టైటిల్ : ది రాజాసాబ్
నటీనటులు: ప్రభాస్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్, సంజయ్ దత్, బొమన్ ఇరానీ, తదితరులు
నిర్మాణ సంస్థ: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్
రచన-దర్శకత్వం: మారుతి
సంగీతం: తమన్
సినిమాటోగ్రఫీ: కార్తీక్ పళని
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
విడుదల తేది: జనవరి 9,2026

ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ఆయన నటించిన తొలి హారర్ ఫాంటసీ మూవీ ‘ది రాజాసాబ్’ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. దానికి తోడు సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో రాజాసాబ్‌పై దేశ వ్యాప్తంగా హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జనవరి 9)ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ(The Raja Saab Movie Review)లో చూద్దాం

కథేంటంటే..
రాజు అలియాస్ రాజాసాబ్(ప్రభాస్)కి నాన్నమ్మ గంగాదేవి(జరీనా) అంటే ప్రాణం. ఆమెకు అల్జీమర్స్ వ్యాధి సోకడంతో ఏ విషయానైనా ఎక్కువసేపు గుర్తుపెట్టుకోదు. కానీ తనకు దూరమైన భర్త కనకరాజు(సంజయ్ దత్)ని మాత్రం మర్చిపోదు. ఎప్పటికైనా భర్తను కలవాలని..అతని కోసం వెతుకుతూ ఉంటుంది. ఆయన హైదరాబాద్‌లో ఉన్నాడని తెలిసి..తాత కోసం రాజాసాబ్ సిటీకి వెళ్తాడు. అక్కడ బ్లెస్సీ(నిధి అగర్వాల్)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు.
అదే సమయంలో అతన్ని వెతుక్కుంటూ వచ్చిన భైరవి(మాళవిక మోహన్)..రాజాసాబ్‌తో ప్రేమలో పడుతుంది. ఆమె ద్వారా తాత నర్సాపూర్ అడవిలో ఉన్న ఓ కోటలో ఉన్నట్లు తెలుసుకొని అక్కడికి వెళ్తాడు. ఆ కోటలోకి వెళ్లిన తర్వాత రాజాసాబ్‌కి ఎదురైన సమస్యలు ఏంటి? చనిపోయిన తాత ఆత్మ ఆ కోటలోనే ఎందుకు ఉంది? కనకరాజు నేపథ్యం ఏంటి? దేవనగర సామ్రాజ్యపు జమీందారి అయిన గంగా... సామాన్యురాలిగా ఎందుకు బతకాల్సి వచ్చింది? ఈ కథలో గంగరాజు(సముద్రఖని) పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే( The Raja Saab Movie Review).

ఎలా ఉందంటే..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో సినిమా అనగానే మారుతిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేశారు. అయితే టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత ట్రోల్ చేసిన వాళ్లే మారుతిపై ప్రశంసలు కురిపించారు. ప్రభాస్‌ని స్టైలీష్ లుక్‌లో చూపించడమే కాకుండా ఆయనలో దాగిఉన్న కామెడీ యాంగిల్‌ని చాలాకాలం తర్వాత మరోసారి బయటకు తీశాడని మారుతిపై పొగడ్తల వర్షం కురిపించారు. ఒకరకంగా ట్రైలర్ రిలీజ్ తర్వాతే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే ఆ అంచనాలను మాత్రం మారుతి పూర్తిగా అందుకోలేకపోయాడు. ప్రభాస్ ఇమేజ్‌కి తగ్గట్లుగానే కథను రాసుకున్నా.. దాన్ని హ్యాండిల్ చేయడంలో మాత్రం తడబడ్డాడు. ప్రభాస్ ఇమేజ్‌ని దృష్టిలో పెటుకోనే కొన్ని అనవసరపు సన్నివేశాలను ఇరికించి..అసలు కథకి అన్యాయం చేశాడేమో అనిపిస్తుంది.
ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్ చెప్పినట్లుగా ఇది నాన్నమ్మ-మనవడి కథే. నేపథ్యం కూడా కాస్త కొత్తగానే ఉంది. అయితే ఈ కథని గందరగోళం లేకుండా ఆసక్తికరంగా చూపించడంలో దర్శకుడు పూర్తిగా సఫలం కాలేదు. స్క్రీన్‌ప్లే విషయంలో చాలా లోపాలు ఉన్నాయి. సీన్ల పరంగా చూస్తే సినిమా బాగుంది అనిపించినా.. ఓవరాల్‌గా మాత్రం ఏదో మిస్ అవుతుందన్న ఫీలింగ్ కలుగుతుంది. మారుతి రాసుకున్న కామెడీ సన్నివేశాలు.. ప్రభాస్ నటన ఆ లోపాన్ని కాస్త కప్పిపుచ్చాయనే చెప్పాలి. సినిమాలో హారర్ ఎలిమెంట్స్ మెండుగానే ఉన్నా.. ఒకటి,రెండు సీన్లు తప్ప మిగతావేవి భయపెట్టలేదు

