కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బెంగాల్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), టీఎంసీ ప్రభుత్వం మధ్య వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. బెంగాల్‌లో ఇటీవల ఐ-ప్యాక్ బొగ్గు కుంభకోణం కేసు దర్యాప్తును పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అడ్డుకున్నారని ఆరోపిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఆర్టికల్ 32 పిటిషన్ దాఖలు చేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ సందర్బంగా.. ఈడీ తన పిటిషన్‌లో ఈ ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దర్యాప్తును కోరింది. నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా దర్యాప్తు చేసే హక్కును రాష్ట్ర యంత్రాంగం తగ్గించింది అని పేర్కొంది. అధికారులు చట్టబద్ధంగా సోదాలు నిర్వహించకుండా, బొగ్గు అక్రమ రవాణా దర్యాప్తునకు సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకోకుండా అడ్డుకున్నారని ఆరోపించింది. రాష్ట్ర సీనియర్ అధికారుల సమక్షంలో డాక్యుమెంట్స్, ఎలక్ట్రానిక్ పరికరాలను బలవంతంగా తీసుకున్నారని చెప్పుకొచ్చింది. పోలీసు సిబ్బందితో సహా రాష్ట్ర అధికారుల జోక్యం న్యాయాన్ని అడ్డుకోవడమేనని ఈడీ వివరించింది.
ఇదిలా ఉండగా.. ఈడీ దాడుల వ్యవహారంపై బెంగాల్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అంశంపై అంతకుముందే.. తమ వాదనలు వినకుండా ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని కోరుతూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కావియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఇక, కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భాగంగా గురువారం కోల్‌కతాలోని ఐప్యాక్ కార్యాలయం, ప్రతీక్ జైన్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ దాడుల సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా అక్కడికి చేరుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో పోలీసుల సాయంతో ఆమె దర్యాప్తుకు ఆటంకం కలిగించారని, సాక్ష్యాలను మాయం చేశారని పేర్కొంటూ ఈడీ శుక్రవారం కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన హైకోర్టు.. జనవరి 14వ తేదీకి విచారణను వాయిదా వేసింది.


