాణ దేశంలోనే చరిత్ర సృష్టించింది. సాగు విస్తీర్ణం, దిగుబడిలో పంజాబ్‌ను దాటి నంబర్‌వన్ స్థానంలో నిలిచింది. 2024–25 సీజన్‌లో వరి సాగు 127.03 లక్షల ఎకరాలకు చేరగా, ధాన్యం ఉత్పత్తి 284 లక్షల టన్నులను దాటి రికార్డు నమోదైంది.
పత్తి, మక్కలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు అన్నీ కలిసి మొత్తం సాగు విస్తీర్ణం గతేడాది 209.62 లక్షల ఎకరాల నుంచి ఈ ఏడాది 220.77 లక్షల ఎకరాలకు పెరిగింది. మొత్తం పంట ఉత్పత్తి 296 లక్షల టన్నుల నుంచి 320.62 లక్షల టన్నులకు చేరింది.
ఉచిత విద్యుత్‌కు సబ్సిడీ రూ. 10,444 కోట్లు
ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అమల్లోకి తెచ్చిన వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్‌కు ఏటా దాదాపు రూ.10,444 కోట్లు సబ్సిడీగా చెల్లిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సాయంగా అందించే మొత్తానికి ఎకరాకు రెండు పంటలకు కలిపి రూ.12 వేలుగా చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. మొత్తం 1,57,51,000 ఎకరాలకు 69,86,548 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ నిధులు జమ చేసింది. ఈ ఏడాది వానాకాలం పంటలకు రికార్డు వేగంతో రైతు భరోసా నిధులు పంపిణీ చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం 9 రోజుల్లోనే రూ.8,744 కోట్లు జమ చేసింది.
రైతులకు అండగా ఉంటూ...
» బీమా ఉన్న రైతులు ఏ కారణంతో మరణించినా రూ. 5 లక్షల పరిహారం ఆ బాధిత కుటుంబానికి ప్రభుత్వం అందిస్తోంది. 42.16 లక్షల మంది రైతుల కుటుంబాల పేరిట ప్రభుత్వం జీవిత బీమా కంపెనీకి రైతు బీమా ప్రీమియం చెల్లించింది. గతంలో ఒక్కో రైతుకు రూ.3,400 చొప్పున చెల్లించిన ప్రీమియంను ప్రభుత్వం ఎల్‌ఐసీతో సంప్రదింపులు చేసి ఈసారి రూ.3,225కు తగ్గించింది.
» సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ. 500 అదనంగా చెల్లిస్తున్న ప్రభుత్వం ఈసారి సన్నాలు విక్రయించిన రైతులకు రూ.314 కోట్ల బోనస్ చెల్లించింది.
» గత ఏడాది మార్చి, సెప్టెంబర్‌లో వడగండ్లు, వర్షాలతో నష్టపోయిన 94,462 మంది రైతులకు రూ.95.39 కోట్ల పరిహారం అందించింది. ఇటీవల మార్చి, ఏప్రిల్‌లో వచ్చిన భారీ వర్షాలకు నష్టపోయిన 36,449 మంది రైతులకు రూ.44.19 కోట్ల పరిహారంగా అందించింది.


