- 66 అంతర్జాతీయ సంస్థల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన
- వాటి అవసరం ఇకపై లేదని, నిధులివ్వబోమని వెల్లడి
- అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా పని చేస్తున్నాయని ఆక్షేపణ
- ఇండియా, ఫ్రాన్స్ సారథ్యంలోని సౌర కూటమి నుంచి అమెరికా వెనక్కి
వాషింగ్టన్: తమ అగ్రరాజ్య ఆధిపత్యాన్ని ధిక్కరిస్తున్న దేశాలపైకి సైన్యాన్ని నడిపిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో షాక్ ఇచ్చారు. 66 అంతర్జాతీయ సంస్థల నుంచి అమెరికా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం సంబంధిత మెమోరాండంపై సంతకం చేశారు. ఆయా సంస్థల అవసరం ఇకపై లేదని, అవి అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా పని చేస్తున్నాయని ట్రంప్ తేలి్చచెప్పారు.
ఇందులో ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు, పలు ఇతర సంస్థలతోపాటు భారత్, ఫ్రాన్స్ సారథ్యంలోని ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్ ఉంది. వాటితో అమెరికాకు ఎలాంటి సంబంధం ఉండబోదని ట్రంప్ స్పష్టంచేశారు. తమ జాతీయ ప్రయోజనాలు, భద్రత, ఆర్థిక ప్రగతి, సార్వ¿ౌమత్వానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న సంస్థల్లో సభ్యత్వం కొనసాగించడం, భాగస్వామిగా పనిచేయడం, ఆర్థిక సాయం అందించడం అర్థంలేని పని అని అన్నారు.
అమెరికా పట్ల దురుద్దేశాలతో వ్యవహరిస్తున్న సంస్థలకు తమ నిధులు ఎందుకివ్వాలని నిలదీశారు. అమెరికా సభ్యత్వం ఉపసంహరించుకున్న వాటిలో ఐరాస సంస్థలు 31, ఇతర సంస్థలు 35 ఉన్నాయి. అంతర్జాతీయ సంస్థల నుంచి ఉపసంహరణ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని సంబంధిత ఎగ్జిక్యూటివ్ డిపార్టుమెంట్లు, ఏజెన్సీలను ట్రంప్ ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని చెప్పారు.
ట్రంప్‌ను తప్పుపట్టొద్దు: రూబియో
మరికొన్ని అంతర్జాతీయ సంస్థల నుంచి అమెరికా తప్పుకొనే అవకాశాలు మెండుగా ఉన్నాయని, ట్రంప్ ఆ దిశగా ఆలోచన చేస్తున్నారని విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచి్చన హామీని ట్రంప్ అమలు చేస్తున్నారని, ఆయనను తప్పు పట్టాల్సిన పనిలేదని అన్నారు. అమెరికాను వ్యతిరేకించే శక్తులకు నిధులు ఇవ్వడం ఆపేస్తానంటూ ట్రంప్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు.
‘అమెరికా, అమెరికన్స్ ఫస్ట్’ అనేదే తమ నినాదం, విధానమని ఉద్ఘాటించారు. అమెరికా ప్రజల రక్తం, స్వేదం, కష్టార్జితాన్ని మరెవరికో ధారపోయడం కొనసాగదని రూబియో పేర్కొన్నారు. ఇప్పటికే బిలియన్ డాలర్ల సొమ్ము విదేశాలకు తరలిపోయిందని, అమెరికా ప్రజలే నష్టపోయారని తెలిపారు. తమ దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ, దెబ్బకొట్టాలని చూస్తున్న సంస్థలకు నిధులిచ్చే ప్రసక్తే లేదని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి మైక్ వాల్జ్ స్పష్టంచేశారు.
సౌర కూటమికి ఎదురుదెబ్బ?
అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్‌ఏ) నుంచి తప్పుకుంటున్నట్లు ట్రంప్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. సౌర విద్యుత్, సౌర ఇంధన వనరులను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రతికూల వాతావరణ మార్పులను, దు్రష్పభావాలను అరికట్టాలన్న లక్ష్యంతో ఈ కూటమి ఏర్పాటైంది. భారత్, ఫ్రాన్స్ ఇందుకు సంయుక్తంగా చొరవ తీసుకున్నాయి.
2015లో పారిస్‌లో జరిగిన కాప్–21 సదస్సు సందర్భంగా కూటమిని ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యాలయం భారత్‌లోనే ఉంది. ప్రస్తుతం 90కి పైగా దేశాలకు ఐఎస్‌ఏలో సభ్యత్వం కల్పించారు. 2030 నాటికి ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలన్నది కూటమి లక్ష్యం. ముఖ్యమైన దేశం అమెరికా ఉపసంహరించుకోవడంతో ఐఎస్‌ఏ ఉద్దేశం నీరుగారుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక రకంగా ట్రంప్ నిర్ణయం సౌర కూటమికి ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు.
ఏయే సంస్థల నుంచి..
ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్, సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్(ఉక్రెయిన్), యూఎన్ డిపార్టుమెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్, యూఎన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ఎకనామిక్ కమిషన్ ఫర్ ఆఫ్రికా, లాటిన్ అమెరికా, కరీబియన్, యూఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్, యూఎన్ పాపులేషన్ ఫండ్ తదితర సంస్థల నుంచి తాము ఉపసంహరించుకుంటున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.


