మచిలీపట్నంలో భూదందాకు చంద్రబాబు సర్కారు బరితెగింపు!
అవసరం లేకున్నా 6,408 ఎకరాల సేకరణకు స్కెచ్
కరకట్ట ప్యాలెస్‌లో సర్కారు పెద్దల నిర్ణయం!
పప్పు బెల్లాల్లా బినామీలకు కట్టబెట్టే కుతంత్రం
ఇద్దరు ఉన్నతాధికారులతో సమాలోచన.. దిశా నిర్దేశం
ఇప్పటికే ప్రైవేట్ బృందం ద్వారా సేకరణపై బ్లూ ప్రింట్
రెండు దశల్లో ఆరు గ్రామాల పరిధిలో బలవంతపు సేకరణ
ఏకంగా గ్రామాలకు గ్రామాలనే మాయం చేసే కుట్ర
రేపో మాపో నోటిఫికేషన్ విడుదలకు సమాయత్తం
తొలి దశలో మంగినపూడి, తవిసిపూడి, గోపువానిపాలెంలో 4,168 ఎకరాలు
రెండో దశలో కొత్తపూడి, పొట్లపాలెం, గోకవరంలో 2,239 ఎకరాలు
ఇబ్బందులు ఎదురవకుండా చూసుకోవాలని సూచన
ప్రశ్నించే వారిని ముందే గుర్తించి చర్యలు తీసుకోవాలని హెచ్చరిక
అసలు భూసేకరణ ఎందుకో అర్థం కావడం లేదంటున్న అధికార వర్గాలు
పోర్టు కోసమైతే ఇప్పటికే సరిపడా భూమి సిద్ధం
‘ఇది సర్కారు వారి పాట.. ఇక్కడ ఒకటోసారి.. రెండోసారి.. మూడోసారి అంటూ అడగడముండదు.. మాకు కావాల్సిన చోట, మాకు కావాల్సినంత భూమిని మేమిచ్చే రేటుకు వెంటనే ఇచ్చేయాల్సిందే.. అవి పట్టా భూములని, కోర్టుకెళతామని సాకులు చెబుతూ అడ్డుకుంటారో కబడ్దార్.. మీరలా చేస్తే ఏం చేయాలో మాకు తెలుసు.. ఆ భూమిని మేము ఎవరికి ఇచ్చుకుంటామో మీకు అనవసరం.. ఈ ప్రభుత్వం మాది.. అధికారులూ మేము చెప్పినట్లే వింటారు.. అంతా మా యిష్టం’ అంటోంది చంద్రబాబు ప్రభుత్వం. మచిలీపట్నం పోర్టుకు సమీపంలో అత్యంత విలువైన భూములపై సర్కారు కన్నుపడింది. పోర్టుకు అవసరం లేకున్నా, ప్రజోపయోగాలకు కాకున్నా.. కేవలం కావాల్సిన వారికి ధారాదత్తం చేయడానికి బరితెగించింది.. రైతుల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఆరు గ్రామాలను కనుమరుగు చేస్తూ వేలాది ఎకరాలు బలవంతంగా సేకరించడానికి రంగం సిద్ధం చేయడం కలకలం రేపుతోంది.
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మచిలీపట్నంలో పోర్టు నిర్మాణానికి అవసరమైన మేరకు భూమిని వైఎస్ జగన్ ప్రభుత్వం సమకూర్చింది. పోర్టు కనెక్టివిటీ కోసం కూడా 200 ఎకరాలకు పైగా రైతులకు మంచి ధర ఇచ్చి అప్పట్లోనే సేకరించింది. ముందస్తు ఆలోచనలతో అన్ని విధాలా పోర్టు అభివృద్ధికి చక్కటి ప్రణాళిక సిద్ధం చేసింది. పోర్టుకు సమీపంలో వీలైనంత భూమిని గుప్పెట్లో పెట్టుకోవడానికి చంద్రబాబు స్కెచ్ వేశారు. వేలాది ఎకరాల భూములను రైతుల నుంచి లాక్కుని తనకు నచ్చిన వారికి పప్పుబెల్లాల్లా పంచిపెట్టి లబ్ధి చేకూర్చడానికి పథకం వేశారు. కరకట్ట ప్యాలెస్‌లో సమాలోచనల అనంతరం కొద్ది రోజుల క్రితం ఈ కుతంత్రానికి బాబు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ క్రమంలో ప్రాథమికంగా రెండు దశల్లో దాదాపు ఆరున్నర వేల ఎకరాలు సేకరించేందుకు ఉన్నతాధికారులకు సర్కారు పెద్దలు దిశా నిర్దేశం చేశారు. ఈ క్రమంలో మచిలీపట్నం పోర్టుకు కూత వేటు దూరంలో 1,556.76 ఎకరాల ప్రభుత్వ భూమి, 4,851.3 ఎకరాల ప్రైవేట్ భూమిని ప్రభుత్వం లాక్కోవడానికి రంగం సిద్ధమైపోయింది. ఏకంగా 6,408.06 ఎకరాలు గుప్పెట్లో పెట్టుకుని తన సంబంధీకులకు, బినావీులకు ధారాదత్తం చేసేందుకు కుతంత్రం రచించింది. రెండు దశల్లో ఆరు గ్రామాలను కాల గర్భంలో కలిపేయనుంది. చెన్నై లాంటి అంతర్జాతీయ నౌకాశ్రయం 553 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. కానీ పోర్టు పేరుతో చంద్రబాబు ప్రభుత్వం వేల ఎకరాలు సేకరించడం వెనుక బినావీులకు దోచిపెట్టాలన్న దుగ్ధ దాగి ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రైవేట్ బృందం సర్వే
