breaking news
Coal Sacm
-
బెంగాల్లో మరో ట్విస్ట్.. సుప్రీంకోర్టుకు ఈడీ
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బెంగాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), టీఎంసీ ప్రభుత్వం మధ్య వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. బెంగాల్లో ఇటీవల ఐ-ప్యాక్ బొగ్గు కుంభకోణం కేసు దర్యాప్తును పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అడ్డుకున్నారని ఆరోపిస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఆర్టికల్ 32 పిటిషన్ దాఖలు చేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది.ఈ సందర్బంగా.. ఈడీ తన పిటిషన్లో ఈ ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దర్యాప్తును కోరింది. నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా దర్యాప్తు చేసే హక్కును రాష్ట్ర యంత్రాంగం తగ్గించింది అని పేర్కొంది. అధికారులు చట్టబద్ధంగా సోదాలు నిర్వహించకుండా, బొగ్గు అక్రమ రవాణా దర్యాప్తునకు సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకోకుండా అడ్డుకున్నారని ఆరోపించింది. రాష్ట్ర సీనియర్ అధికారుల సమక్షంలో డాక్యుమెంట్స్, ఎలక్ట్రానిక్ పరికరాలను బలవంతంగా తీసుకున్నారని చెప్పుకొచ్చింది. పోలీసు సిబ్బందితో సహా రాష్ట్ర అధికారుల జోక్యం న్యాయాన్ని అడ్డుకోవడమేనని ఈడీ వివరించింది.ఇదిలా ఉండగా.. ఈడీ దాడుల వ్యవహారంపై బెంగాల్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అంశంపై అంతకుముందే.. తమ వాదనలు వినకుండా ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని కోరుతూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కావియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఇక, కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భాగంగా గురువారం కోల్‌కతాలోని ఐప్యాక్ కార్యాలయం, ప్రతీక్ జైన్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ దాడుల సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా అక్కడికి చేరుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో పోలీసుల సాయంతో ఆమె దర్యాప్తుకు ఆటంకం కలిగించారని, సాక్ష్యాలను మాయం చేశారని పేర్కొంటూ ఈడీ శుక్రవారం కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన హైకోర్టు.. జనవరి 14వ తేదీకి విచారణను వాయిదా వేసింది. -
కుంభకోణాలకు కేంద్ర సర్కారే కారణం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తు న్న విధానాల వల్లే దేశంలో కుంభకోణాలు జరుగుతున్నాయని, అవినీతికి వ్యతిరేకంగా శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సదస్సులో పలువురు వక్తలు పేర్కొన్నారు. బాధ్యతను విస్మరించటంతో సహజ వనరులు దోపిడీకి గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వ రంగం-బొగ్గు కుంభకోణం’ అనే అంశంపై అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి కె.వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రజా సంపదపై ప్రభుత్వం పూర్తిగా పట్టు కోల్పోవడం అవినీతికి కారణమవుతోందన్నారు. అభివృద్ధి చెందిన చైనాలో భూములు, సహజ వనరులు ఇప్పటికీ ప్రభుత్వం అధీనంలోనే ఉన్నాయని తెలిపారు. రిలయన్స్ సంస్థ మన రాష్ట్రంలో రూపాయల్లో పెట్టుబడులు పెట్టి కోట్లు దండుకుందన్నారు. ఇదంతా ప్రజల సొమ్ము కాదా? అని ప్రశ్నించారు. గ్యాస్‌ను వెలికి తీయడానికి ఉపయోగించిన ప్రతీ పైసా ప్రజలదేనని గుర్తు చేశారు. జాతీయ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని, ఈ దిశగా జాగృతం చేయాలని అన్ని యూనియన్ల నేతలకు పిలుపునిచ్చారు. బొగ్గు గనులను ఇష్టారాజ్యంగా ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేయడం సరికాదని సింగరేణి కాలరీస్ మాజీ డెరైక్టర్ వాసుదేవరావు అన్నారు. విద్యుదుత్పత్తిలో 75 శాతం పాత్ర పోషిస్తున్న బొగ్గును రక్షించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కన్వీనర్ ఎంఎస్.వెంకట్రామయ్య, సీఐటీయూ రాష్ట్రశాఖ ఉపాధ్యక్షుడు బి.రాజారావు, పీపుల్స్ అగెనైస్ట్ కరప్షన్(పీఏసీ) కన్వీనర్ బి.రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.


