సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై ఓ మీడియా సంస్థలో ప్రసారమైన కథనం పట్ల కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మంత్రులు కోమటిరెడ్డి, సీతక్క ఖండించారు. ఇక, తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కూడా మండిపడ్డారు. వ్యక్తుల ప్రైవేట్ జీవితాలపై చర్చ చేయడం బాధాకరమని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..‘వ్యక్తులకు సంబంధించి తప్పుడు కథనాలు ప్రసారం చేయడం కరెక్ట్ కాదు. వాస్తవాలకు దూరంగా ఇలాంటి వార్తలు వస్తున్నాయి. ఎంతో కష్టపడి మంత్రులు, అధికారులు ఈ స్థాయికి చేరుకుంటారు. అలాంటి వారిపై నిరాధారమైన వార్తలు ప్రచురించడం మానేయాలి అని హితవు పలికారు.
ఇదే సమయంలో బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాముడికి బీజేపీలో సభ్యత్వం ఉందా? అని ప్రశ్నిస్తూ.. రాముడి పేరును వాడుకునే హక్కు బీజేపీకి ఎక్కడిది? అని నిలదీశారు. రాజకీయాల్లోకి దేవుడిని లాగడం మంచిది కాదని, ఓట్ల కోసం దేవుడిని వాడుకోవడం సరికాదన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో బీఆర్ఎస్ నేతలు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మేము రెండేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో 70 శాతం స్థానాలు సాధించామని, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతం స్థానాలు గెలుస్తామని’ చెప్పుకొచ్చారు.


