‘జీతం తక్కువ… భరణం ఎక్కువ!’.. ‘సుప్రీం’లో భర్త వాదనలు హాట్ టాపిక్! | Supreme Court Key Comments On Alimony Over Divorce Plea | Sakshi
Sakshi News home page

‘జీతం తక్కువ… భరణం ఎక్కువ!’.. సుప్రీం కోర్టులో భర్త వాదనలు హాట్ టాపిక్!

Mar 2 2026 10:00 AM | Updated on Mar 2 2026 10:16 AM

Supreme Court Key Comments On Alimony Over Divorce Plea

ఢిల్లీ: యువర్ హానర్. నేను కార్మికుడిని. నా జీతం నెలకు రూ.9వేలు. అలాంటిది భరణం కింద నా భార్యకు  నెలకు రూ.12వేలు ఎలా ఇవ్వాలి. మీరే నాకు న్యాయం చేయాలి అంటూ ఓ భర్త సుప్రీం కోర్టులో తన వాదనలు వినిపించారు. అయితే, భర్త వాదనలపై ‘సుప్రీం’ ద్విసభ్య ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.  

ఒకేసులో భార్య, భర్తకు కింది కోర్టు విడాకులు మంజూరు చేసింది. అదే సమయంలో భరణం కింద భర్త.. భార్యకు రూ.6 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. కోర్టు ఇచ్చిన తీర్పుపై భార్య అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

నా భర్త నుంచి విడాకులు కోరుకుంటున్నాను. కానీ నాకు ఇచ్చే భరణం సరిపోదు. పోషణ నిమిత్తం జీవితాంతం నెలకు రూ.12,000 భరణంతో పాటు ప్రతి సంవత్సరం ఐదు శాతం, ఆరు శాతం పెంచాలి.  లేదంటే ఒకేసారి రూ.30 లక్షలు చెల్లించాలి’ అని కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొంది.

ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం భర్త వాదనలపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది.  ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికైనా ఇంత తక్కువ వేతనం పొందడం నమ్మశక్యం కాదని వ్యాఖ్యానించింది. కనీస వేతనానికి తగ్గకుండా చెల్లించే పరిస్థితి ఉండగా.. ఒక సంస్థ ఇంత తక్కువ వేతనం ఇస్తుందా అని ప్రశ్నించింది.  

భర్త తరఫు న్యాయవాది జార్జ్ పోథన్,తన క్లయింట్ నిజాయితీగా ఆదాయాన్ని వెల్లడిస్తున్నాడని, దానికి సంబంధించిన అఫిడవిట్ కూడా సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాడని వాదించారు. బెంచ్ ఆ వాదనను ఖండించింది. భర్తకు భరణం చెల్లించే స్థోమత లేకపోతే భార్యను తనతో ఉంచుకుని, ఆమెకు  వంట చేసి కుటుంబాన్ని చూసుకోవాలని హితువు పలికింది. 

అందుకు స్పందించిన భర్త.. భార్య తన తల్లిదండ్రులపై ఫిర్యాదు చేసిందని వాపోయారు. భర్త వ్యాఖ్యలపై  జస్టిస్ మెహతా కఠినంగా స్పందించారు. భార్యకు పోషణ ఖర్చు ఇవ్వడం భర్త బాధ్యత. అవసరమైతే అప్పు చేయాలి. సహాయం తీసుకుని బాధ్యతను నెరవేర్చాలని స్పష్టం చేశారు.

 తన సంస్థ తనకు అంతే జీతం ఇస్తుందని భర్త చెప్పిన అంశాన్ని సుప్రీంకోర్టు ధర్మాసననం పరిశీలిస్తుంది. ఉద్యోగులకు చెల్లించే జీతాలపై తమకు స్పష్టత ఇవ్వాలని సదరు సంస్థకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తీర్పును రిజర్వ్‌ చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement