టీ20 వరల్డ్‌ కప్‌: ఇంగ్లండ్‌ 'హ్యాట్రిక్‌' | England won by 4 wkts aganist New Zealand | Sakshi
Sakshi News home page

టీ20 వరల్డ్‌ కప్‌: ఇంగ్లండ్‌ 'హ్యాట్రిక్‌'

Feb 27 2026 10:33 PM | Updated on Feb 28 2026 9:49 AM

England won by 4 wkts aganist New Zealand

‘సూపర్‌–8’లో మూడో గెలుపు 

4 వికెట్లతో ఓడిన న్యూజిలాండ్‌ 

విల్‌ జాక్స్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన  

కొలంబో: న్యూజిలాండ్‌తో ‘సూపర్‌ ఎయిట్స్‌’ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ విజయానికి చివరి 3 ఓవర్లలో 43 పరుగులు కావాలి. స్పిన్‌కు బాగా అనుకూలిస్తూ బ్యాటింగ్‌కు కష్టంగా మారిన పిచ్‌పై ఇది అంత సులువు కాదనిపించింది. కానీ ఫిలిప్స్‌ వేసిన 18వ ఓవర్లో జాక్స్, రేహన్‌ కలిసి 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో సహా 22 పరుగులు రాబట్టి లెక్కను సులువు చేశారు. తర్వాతి 9 బంతుల్లో మరో 22 పరుగులు సాధించి మ్యాచ్‌ను ముగించారు. దాంతో ‘సూపర్‌ ఎయిట్స్‌’లో ఆడిన మూడు మ్యాచ్‌లూ గెలిచి ఇంగ్లండ్‌ అగ్రస్థానంతో ముగించగా... గెలిస్తే నేరుగా సెమీస్‌ చేరే అవకాశాన్ని కివీస్‌ పోగొట్టుకుంది. 

శుక్రవారం జరిగిన పోరులో ఇంగ్లండ్‌ 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది.  టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. గ్లెన్‌ ఫిలిప్స్‌ (28 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్‌), టీమ్‌ సీఫెర్ట్‌ (25 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. అనంతరం ఇంగ్లండ్‌ 19.3 ఓవర్లలో 6 వికెట్లకు 161 పరుగులు చేసి గెలిచింది. టామ్‌ బాంటన్‌ (24 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్‌), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ విల్‌ జాక్స్‌ (18 బంతుల్లో 32 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక ప్రదర్శన కనబర్చారు.  

ఓపెనర్లు మినహా... 
తొలి వికెట్‌కు 42 బంతుల్లోనే 64 పరుగులు జోడించి ఓపెనర్లు సీఫెర్ట్, ఫిన్‌ అలెన్‌ (19 బంతుల్లో 29; 3 సిక్స్‌లు) కివీస్‌కు శుభారంభం అందించారు. ఆర్చర్‌ ఓవర్లో సీఫెర్ట్‌ వరుసగా 4, 4, 6 బాదడంతో పవర్‌ప్లేలో జట్టు 54 పరుగులు చేసింది. అయితే రెండు పరుగుల వ్యవధిలో ఓపెనర్లు వెనుదిరగ్గా, తర్వాతి బ్యాటర్లలో ఫిలిప్స్‌ ఒక్కడే చెప్పుకోదగ్గ పరుగులు సాధించాడు. 

ఇతర బ్యాటర్లంతా విఫలం కావడంతో న్యూజిలాండ్‌ తక్కువ స్కోరుకే పరిమితమైంది. తొలి వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ ఆడిన రేహన్‌ అహ్మద్‌ తన తొలి బంతికే రచిన్‌ రవీంద్ర (11)ను అవుట్‌ చేయడంతో జట్టు పతనం మొదలైంది. 38 పరుగుల వ్యవధిలో కివీస్‌ మిడిలార్డర్‌లో నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆఖరి నాలుగు ఓవర్లలో జట్టు 27 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

సమష్టి ప్రదర్శన... 
ఛేదనలో ఇంగ్లండ్‌ ఓపెనర్లు సాల్ట్‌ (2), బట్లర్‌ (0) మరోసారి విఫలమయ్యారు. అయితే ఆ తర్వాత హ్యారీ బ్రూక్‌ (24 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్‌), బెతెల్‌ (16 బంతుల్లో 21; 4 ఫోర్లు) కలిసి కీలక పరుగులు జోడించారు. వీరిద్దరి తర్వాత బాంటన్‌ బాధ్యత తీసుకోగా, స్యామ్‌ కరన్‌ (22 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్‌) అండగా నిలిచాడు. 