కమెడియన్ సత్య కోటలోకి అడుగుపెట్టే సన్నివేశంతో కథ ఆసక్తికరంగా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత సాంగ్‌తో ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత కథనం కాసేపు నాన్నమ్మ-మనవడిల చుట్టూనే తిరుగుతుంది. వీరిద్దరి మధ్య సన్నివేశాలు బాగుంటాయి. తాత కోసం హీరో హైదరాబాద్ వెళ్లడం..అక్కడ బ్లెస్సీ, భైరవిలతో ప్రేమాయణం..ఇవన్నీ ఎంటర్‌టైనింగ్‌గా సాగుతూనే..మధ్యలో గంగరాజు పాత్రని చూపిస్తూ.. ఆయనకు తాతకు మధ్య ఏదో సంబంధం ఉందనే క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో కలిపించారు. ఇక తాత నేపథ్యం చెప్పినప్పటి నుంచి కథనంపై ఆసక్తి పెరుగుతుంది. కనకరాజు-గంగాదేవి ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ బాగుంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. (Positives And Negatives In Rajasaab Movie)
ఇక ద్వితీయార్ధంలో కథనం మొత్తం అడవిలొ ఉన్న కోట చుట్టూనే తిరుగుతుంది. ఆ కోట నుంచి బయటకు వెళ్లేందుకు హీరో బృందం ప్రయత్నించడం.. వారిని తాత ఆత్మ అడ్డుకోవడం.. ఈ క్రమం వచ్చే సీన్లు నవ్వులు పూయిస్తాయి. కొన్ని సన్నివేశాలు మారుతి తెరకెక్కించిన ప్రేమకథా చిత్రమ్ మూవీని గుర్తుకు చేస్తాయి. హారర్ కంటే కామెడీ, రొమాంటిక్ సీన్లే బాగా పేలాయి. ప్రీక్లైమాక్స్ నుంచి కథనం ఆసక్తికరంగా మారుతుంది. ఆస్పత్రి సీన్ ఎమోషనల్‌కు గురి చేస్తుంది. క్లైమాక్స్ కొత్తగా ప్రయత్నించారు. ఇంతకు ముందుకు వచ్చిన హారర్ కామెడీ చిత్రాలకు భిన్నంగా ఈ మూవీ క్లైమాక్స్ ఉంటుంది.

ఎవరెలా చేశారంటే..
చాలా కాలం తర్వాత ప్రభాస్‌ని తెరపై కొత్తగా చూస్తారు. ఆయన కామెడీ టైమింగ్ సినిమాను నిలబెట్టింది. సీరియస్ విషయాన్ని కూడా కాస్త వెటకారంగా చెబుతూ..నాన్నమ్మ కోసం ఎంతకైనా తెగించే రాజాసాబ్ పాత్రలో ప్రభాస్ ఒదిగిపోయాడు. ఆయన పంచ్‌లు, ఫైట్స్ అన్నీ వింటేజ్ ప్రభాస్‌ని గుర్తు చేస్తాయి. యాక్షన్‌తో పాటు ఎమోషనల్ సీన్లలోనూ ఇరగదీశాడు. ఆస్పత్రి సీన్‌లో ప్రభాస్ నటన అదిరిపోతుంది. హీరోయిన్లలో మాళవికకు కాస్త నిడివి ఎక్కువే. నిధి తెరపై అందంగా కనిపించింది. రిద్ధి పాత్రకు అంత ప్రాధాన్యతలేదు.. నిడివి కూడా చాలా తక్కువే. నాన్నమ్మ గంగాదేవిగా జరీనా తనదైన నటనతో ఆకట్టుకుంది. సంజయ్ దత్ కూడా చూపులతో విలనిజం పండించాడు. నటనకు స్కోప్‌లేదు. ఎక్కువగా గ్రాఫిక్స్‌లోనే ఆయన్ని చూపించారు. ప్రభాస్ శ్రీను, వీటీవీ గణేశ్, సప్తగిరి కొన్ని చోట్ల నవ్వించారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

సాంకేతికంగా సినిమా బాగుంది. తమన్ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు బాగున్నాయి. కానీ వాటి ప్లేస్‌మెంట్ సరిగా కుదర్లేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతిఫ్రేమ్ తెరపై రిచ్‌గా కనిపించింది. ఆర్ట్‌వర్క్ బాగుంది. అయితే కోట సెట్ అనే విషయం తెలిసిపోతుంది. సహజత్వం లోపించింది. ఎడిటర్ తన కత్తెరకు బాగానే పని చెప్పాల్సింది. ఈ సినిమాలో అనవసరపు సన్నివేశాలు చాలానే ఉన్నాయి. వాటిని తొలగించి నిడివి( 3 గంటల 9నిమిషాలు) తగ్గిస్తే బాగుండేది. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి. పీపుల్స్ మీడియా ఖర్చు విషయంలో ఎక్కగా తగ్గలేదని సినిమా చూస్తే అర్థవమవుతుంది.
- అంజిశెట్టె, సాక్షి వెబ్‌డెస్క్


