ఇంగ్లండ్‌తో పింక్ బాల్ టెస్టుకు ముందు ఆస్ట్రేలియా జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో పాటు స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ ఈ మ్యాచ్‌కు దూరమైన విషయం తెలిసిందే. గాయాల బెడద వల్ల వీరిద్దరు ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు కూడా దూరమైనట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (Cricket Australia) ఇటీవలే వెల్లడించింది.
యాషెస్ సిరీస్‌తో బిజీ
అయితే, తాజా సమాచారం ప్రకారం ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (Usman Khawaja) కూడా వెన్నునొప్పి నుంచి పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. దీంతో అతడు కూడా జట్టుకు దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాగా సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌తో బిజీగా ఉంది ఆస్ట్రేలియా.
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా తొలి టెస్టులో ఇంగ్లండ్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది ఆసీస్. రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ గైర్హాజరీలో స్టీవ్ స్మిత్ (Steve Smith) జట్టును ముందుకు నడిపించగా.. పిచ్ పరిస్థితుల దృష్ట్యా కేవలం రెండు రోజుల్లోనే ఈ మ్యాచ్ ముగిసిపోయింది. ఇక ఇరుజట్ల మధ్య డిసెంబరు 4-8 మధ్య బ్రిస్బేన్‌లోని గాబా వేదికగా రెండో టెస్టు జరుగనుంది.
ఖవాజా సైతం..
పింక్‌బాల్‌తో జరిగే ఈ డై- నైట్ టెస్టుకు సంబంధించి ఆస్ట్రేలియా ఇప్పటికే జట్టును ప్రకటించింది. కమిన్స్‌తో పాటు హాజిల్‌వుడ్ గాయాల వల్ల అందుబాటులో లేకుండా పోయారని తెలిపింది. అయితే, ఇప్పుడు ఖవాజా ఫిట్‌నెస్ సమస్య ఆసీస్‌కు తలనొప్పిగా మారింది. పెర్త్ టెస్టు సందర్భంగా ఖవాజాకు వెన్ను నొప్పి తిరగబెట్టింది.
గత మూడు మ్యాచ్‌లు ఆడిన ఏకైక ఆటగాడు అతడే
ఈ క్రమంలోనే తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు ఆలస్యంగా క్రీజులోకి వచ్చిన ఖవాజా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఓపెనింగ్ చేయలేదు. ఇక పింక్‌బాల్ టెస్టుకు సన్నద్ధమయ్యే క్రమంలోనూ అతడు వెన్నునొప్పితో బాధపడినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. ముప్పై నిమిషాల పాటు జరిగిన సెషన్‌లో బ్యాటింగ్ చేసేందుకు అతడు ఇబ్బందిపడినట్లు పేర్కొంది.
దీంతో రెండో టెస్టుకు ఖవాజా అందుబాటులో ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అతడు ఈ మ్యాచ్‌కు దూరమైతే జట్టుకు కష్టమే. గాబాలో గత మూడు పింక్ బాల్ టెస్టుల్లోనూ ఆడిన అనుభవం ప్రస్తుత జట్టులో అతడికి మాత్రమే ఉంది. కాగా ఖవాజా గనుక ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు దూరమైతే బ్యూ వెబ్‌స్టర్, జోష్ ఇంగ్లిస్‌ల రూపంలో బ్యాకప్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
ఇంగ్లండ్‌తో పింక్‌బాల్ టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు
స్టీవ్ స్మిత్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, బ్రెండన్ డాగెట్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియోన్, మైఖేల్ నెజర్, మిచెల్ స్టార్క్, జేక్ వెదర్‌రాల్డ్, బ్యూ వెబ్‌స్టర్.
చదవండి: రోహిత్‌తో గంభీర్ ముచ్చట!.. అవేమీ వద్దన్న కోహ్లి!.. బీసీసీఐ సీరియస్!


