ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్.. ఆస్ట్రేలియా గడ్డపై తన టెస్టు సెంచరీ నిరీక్షణకు తెరదించాడు. గత 12 ఏళ్ల ప్రయత్నిస్తున్న జోరూట్ ఎట్టకేలకు తన కలను నేరవేర్చుకున్నాడు. యాషెస్ సిరీస్ 2025-26లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రూట్ సెంచరీతో చెలరేగాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన రూట్ జట్టు బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు.
ఓపెనర్ జాక్ క్రాలీతో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో రూట్ 181 బంతుల్లో తన 40వ టెస్టు సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా ఇది అతడికి 59వ అంతర్జాతీయ సెంచరీ కావడం గమనార్హం. ఈ ఇంగ్లీష్ వెటరన్ బ్యాటర్ 2025 ఏడాదిలో ఇప్పటికే 4 టెస్ట్ సెంచరీలు నమోదు చేశాడు. రూట్ ప్రస్తుతం 135 పరుగులతో అజేయంగా క్రీజులో ఉన్నాడు.
తొలి రోజు ఇంగ్లండ్‌దే..
యాషెస్ రెండో టెస్టు తొలి రోజు ఆటలో కంగారుల జట్టుపై ఇంగ్లండ్ పై చేయి సాధించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రూట్‌తో పాటు ఆర్చర్(32 నాటౌట్) ఉన్నాడు.
వీరిద్దరూ పదో వికెట్‌కు 61 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. మిచెల్ స్టార్క్ నిప్పులు చెరగడంతో ఇంగ్లండ్ తొలి రోజే ఆలౌటైట్లు కన్పించింది. కానీ రూట్, ఆర్చర్ ఆఖరి వికెట్ కోల్పోకుండా పోరాడారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ మరోసారి ఆరు వికెట్లు పడగొట్టగా.. నసీర్, బోలాండ్ తలా వికెట్ సాధించారు.
చదవండి: IND vs SA: సొంత తెలివితేటలు వద్దు.. చెబితే నీకు అర్ధం కావడం లేదా?


