డమాస్కస్: సిరియాలో తిష్టవేసిన ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్‌ఐఎస్) ఉగ్రవాద ముఠాలను మట్టుబెట్టడమే లక్ష్యంగా అమెరికా సైన్యం శనివారం భారీ దాడులు చేపట్టింది. అమెరికా తూర్పు తీర కాలమానం ప్రకారం మధ్యాహ్నం సమయంలో ఈ దాడులు జరిగినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. సిరియా వ్యాప్తంగా ఉన్న ఐసిస్ నెట్‌వర్క్‌ను మట్టికరిపించే ఉద్దేశంతో ఈ ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అయితే, ఈ మెరుపు దాడుల్లో ప్రాణనష్టం ఏ మేరకు జరిగిందనే వివరాలను పెంటగాన్ ఇప్పటి వరకూ వెల్లడించలేదు.
గత డిసెంబర్ 13న సిరియాలో ఐసిస్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇద్దరు అమెరికా సైనికులతో పాటు ఒక అనువాదకుడు మృతి చెందారు. ఈ ఘటనను అమెరికా తీవ్రంగా పరిగణించింది. తమ వ్యూహాత్మక సైనిక చర్యలో భాగంగానే ఈ తాజా దాడులు నిర్వహించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ప్రస్తుతం సిరియాలో సుమారు వెయ్యి మంది అమెరికా సైనికులు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని సమాచారం. గత కొద్ది నెలలుగా అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు సిరియాలో ఐసిస్ అనుమానితులపై గగనతల, భూతల దాడులు నిర్వహిస్తున్నాయి.
13 ఏళ్ల అంతర్యుద్ధం దరిమిలా 2024లో మాజీ అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్‌ను తిరుగుబాటుదారులు గద్దె దించారు. వీరి నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం, అమెరికాకు పూర్తి స్థాయిలో సహకరిస్తోంది. గత ఏడాది చివరిలో సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షారా వైట్ హౌస్ సందర్శించిన సందర్భంగా ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఈ ఉమ్మడి దాడులు కొనసాగుతున్నాయి. ప్రస్తుత సిరియా ప్రభుత్వంలో అల్-ఖైదాతో సంబంధం కలిగిన సభ్యులు కూడా ఉన్నారు. వీరు కూడా ఐసిస్ గ్రూపును వ్యతిరేకిస్తూ, అమెరికాతో కలిసి ఐసిస్ అణచివేతకు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే గడిచిన కొన్ని నెలలుగా సిరియా భద్రతా దళాలు కూడా అమెరికా సంకీర్ణ దళాలతో కలిసి దాడుల్లో పాల్గొంటున్నాయి. ఐసిస్ ఉగ్రవాద ముఠాను తుడిచిపెట్టడమే లక్ష్యంగా, అంతర్జాతీయ సహకారంతో ఈ ఆపరేషన్ ముందుకు సాగుతోంది.


