భారత క్రికెట్ వర్గాల్లో టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ భవిత్యం గురించే ప్రస్తుతం చర్చ. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఫర్వాలేదనిపిస్తోన్నా.. టెస్టు ఫార్మాట్లో మాత్రం అతడి మార్గదర్శనంలో భారత్ చేదు ఫలితాల్ని చవిచూస్తోంది.
గతేడాది న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్‌వాష్ అయిన భారత జట్టు.. తాజాగా సౌతాఫ్రికా చేతిలో 2-0తో చిత్తుగా ఓడింది. ఈ నేపథ్యంలో గంభీర్ కోచింగ్ శైలిపై విమర్శల వర్షం కురుస్తోంది. దిగ్గజాలు విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ అకస్మాత్ రిటైర్మెంట్ ప్రకటనల వెనుక గంభీర్ హస్తం ఉందనే ఆరోపణలు వచ్చాయి.
విమర్శలు.. రాజీనామాకు డిమాండ్
అదే విధంగా టెస్టుల్లో కీలకమైన మిడిలార్డర్‌లో మార్పులతో ప్రయోగాలకు దిగుతున్న గంభీర్ ( (Gautam Gambhir)) వల్లే కూర్పు దెబ్బతింటోందనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హెడ్‌కోచ్‌గా అతడిని తొలగించాలనే డిమాండ్లు వస్తుండగా.. భారత దిగ్గజాలు సునిల్ గావస్కర్, అశ్విన్ వంటి వాళ్లు మాత్రం గౌతీకి మద్దతుగా నిలుస్తున్నారు. కోచ్ కేవలం శిక్షణ వరకే పరిమితమని.. ఈ వైఫల్యానికి ఆటగాళ్లే ప్రధాన కారణమని మండిపడుతున్నారు.
అండగా ఉంటామని చెప్పినా..
ఇక బీసీసీఐ (BCCI) సైతం గంభీర్‌కు తాము మద్దతుగా ఉంటామనే సంకేతాలు ఇచ్చింది. అతడి కాంట్రాక్టు 2027 వరకు కొనసాగుతుందని బోర్డు వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. గంభీర్‌కు అండగా ఉంటామని చెప్పినప్పటికీ అతడి వ్యవహారశైలిపై మాత్రం బోర్డు అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
గంభీర్ తీరుపై గుర్రుగా ఉన్న బీసీసీఐ!
ప్రధానంగా మీడియా సమావేశంలో గంభీర్ దూకుడుగా మాట్లాడటం తమను చిక్కుల్లో పడేస్తోందనే యోచనలో బోర్డు పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల భారత్- సౌతాఫ్రికా (IND vs SA) తొలి టెస్టుకు వేదికైన కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై విమర్శలు రాగా.. తానే కావాలని పిచ్ అలా తయారు చేయించానని గంభీర్ అంగీకరించిన విషయం తెలిసిందే.
అదే విధంగా.. బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పుల గురించి, యువ పేసర్ హర్షిత్ రాణాను ఆడించే విషయమై గంభీర్ ఘాటుగా స్పందించిన విధానం బీసీసీఐని కాస్త ఇరుకునపెట్టినట్లు తెలుస్తోంది. స్పెషలిస్టులను పక్కనపెట్టి.. ఆల్‌రౌండర్లకు పెద్దపీట వేస్తూ గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా విమర్శలకు కారణమవుతున్నాయి. ఈ పరిణామాలన్నీ బోర్డుకు అసంతృప్తి కలిగించినట్లు సమాచారం.
ఒకవేళ విఫలమైతే.. అంతే సంగతులు
ఏదేమైనా ఇప్పటికిప్పుడు గంభీర్‌కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేకపోయినా.. టీ20 ప్రపంచకప్-2026 తర్వాత మాత్రం అతడిపై ఫోకస్ పెరగనుంది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ చాంపియన్‌గా నిలిచిన ఆ క్రెడిట్ మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్‌దేనని అంతా అంటున్న మాట. ఇలాంటి తరుణంలో వరల్డ్‌కప్ టోర్నీలో భారత్‌ను విజేతగా నిలిపితేనే గంభీర్ భవిష్యత్తు సజావుగా సాగిపోతుంది. లేదంటే.. అతడిపై వేటు పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు!!


