ఇంగ్లండ్ క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ జట్టు దిగ్గజ ఆటగాడు రాబిన్ స్మిత్(62) హఠాన్మరణం చెందారు. ఈ విషయాన్ని రాబిన్ కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. సౌత్ పెర్త్‌లోని తమ ఇంట్లోనే ఆయన ప్రాణాలు విడిచారని వారు చెప్పుకొచ్చారు.
కానీ ఆయన మరణానికి గల కారణాన్ని మాత్రం ప్రస్తుతం వెల్లడించలేదు. పోస్ట్‌మార్టమ్ దర్యాప్తులో మరణ కారణం నిర్ధారించబడుతుందని తెలిపారు. 2004లో రిటైర్మెంట్ తర్వాత ఆయన మద్యానికి బానిసై మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. కానీ స్మిత్ మరణానికి గల కారణాలపై ఊహాగానాలు ప్రసారం చేయవద్దని మీడియాను ఆయన కుటుంబ సభ్యులు అభ్యర్ధించారు.
'ది జడ్జ్'గా పేరొందిన స్మిత్.. మాల్కమ్ మార్షల్, కర్ట్లీ ఆంబ్రోస్ , కోర్ట్నీ వాల్ష్ వంటి పేస్ దళంతో కూడిన వెస్టిండీస్‌పై టెస్ట్ అరంగేట్రం చేశారు. 1988 నుంచి 1996 మధ్య ఇంగ్లండ్ తరఫున 62 టెస్టు మ్యాచ్‌లు ఆడారు. 43.67 సగటుతో 4236 టెస్టు పరుగులు చేశారు. ఆయన కెరీర్‌లో తొమ్మిది టెస్టు సెంచరీలు ఉన్నాయి.
అదేవిధంగా ఆయన 71 వన్డేలలో ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించారు. 1992 ప్రపంచకప్ ఫైనల్‌కు ఇంగ్లండ్ చేరడంలో స్మిత్‌ది కీలక పాత్ర. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన బౌలర్లను సైతం ధైర్యంగా ఎదుర్కోవడంలో ఆయన దిట్ట. 1993లో ఎడ్జ్‌బాస్టన్‌లో ఆస్ట్రేలియాపై వన్డే మ్యాచ్‌లో స్మిత్ ఆడిన ఇన్నింగ్స్(167 నాటౌట్) ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అదుర్స్..
రాబిన్ స్మిత్ డర్బన్‌లో జన్మించినప్పటికీ 1983లో ఇంగ్లండ్‌కు వచ్చి హాంప్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌లో చేరారు. మొత్తంగా 17 సీజన్లలో ఆయన 18,984 ఫస్ట్-క్లాస్ పరుగులు సాధించారు. స్మిత్ మృతిపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.