అయితే ఈ ఇద్దరినీ కూడా తక్కువ వ్యవధిలో అవుట్‌ చేసి కివీస్‌ విజయంపై ఆశలు పెంచుకుంది. కానీ జాక్స్, రేహన్‌ అహ్మద్‌ (7 బంతుల్లో 19 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కలిసి అంతా మార్చేశారు. 16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో అభేద్యంగా 44 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. 

స్వదేశానికి మ్యాట్‌ హెన్రీ... 
కొలంబో: న్యూజిలాండ్‌ ప్రధాన పేస్‌ బౌలర్‌ మ్యాట్‌ హెన్రీ వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి పయనమయ్యాడు. తన భార్య హాలీ రెండో బిడ్డకు జన్మనివ్వనుండటంతో ఆ సమయంలో కుటుంబంతో ఉండేందుకు హెన్రీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ తర్వాత అతను న్యూజిలాండ్‌కు బయల్దేరాడు. జట్టు హెడ్‌ కోచ్‌ రాబ్‌ వాల్టర్‌ ఈ విషయాన్ని వెల్లడించాడు. నేడు జరిగే పాక్, శ్రీలంక మ్యాచ్‌ ఫలితం తర్వాత కివీస్‌ సెమీస్‌కు చేరితే హెన్రీ మళ్లీ తిరిగి వచ్చి జట్టుతో కలుస్తాడు.  

స్కోరు వివరాలు  
న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: సీఫెర్ట్‌ (స్టంప్డ్‌) బట్లర్‌ (బి) రషీద్‌ 35; అలెన్‌ (సి) బెతెల్‌ (బి) జాక్స్‌ 29; రచిన్‌ (సి) బెతెల్‌ (బి) రేహన్‌ 11; ఫిలిప్స్‌ (బి) జాక్స్‌ 39; చాప్‌మన్‌ (స్టంప్డ్‌) బట్లర్‌ (బి) రషీద్‌ 15; మిచెల్‌ (సి) జాక్స్‌ (బి) డాసన్‌ 3; సాంట్నర్‌ (నాటౌట్‌) 9; మెక్‌కోన్‌కీ (బి) రేహన్‌ 14; హెన్రీ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–64, 2–66, 3–97, 4–123, 5–133, 6–135, 7–152. బౌలింగ్‌: ఆర్చర్‌ 3–1–24–0, డాసన్‌ 4–0–32–1, కరన్‌ 1–0–10–0, రషీద్‌ 4–0–28–2, జాక్స్‌ 4–0–23–2, బెతెల్‌ 1–0–13–0, రేహన్‌ 3–0–28–2.  

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (సి) సీఫెర్ట్‌ (బి) హెన్రీ 2; బట్లర్‌ (సి) సీఫెర్ట్‌ (బి) ఫెర్గూసన్‌ 0; బ్రూక్‌ (సి) మిచెల్‌ (బి) ఫిలిప్స్‌ 26; బెతెల్‌ (సి) ఫిలిప్స్‌ (బి) రచిన్‌ 21; బాంటన్‌ (సి) చాప్‌మన్‌ (బి) రచిన్‌ 33; కరన్‌ (సి) ఫిలిప్స్‌ (బి) రచిన్‌ 24; జాక్స్‌ (నాటౌట్‌) 32; రేహన్‌ (నాటౌట్‌) 19; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19.3 ఓవర్లలో 6 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1–2, 2–2, 3–50, 4–58, 5–100, 6–117.  బౌలింగ్‌: హెన్రీ 2.3–0–19–1, ఫెర్గూసన్‌ 2–0–14–1, సాంట్నర్‌ 4–0–29–0, మెక్‌కోన్‌కీ 1–0–13–0, ఫిలిప్స్‌ 4–0–43–1, రచిన్‌ 4–0–19–3, సోధి 2–0–21–0. 

Advertisement
 
Advertisement
Advertisement