Venezuela: మిన్నంటిన రాజకీయ ఖైదీల నిరసనలు | 200 Venezuelan political prisoners launch hunger strike | Sakshi
Sakshi News home page

Venezuela: మిన్నంటిన రాజకీయ ఖైదీల నిరసనలు

Feb 23 2026 1:19 PM | Updated on Feb 23 2026 1:29 PM

200 Venezuelan political prisoners launch hunger strike

కరాకస్: వెనిజులాలోని రోడియో-ఒన్‌ కారాగారం  నిరసన జ్వాలలతో అట్టుడుకుతోంది. దేశంలో ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త క్షమాభిక్ష చట్టం (Amnesty Law) తమకు వర్తించకపోవడాన్ని నిరసిస్తూ సుమారు 200 మందికి పైగా రాజకీయ ఖైదీలు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. శుక్రవారం రాత్రి ప్రారంభమైన ఈ నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. జైలు గోడల మధ్య నుంచి ఖైదీలు చేస్తున్న ‘మాకు విముక్తి కావాలి’, ‘అందరినీ విడుదల చేయాలి’ అనే నినాదాలు మిన్నంటుతున్నాయి.

ఈ నిరసన కేవలం స్థానికులకే పరిమితం కాలేదు. విదేశీయులతో కలిపి మొత్తం 214 మంది ఖైదీలు ఆహారాన్ని త్యజించి, ఈ  నిరసనల్లో పాల్గొంటున్నారు. ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న అర్జెంటీనా పోలీస్ అధికారి నహుయెల్ అగస్టిన్ గాల్లో తదితరులను ఈ చట్టం పరిధి నుంచి మినహాయించడంపై ఖైదీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మదురో హయాంలో రాజకీయ ప్రత్యర్థులను అణచివేసేందుకు వాడిన సెక్షన్లనే ఇప్పుడు మినహాయింపులుగా చూపడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

మరోవైపు అంతర్జాతీయ రెడ్‌క్రాస్ కమిటీ (ఐసీఆర్‌సీ)ప్రతినిధులు ఆదివారం రోడియో-వన్‌ జైలును సందర్శించడం కీలక పరిణామంగా మారింది. దశాబ్దాల కాలంలో ఈ కారాగారంలోకి అంతర్జాతీయ పరిశీలకులకు అనుమతి లభించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఖైదీల ఆరోగ్య స్థితిగతులను పర్యవేక్షించేందుకు ఇది ఒక సానుకూల అడుగు అని రెడ్‌క్రాస్ ప్రతినిధులు భావిస్తున్నారు. కాగా ఈ చట్టం కింద ఇప్పటివరకు 1,500 మందికి పైగా ఖైదీలు దరఖాస్తు చేసుకోగా, కొందరు మాత్రమే విడుదల పత్రాలతో బయటకు వస్తున్నారు. ఇదే సమయంలో తమ వారు ఎప్పుడు విడుదలవుతారా అని వేల సంఖ్యలో కుటుంబాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి.

వెనెజువెలాలో రాజకీయ పరిస్థితులు జనవరి 3న అమెరికా కమెండోల దాడితో పూర్తిగా మారిపోయాయి. అప్పటి అధ్యక్షుడు నికోలస్ మదురోను డ్రగ్స్ స్మగ్లింగ్ ఆరోపణలపై అమెరికా అదుపులోకి తీసుకోవడంతో, దేశ పగ్గాలు డెల్సీ రోడ్రిగ్జ్ చేతుల్లోకి వెళ్లాయి. అమెరికా ప్రోద్బలంతోనే ఈ క్షమాభిక్ష చట్టాన్ని రూపొందించారు. గత మూడు దశాబ్దాలుగా గృహ నిర్బంధంలో ఉన్న సుమారు 11,000 మందికి ఈ చట్టం ఊరటనిచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం జైళ్లలో మగ్గుతున్న వందలాది మంది పరిస్థితి ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. ఖైదీలు చేస్తున్న ఈ నిరసనలు వెనెజువెలా ప్రభుత్వానికి కొత్త సవాలుగా మారాయి.

ఇది కూడా చదవండి: Mauritius: భారతీయ కుటుంబానికి ఘోర అవమానం

Advertisement
 
Advertisement
Advertisement