బాపట్ల జిల్లా రేపల్లె డీసీసీబీ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న సహకార సంఘాల ఉద్యోగులు
ఉద్యోగుల సమ్మెతో స్తంభించిన సహకార వ్యవస్థ
పట్టించుకోని బాబు సర్కార్
దీర్ఘకాలిక డిమాండ్లపై ప్రభుత్వం నిర్లక్ష్యం
నిలిచిపోయిన వందల కోట్ల ఆర్థిక లావాదేవీలు
దిక్కుతోచని స్థితిలో రైతాంగం
సాక్షి, అమరావతి: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి గత ఐదు రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మె కారణంగా రాష్ట్రంలో సహకార వ్యవస్థ స్తంభించింది. గ్రామ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలుగా నిలిచే పీఏసీఎస్‌లు మూతపడడంతో వందలకోట్ల ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయాయి. దీర్ఘకాలిక డిమాండ్లను సామరస్యంగా పరిష్కరించాల్సిన ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఓ వైపు ఉద్యోగులు, మరో వైపు రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
రుణాలు, డిపాజిట్ల వసూళ్లతో పాటు సాగు వేళ రైతులకు అవసరమైన ఆర్థిక చేయూత అందించడంలో పీఏసీఎస్‌లు కీలక పాత్ర పోషిస్తాయి. దాదాపు రెండునెలలుగా వివిధ రూపాల్లో దశలవారీగా ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. దీంతో రైతులకు ఆసరా కరువైపోయింది.
‘దేశం’ కార్యకర్తలను నింపుకోవాలన్న కుట్ర
సమ్మె నోటీసు ఫలితంగా హెచ్‌ఆర్ పాలసీ అమలు కోసం ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో ఆర్టీ నెం.112 ను ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ జీవో ఫలితంగా పీఏసీఎస్‌ల్లో పనిచేస్తున్న సుమారు 2,452 మంది అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. పీఏసీఎస్‌ల కంప్యూటరైజేషన్‌లో భాగంగా కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన వారిని రూ.10వేల నుంచి రూ.15 వేల వేతనంతో తీసుకోగా, ఏడేళ్లుగా వీరంతా పనిచేస్తున్నారు.
పీఏసీఎస్‌లను పార్టీ కార్యకర్తలతో నింపుకోవాలన్న కుట్రతో ఏడేళ్లుగా పనిచేస్తున్న వీరిని సాగనంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2019 మార్చి1వ తేదీకి ముందు నియమితులైన వారిని మాత్రమే ఉద్యోగులుగా పరిగణిస్తామని ప్రకటించింది. దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఉద్యోగులు మండిపడుతున్నారు. ప్రభుత్వ మరికొన్ని ఉద్యోగ వ్యతిరేక విధానాలను పరిశీలిస్తే..
» పదవీ విరమణ వయసును 60 ఏళ్లకే పరిమితం చేయడాన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
» ఇతర రాష్ట్రాల్లో లేదనే సాకుతో పీఏసీఎస్ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ‘వేజ్ రివిజన్ కమిటీ’ వేయడం కుదరదని ప్రభుత్వం తేల్చి చెప్పింది.
» గ్రాట్యుటీ సీలింగ్ రూ.2లక్షలకు పరిమితం చేసింది.
» పీఏసీఎస్ ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపి ఏళ్లతరబడి పనిచేస్తున్న ఉద్యోగులకు హెల్త్ అండ్ టర్మ్ ఇనూŠస్య్‌రెన్స్ అమలు చేయలేమని తేల్చిచెప్పింది.
సమ్మె అణచివేత కుట్రలు
ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోగా సమ్మెను అణిచివేయాలన్న ఆలోచనతో పీఏసీఎస్‌ల నిర్వహణ బాధ్యతలను డీసీసీబీ బ్రాంచ్ సూపర్‌వైజర్లకు అప్పగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఉద్యోగ సంఘాలు మరింత మండిపడుతున్నాయి. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని, సమస్యలు పరిష్కరించకుండా సమ్మె విరమించబోమని ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. సమ్మెలో భాగంగా శనివారం వివిధ జిల్లాల్లో డీసీసీబీ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
సహకార రంగానికి జగన్ ప్రభుత్వం కొత్త ఊపిరులు
సహకార రంగానికి జవసత్వాలు కల్పించేందుకు వైద్యనాథన్ కమిటీ సిఫార్సుల మేరకు గతంలో రూ.1,851 కోట్ల సాయం అందించడమే కాకుండా పీఏసీఎస్‌లకు స్వయం ప్రతిపత్తి కల్పించారు. ఆ తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ రంగానికి వెన్నుదన్నుగా నిలుస్తూ షేర్ క్యాపిటల్ అసిస్టెన్స్ కింద రూ.295 కోట్ల ఆర్థిక చేయూతనిచ్చింది. ఈ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా 13 డీసీసీబీ బ్యాంకులతో పాటు 1,465 సొసైటీలు లాభాల బాటపట్టాయి. ఆప్కాబ్, డీసీసీబీలను కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ నెట్‌వర్క్ పరిధిలోకి తీసుకురావడంతో పీఏసీఎస్‌లను మైక్రో బ్యాంక్‌లుగా తీర్చిదిద్దారు.
రూ.2,516 కోట్లతో పీఏసీఎస్‌ల కంప్యూటరీకరణకు శ్రీకారం చుట్టారు. తద్వారా కంప్యూటరైజేషన్‌కు సంబంధించి సహకార వ్యవస్థను ఏపీని నెంబర్‌గా నిలిపిన ఘనత జగన్ ప్రభుత్వానికి దక్కింది. పీఎసీఎస్‌లను బహుళ ప్రయోజన కేంద్రాలుగా కూడా తీర్చిదిద్దారు. ఏపీ స్ఫూర్తితో జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కూడా పీఏసీఎస్‌ల కంప్యూటరీకరణకు శ్రీకారం చుట్టింది.ఉద్యోగుల సంక్షేమం కోసం హెచ్‌ఆర్ పాలసీ అమలుకు శ్రీకారం చుట్టిన ఘనత కూడా జగన్ ప్రభుత్వానిది కావడం గమనార్హం.

సమ్మెను ఆపే ప్రసక్తే లేదు
ప్రభుత్వ వైఖరికి నిరసనగానే సమ్మె చేపట్టాల్సి వచ్చింది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడంతో పాటు 62 ఏళ్లకు పదవీ విరమణ వయసు పెంపు, అందరికీ సమాన వేతన స్కేల్స్, బీమా సౌకర్యం కల్పించే వరకు నిరవధిక సమ్మె ఆపే ప్రసక్తే లేదు. – ఎం. వెంకటేశ్వర రావు, రాష్ట్ర సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల జేఏసీ అధ్యక్షులు


