ఐపీఎల్-2025 మినీ వేలానికి ముందు టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్, ముంబై స్టార్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) 2025లో ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్న సర్ఫరాజ్.. మంగళవారం లక్నో వేదికగా అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో శతక్కొట్టాడు.
దాదాపు రెండేళ్ల తర్వాత టీ20ల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సర్ఫరాజ్ తన తొలి మ్యాచ్‌లోనే విధ్వంసం సృష్టించాడు. కేవలం 47 బంతుల్లో తన తొలి టీ20 సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ ముంబైకర్ సరిగ్గా వంద పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయి.
సర్ఫరాజ్ మెరుపు ఇన్నింగ్స్‌తో ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. అతడితో వెటరన్ అజింక్య రహానే 42 పరుగులతో రాణించాడు. కాగా గత ఐపీఎల్ సీజన్‌లో వేలం అన్‌సోల్డ్‌గా మిగిలిన సర్ఫరాజ్ ఈసారి ఎలాగైనా ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాడు.
ఐదేసిన శార్థూల్..
ఇక 221 పరుగుల భారీ లక్ష్య చేధనలో అస్సాం జట్టు కేవలం 122 పరుగులకే కుప్పకూలింది. ముంబై కెప్టెన్ శార్ధూల్ ఠాకూర్ ఐదు వికెట్లతో అస్సాం పతనాన్ని శాసించాడు. అతడితో పాటు అథర్వ అంకోలేకర్, సాయిరాజ్ పాటిల్ తలా రెండు వికెట్లు సాధించారు.
చదవండి: క్రికెట్ ప్రపంచంలో తీవ్ర విషాదం.. రాబిన్ స్మిత్ హఠాన్మరణం


