సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ దుమ్ములేపుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అభిషేక్.. గురువారం పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
తాను ఎదుర్కొన్న తొలి బంతి నుంచే ప్రత్యర్ధి బౌలర్లను శర్మ ఉతికారేశాడు. ఉప్పల్ మైదానంలో అభిషేక్ క్రీజులో ఉన్నంత సేపు బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 9 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34 పరుగులు చేశాడు. అతడితో పాటు సలీల్ అరోరా(44), రమణ్‌దీప్ సింగ్(34), శన్వీర్ సింగ్(38) కీలక నాక్స్ ఆడారు.
ఫలితంగా పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. పుదుచ్చేరి బౌలర్లలో రాజా రెండు, అయూబ్ తండా, జయంత్ యాదవ్ ఒక్క వికెట్ సాధించారు. అనంతరం లక్ష్య చేధనలో పుదుచ్చేరి 18.4 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది.
సైదక్ సింగ్(61) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. మిగితా బ్యాటర్లందరూ విఫలమయ్యారు. అభిషేక్ శర్మ బౌలింగ్‌లో కూడా మూడు వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు అయూష్ గోయల్ మూడు, హర్‌ప్రీత్ బ్రార్ రెండు వికెట్లు సాధించారు.
కాగా ఈ టోర్నీలో బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ కేవలం 52 బంతుల్లోనే 148 పరుగులు చేసి వరల్డ్ రికార్డు సృష్టించాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ నేపథ్యంలో పంజాబ్ జట్టు నుంచి అభిషేక్ వైదొలిగే అవకాశముంది. టీ20 సిరీస్ డిసెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: దుమ్ములేపిన మహ్మద్ షమీ.. ఇప్పటికైనా కళ్లు తెరవండి!


