సాక్షి, యాదాద్రి భువనగిరి: యాదగిరిగుట్టలో రెండు గంటలుగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ స్థలం విషయంలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య వివాదం నెలకొంది. ఇరు వర్గాల మధ్య మాటా మాట పెరగడంతో ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలకు గాయలైనట్టు తెలుస్తోంది.
వివరాల మేరకు.. యాదగిరిగుట్టలో ఓ వ్యక్తికి చెందిన స్థలాన్ని కబ్జా చేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్‌కు బీజేపీ కార్యకర్తలు వెళ్లారు. ఇదే సమయంలో పోలీస్ స్టేషన్ ఎదుట బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఎదురుపడ్డారు. దీంతో, ఇరు వర్గాల మధ్య మాటా మాట పెరగడంతో ఘర్షణ చోటుచేసుకుంది.
ఈ క్రమంలో పరిస్థితి చేయి దాటిపోవడంతో ఇరు పార్టీల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. ఈ ఘర్షణలో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలైనట్టు తెలిసింది. కాంగ్రెస్ నేత భరత్ అనుచరులు దాడి చేశారంటూ పోలీస్ స్టేషన్ ఎదుట బీజేపీ శ్రేణుల ఆందోళనకు దిగాయి. దీంతో, బలవంతంగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.


