‘బాఫ్టా’లో ‘బూంగ్’ యూనిట్
79వ బాఫ్టా అవార్డ్స్‌లో భారతీయ సినిమా బూంగ్‌కి అవార్డు
భారతీయ చిత్రం ‘బూంగ్’ చరిత్ర సృష్టించింది. లండన్ లో జరిగిన 79వ ‘బాఫ్టా’ (బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్) అవార్డుల ప్రదానోత్సవంలో ‘బెస్ట్ చిల్డ్రన్స్ అండ్ ఫ్యామిలీ ఫిల్మ్’ విభాగంలో అవార్డు అందుకున్న తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. అలాగే ‘బాఫ్టా’లో తొలి అవార్డు సాధించిన మణిపుర్ సినిమా కూడా ఇదే. ఈ విభాగంలో ‘జూటోపియా 2’, ‘లిలో – స్టిచ్’, ‘ఆర్కో’ వంటి హాలీవుడ్ చిత్రాలు నామినేషన్ దక్కించుకున్నప్పటికీ ‘బూంగ్’ అవార్డును గెలుచుకోవడం విశేషం.
బూంగ్ కథ ఏంటంటే...
గుగున్ కిప్జెన్ టైటిల్ రోల్‌లో, బాలా హిజామ్ కీలక పాత్రలో నటించిన మణిçపుర్ చిత్రం ‘బూంగ్’. లక్ష్మీ ప్రియా దేవి దర్శకత్వం వహించిన తొలి ఫీచర్ ఫిలిం ఇది. ఫర్హాన్ అక్తర్, వికేష్ భూతాని, అలాన్ మెక్ అలెక్స్, రితేష్ సిధ్వాని, షుజాత్ వ్యాపారి నిర్మించారు. ఈ సినిమాని 2024లో కెనడాలో జరిగిన 49వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తొలిసారి ప్రదర్శించారు. 2025 సెప్టెంబరు 19న ఈ చిత్రాన్ని ఇండియాలో రిలీజ్ చేశారు. తన తల్లిదండ్రులు మందాకిని, జాయ్‌కుమార్‌లను కలిపేందుకు బూంగ్ అనే పాఠశాల విద్యార్థి తన స్వస్థలం నుంచి మయన్మార్ సరిహద్దు వరకు చేసిన సాహసోపేతమైన భావోద్వేగ ప్రయాణంతో ఈ మూవీ సాగుతుంది.
మణిపుర్‌లో శాంతి నెలకొనాలి: లక్ష్మీప్రియా దేవి
‘బాఫ్టా’ అవార్డు స్వీకరించిన అనంతరం భావోద్వేగంతో మాట్లాడారు లక్ష్మీప్రియా. ‘‘మేం ఎంతో కష్టపడుతూ ఓ పర్వతం ఎక్కుతున్నది ఫస్ట్ ప్లేస్ కోసమని మేం ఈ వేదికపైకి వచ్చాక అర్థం అయింది. మా చిన్న సినిమాపై ఇంతటి ప్రేమను వ్యక్తం చేసిన జ్యూరీ సభ్యులకు, బాఫ్టాకు థ్యాంక్స్. భారతదేశంలోని మణిçపుర్ నా మాతృభూమి. అక్కడ తిరిగి శాంతి నెలకొనాలని దేవుణ్ణిప్రార్థిస్తున్నానని చెప్పేందుకు ఈ వేదికను వినియోగించుకోవాలనుకుంటున్నాను. సినిమాలోని బాల నటులతో సహా, మణిపూర్‌లోని పిల్లలందరూ వారి ఆనందాన్ని, వారి కలలను తిరిగి పొందాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు.
ప్రధాని మోదీ ప్రశంస
‘‘బూంగ్’ సినిమాతో అసోసియేట్ అయిన అందరికీ శుభాకాంక్షలు. నిజంగా ఆనందమైన క్షణాలు ఇవి. ముఖ్యంగా మణిపూర్‌కు. అలాగే దేశంలోని అపారమైన సృజనాత్మక ప్రతిభ హైలైట్ అవుతుంది’’ అంటూ భారత ప్రధాని నరేంద్ర మోది ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. అలాగే పలువురు భారత సినీ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు చెప్పారు.
ఆలియా సందడి
‘బాఫ్టా’ అవార్డ్స్‌లో బాలీవుడ్ నటి ఆలియా భట్ సందడి చేశారు. ‘బెస్ట్ ఫిల్మ్ నాట్ ఇన్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్’ విభాగంలో ‘సెంటిమెంటల్ వేల్యూ’ యూనిట్‌కు అవార్డు అందించారు. ఈ అవార్డ్స్‌లో ‘వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్’ సినిమా బెస్ట్ ఫిల్మ్‌గా నిలవడంతో పాటు అత్యధికంగా ఆరు అవార్డులను సొంతం చేసుకుంది. చిత్ర దర్శకుడు పాల్‌థామస్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. రాబర్ట్ అరమాయో (ఐ స్వయిర్ సినిమాకు) ఉత్తమ నటుడిగా నిలవగా, జెస్సీ బక్లీ ఉత్తమ నటిగా నిలిచి (‘హామ్నెట్’ చిత్రానికిగాను).. బాఫ్టా లీడ్ యాక్ట్రస్ అవార్డు గెలుచుకున్న తొలి ఐరిస్ మహిళగా రికార్డు సాధించారు.


