జోర్డాన్ నుంచి ‘డ్రాగన్ ’ మూవీ టీమ్ తిరిగొచ్చింది. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘డ్రాగన్ ’ (ప్రచారంలో ఉన్న టైటిల్). రుక్మిణీ వసంత్ హీరోయిన్ . మలయాళ నటుడు టొవినో థామస్, బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారని సమాచారం. నందమూరి కల్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, కె. హరికృష్ణ నిర్మిస్తున్నారు. కాగా ఇటీవల జోర్డాన్ లో మొదలైన ‘డ్రాగన్ ’ షెడ్యూల్ ముగిసింది.
దీంతో ఎన్టీఆర్, ప్రశాంత్ అండ్ టీమ్ హైదరాబాద్ చేరుకున్నారు. జోర్డాన్ లో ప్రధానంగా రెండు కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారని తెలిసింది. అయితే తదుపరి షూటింగ్ షెడ్యూల్ కోసం టీమ్ ఎక్కువ గ్యాప్ తీసుకోవడం లేదట. ఈ నెలాఖరులోనే హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ప్రారంభం కానుందట. ఎన్టీఆర్‌తో పాటు ప్రధాన తారాగణం ఈ షెడ్యూల్‌లో పాల్గొంటారని ఫిల్మ్‌నగర్ సమాచారం. ‘డ్రాగన్ ’ మూవీని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. విడుదల తేదీపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది.


