నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ దంపతులు విడిపోయేందుకు సిద్ధమయ్యారు. ఆయన నుంచి విడాకులు కోరుతూ తన సతీమణి సంగీత కోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈమేరకు తమిళనాడులోని చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో ఆమె పిటిషన్ వేశారు. 2021లో ఓ నటితో విజయ్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లు తనకు తెలిసిందని ఆమె పేర్కొన్నారు. అందుకే తనతో విడాకులు కోరుకుంటున్నానని ఆమె తెలిపారు. సంగీత దాఖలు చేసిన పిటిషన్ ఏప్రిల్ 20న విచారణకు రానుంది.
సంగీత ఎవరు..?
సంగీత శ్రీలంక తమిళ మూలానికి చెందినది. యునైటెడ్ కింగ్‌డమ్‌లో పుట్టి పెరిగిన ఆమె 1999లో విజయ్‌తో వివాహం చేసుకుంది. పెళ్లికి ముందు ఆమె శ్రీలంక సంతతికి చెందిన బ్రిటిష్ పౌరురాలిగా గుర్తింపు పొందింది. శ్రీలంకకు చెందిన ఒక తమిళ పారిశ్రామికవేత్త కుమార్తెగా ఆమె లండన్‌లో స్థిరపడింది. కొన్ని మీడియా నివేదికలు ఆమెను గృహిణిగా ఉన్నారని చెబుతున్నప్పటికీ.. మరికొన్ని ఆమెకు వ్యాపార రంగంలో రాణిస్తున్నారని కథనాలు ఉన్నాయి.
1996లో విజయ్ నటించిన 'పూవే ఉనక్కగా' చిత్రం సంచలన విజయం సాధించింది. తెలుగులో శుభాకాంక్షలు పేరుతో రిలీజ్ అయింది. విజయ్ సినిమాలు చూసి అతడికి వీరాభిమానిగా మారిపోయిన సంగీత ఆయనను చూడటానికే 1996లో లండన్ నుంచి చెన్నై వచ్చింది. విశ్వప్రయత్నాలు చేసి విజయ్‌ను కలిసింది. ‘నన్ను చూడటానికి లండన్ నుంచి వచ్చారా’ అని విజయ్ ఆశ్చర్యపోయాడు. అంత దూరం నుంచి వచ్చినందుకు సంగీతను ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. విజయ్ పేరెంట్స్‌కు ఆమె బాగా నచ్చేసింది. అప్పుడప్పుడూ సంగీత తన పేరెంట్స్‌తో ఈ హీరో ఇంటికి వచ్చేది.
విజయ్ పేరెంట్స్ ఆమెను పెళ్లిచేసుకోమన్నారు. ఆపై వారు చొరవ తీసుకుని సంగీతను తమ కొడుకును వివాహం చేసుకుంటారా అని అడిగారు. అలా వారిద్దరూ 1999లో హిందూ సాంప్రదాయ పద్ధతిలో ఒక్కటయ్యారు. ఈ జంట 2000 సంవత్సరంలో తమ మొదటి బిడ్డకు, 2005లో రెండవ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత, వారి పిల్లలు విజయ్‌తో పాటు వెట్టైకారన్, తేరి వంటి చిత్రాల్లో కూడా కొద్దిసేపు తెరపై కనిపించారు. సుమారు 27ఏళ్ల తర్వాత ఈ జంట ఇప్పుడు విడాకులు తీసుకోనున్నడంతో అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు.


