కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తు న్న విధానాల వల్లే దేశంలో కుంభకోణాలు జరుగుతున్నాయని, అవినీతికి వ్యతిరేకంగా శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సదస్సులో పలువురు వక్తలు పేర్కొన్నారు.
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తు న్న విధానాల వల్లే దేశంలో కుంభకోణాలు జరుగుతున్నాయని, అవినీతికి వ్యతిరేకంగా శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సదస్సులో పలువురు వక్తలు పేర్కొన్నారు. బాధ్యతను విస్మరించటంతో సహజ వనరులు దోపిడీకి గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వ రంగం-బొగ్గు కుంభకోణం’ అనే అంశంపై అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి కె.వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రజా సంపదపై ప్రభుత్వం పూర్తిగా పట్టు కోల్పోవడం అవినీతికి కారణమవుతోందన్నారు. అభివృద్ధి చెందిన చైనాలో భూములు, సహజ వనరులు ఇప్పటికీ ప్రభుత్వం అధీనంలోనే ఉన్నాయని తెలిపారు. రిలయన్స్ సంస్థ మన రాష్ట్రంలో రూపాయల్లో పెట్టుబడులు పెట్టి కోట్లు దండుకుందన్నారు. ఇదంతా ప్రజల సొమ్ము కాదా? అని ప్రశ్నించారు.
గ్యాస్‌ను వెలికి తీయడానికి ఉపయోగించిన ప్రతీ పైసా ప్రజలదేనని గుర్తు చేశారు. జాతీయ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని, ఈ దిశగా జాగృతం చేయాలని అన్ని యూనియన్ల నేతలకు పిలుపునిచ్చారు. బొగ్గు గనులను ఇష్టారాజ్యంగా ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేయడం సరికాదని సింగరేణి కాలరీస్ మాజీ డెరైక్టర్ వాసుదేవరావు అన్నారు. విద్యుదుత్పత్తిలో 75 శాతం పాత్ర పోషిస్తున్న బొగ్గును రక్షించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కన్వీనర్ ఎంఎస్.వెంకట్రామయ్య, సీఐటీయూ రాష్ట్రశాఖ ఉపాధ్యక్షుడు బి.రాజారావు, పీపుల్స్ అగెనైస్ట్ కరప్షన్(పీఏసీ) కన్వీనర్ బి.రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.


