పుస్తక పఠనం అనేది అనేక మందికి ఇష్టమైన అభిరుచి. రోజూ ఏదో ఒక పుస్తకం చదివితేగానీ నిద్రపట్టనివాళ్లు అనేక మంది ఉన్నారు. పుస్తక అధ్యయనం వికాసాన్ని, విజ్ఞానాన్ని ఈ సమాజానికి అందిస్తుంది. మనిషిలోని ఒత్తిడిని తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుంది. అంతేకాదు.. పుస్తక పఠనం మనకు వివిధ భాషలపై పట్టును పెంచుతుంది. అలాంటి పుస్తకాలకు నగరంలో మంచి గిరాకీ ఉంది. అయితే కొత్త పుస్తకాలతో పాటు పాత పుస్తకాలకూ విక్రయ కేంద్రాలు ఉన్నాయి.
అలాంటి విక్రయకేంద్రాలు నగరంలో సెకండ్ హ్యాండ్ పుస్తకాల కేంద్రాలు పుస్తక ప్రేమికుల కలలను సాకారం చేస్తున్నాయి. నచ్చిన అక్షరాలను నట్టింట కొలువుదీర్చాలని తహతహలాడే అక్షర యోధులకు ఇవి వరంలా మారుతున్నాయి. ఆన్‌లైన్‌లో వేలు, లక్షల కోట్ల పేజీలు అందుబాటులో ఉన్నా.. కాగితం స్పర్శ మేల్కొలిపే సంతృప్తికి అలవాటు పడిన వారి ఆదరణతో పలు బుక్ స్టోర్స్ సందడిగా మారుతున్నాయి.
కొత్త పుస్తకాలు రోజురోజుకీ ఖరీదుగా మారుతుంటే, పాత పుస్తకాల మార్కెట్ మాత్రం ఇంకా పాఠకుల ఉత్సాహాన్ని ప్రోత్సహిస్తూనే ఉంది. సెకండ్ హ్యాండ్ పుస్తకాల మార్కెట్లు నగరంలో ఎన్నో చోట్ల పుస్తక ప్రియుల పయనానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ఇటీవల, లూనా ఆఫ్ ది షెల్ఫ్ వంటి అత్యాధునిక పుస్తక దుకాణాలు నగరం అంతటా పుట్టుకొచ్చాయి. ఇవి మన సిటీ ఆధునిక గుర్తింపును ప్రతిబింబిస్తాయి. అయితే బుక్ రీడింగ్‌లో ఎన్ని కొత్త పోకడలు వచి్చనా నగరం ఇప్పటికీ ఆదరణ కోల్పోని సెకండ్ హ్యాండ్ పుస్తక సంస్కృతిని నిలబెడుతోంది. దీనికి నగరంలో సెకండ్ హ్యాండ్ బుక్ కల్చర్‌కు కేరాఫ్‌గా నిలుస్తున్న కొన్ని విక్రయ ప్రదేశాలు ఊపునిస్తున్నాయి.
అక్షరాల.. ‘సంత’సం..
నగరంలోని అతిపెద్ద సెకండ్ హ్యాండ్ పుస్తక మార్కెట్ ప్రతి ఆదివారం అబిడ్స్ రోడ్ చుట్టుపక్కల మేల్కొంటుంది. ఇక్కడ కొలువుదీరే స్టాల్స్‌లో కనిష్టంగా రూ.50 నుంచి ప్రారంభమయ్యే పుస్తకాలు, సాహిత్యం లభిస్తుంది. వీటిలో బెస్ట్ సెల్లర్లు, వింటేజ్ మ్యాగజైన్‌లు (నాట్ జియో, వోగ్, టాప్ గేర్), క్లాసిక్ ఫిక్షన్, క్రిస్టియన్ డియోర్ జీవిత చరిత్రలు, పెర్షియన్ వాల్యూమ్ వంటి చెప్పుకోదగ్గ ఆవిష్కరణలు ఉన్నాయి. దాదాపు ఐదు దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ వీధి మార్కెట్ ప్రతి ఆదివారం పుస్తకాల పండుగలా మారిపోతుంది. అరుదైన ఎడిషన్లు, పాత సాహిత్య విశేషాల వరకు అనేకం ఇక్కడ దొరుకుతాయి. ఇంగ్లిష్, తెలుగు, హిందీతో పాటు ప్రపంచ సాహిత్య పుస్తకాలు కూడా లభిస్తాయి.
పాత పుస్తకాలకూ చరిత్ర..
అబిడ్స్‌లో ఉన్న బెస్ట్ బుక్ సెంటర్ నగరంలోని ప్రచురణ కర్తలకు విశ్వసనీయమైన పేరు. ఈ స్టోర్ పాత, ముద్రణ నిలిచిపోయిన, ద్వితీయ శ్రేణి సాహిత్యాన్ని అందించడంలో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. అభ్యర్థన మేరకు కొన్ని సోర్సింగ్ పుస్తకాలను కూడా అందిస్తుంది. ఇది 25 సంవత్సరాలకు పైగా హైదరాబాదీలకు తమ సేవలు అందిస్తోంది. ఉపయోగించిన నవలల విక్రయంలో యూనిక్ బుక్ సెంటర్ నమ్మదగిన స్టాప్. ఖైరతాబాద్‌లో ఉన్న ఈ స్టోర్.. మంచి పాత పుస్తకాలకు చిరునామాగా నిలుస్తుంది. ఈ విక్రయ కేంద్రం వారమంతా తెరిచి ఉంటుంది.
వింజేట్ నవలలు, మ్యాగజైన్‌లు..
ఊ కొత్తవి, అలాగే పాత పుస్తకాలకు కూడా నెలవై, గచ్చిబౌలిలో రెండు అంతస్తుల్లో కొలువుదీరిన బుక్ మార్క్ బుక్ లవర్స్‌కి స్వర్గధామం. గ్రౌండ్ ఫ్లోర్‌లో కొత్త రిలీజ్‌లు, స్టేషనరీ ప్రసిద్ధ కల్పన సాహిత్యం ఉంటాయి. పై అంతస్తులో 70–80ల నాటి ఫిక్షన్, విద్యా రచనలు వింటేజ్ మ్యాగజైన్‌లు వంటి సెకండ్ హ్యాండ్ బుక్స్ ఉన్నాయి.
బేగంపేట టోలిచౌకిలో ఉన్న ఎంఆర్ బుక్ సెంటర్ విభిన్న జాబితాతో నిండిన విశాలమైన దుకాణం. ఇది గ్రాఫిక్ నవలలు, మాంగా నుంచి వింటేజ్ నాన్–ఫిక్షన్ వరకూ అనేక రకాల రచనలు అందుబాటులో ఉంచుతుంది. పలు అరుదైన, పాత స్టాక్‌ను భారీ తగ్గింపు ధరలకు అందిస్తుంది.
చౌక్‌కి మసీదు సమీపంలోని ఓల్డ్ సిటీలోని ముర్గి చౌక్‌లో బుక్ కలెక్టర్ల స్థావరం హాజిక్ మోహి. చిన్నపాటి స్థలంలో అంటే 400 చదరపు అడుగుల దుకాణంలో 1972 నుంచి పుస్తక ప్రియులకు సేవలు అందిస్తోంది. ఉర్దూ, అరబిక్, పర్షియన్, ఇంగ్లిష్, తెలుగు ఫార్సీ భాషల్లో 10,000 కంటే ఎక్కువ పురాతన పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. దీనిని నగరం నుంచే కాదు ప్రపంచవ్యాప్తంగా చరిత్రకారులు, రచయితలు సందర్శిస్తారు.