అసలే భూమి అవసరం లేని చోట ఎవ్వరికీ అర్థంకాని కారణాలు చెబుతూ మచిలీపట్నం పోర్టుకు కూత వేటు దూరంలో ఏకంగా 4,851 ఎకరాలు లాక్కోజూస్తుండటం రైతులను కలవరానికి గురి చేస్తోంది. రానున్న రోజుల్లో పోర్టు సమీప ప్రాంతంలో భూమి విలువ పెరుగుతుందని ప్రభుత్వ పెద్దలు అంచనా వేశారు. ఇదే అదనుగా వీలైనంత భూమిని చేజిక్కించుకుని తమ వారికి అప్పగించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కొద్ది రోజుల క్రితం ప్రైవేట్ వ్యక్తులతో కూడిన బృందాన్ని పోర్టు పరిసర ప్రాంతాలకు పంపారు. ఆ బృందం పలు గ్రామాలను, భూములను పరిశీలించి ప్రభుత్వ పెద్దలకు ఓ నివేదిక ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఏ గ్రామ పరిధిలో ఎక్కడెక్కడ ఏ మేరకు భూమి కావాల్సి ఉంటుందో ఆ బృందం నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ఆ విధంగానే భూ సేకరణ జరగాలని ప్రభుత్వ పెద్దలు ఈ నెల 12వ తేదీన ఇద్దరు ఉన్నతాధికారులకు దిశా నిర్దేశం చేసినట్లు తెలిసింది. ‘పరిశ్రమల కోసం’ అనే ముసుగుతో భూ సేకరణ చేయాలని ఆదేశాలు అందడంతో ఉన్నతాధికారులు ఇద్దరూ మారు మాట్లాడకుండా ఆ దిశగా కింది స్థాయి యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నారు. త్వరలో ఈ మేరకు నోటిఫికేషన్ కూడా వెలువడనున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆ నోట, ఈ నోట ఈ విషయం రైతుల దృష్టికి వెళ్లడంతో వారు తీవ్రంగా ఆందోళనకు గురవుతున్నారు.
అవసరమైన మేరకు ఇప్పటికే సిద్ధం
గత ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టకుండా కేవలం ప్రైవేటు భూమి 129.12 ఎకరాలు, అసైన్‌మెంటు భూమి 50 ఎకరాలు, ముడా (మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ ఆ«థారిటీ) భూమి 50.85, ప్రభుత్వ భూమి 5.40 ఎకరాలను మాత్రమే తీసుకుంది. ఈ భూమి సైతం పెడన నుంచి పోర్టు వరకు 40 మీటర్ల వెడల్పుతో రహదారి, రైల్వే ట్రాక్, గ్యాస్ ఆయిల్ పైపు లైను కోసం తీసుకున్నారు. మనిషికి భూమికి భావోద్వేగ బంధం ఉంటుందని, దాన్ని అధిగమించి ఊరికి, పోర్టు అవసరాలకు రైతులు భూమి ఇస్తున్నందున వారు నవ్వూతూ వెళ్లేలా బహిరంగ మార్కెట్ ధర కంటే ఎక్కువ మొత్తాన్ని ఇవ్వాలని నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అప్పటి కలెక్టర్‌కు సూచించారు.
దీంతో అప్పట్లో రైతులు సంతోషంగా నాటి మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో భూములు స్వచ్ఛందంగా అప్పజెప్పారు. దీంతో పాటు 1,780 ఎకరాల సముద్ర భూమిని పోర్టు నిర్మాణానికి అప్పజెప్పారు. పోర్టు నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు, కావాల్సిన వనరులన్నింటినీ గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమకూర్చి, శంకుస్థాపనలతో బందరు ప్రజలను మభ్యపెట్టకుండా నేరుగా పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించారు. పోర్టుకు ఇంతకు మించి భూ అవసరం ఉండదని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ ఇంకా పోర్టు, అభివృద్ధి అంటూ చంద్రబాబు ప్రభుత్వం రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తోందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ముడా భూముల్లో భారీగా మట్టి తవ్వకాలు
ఇప్పటికే ముడా (మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ ఆ«థారిటి) భూములను టీడీపీ నేతలు చెరబట్టారు. 700–800 ఎకరాల భూమిలో ఆరేడు అడుగుల లోతు వరకు మట్టి తవ్వి అమ్మకాలు చేపట్టారు. తద్వారా కోట్ల రూపాయలు దండుకొన్నారు. ఈ దందా అంతా ఓ మంత్రి కనుసన్నల్లో జరిగినట్లు ఆ ప్రాంతంలో చర్చ జరుగుతోంది. సదరు అమాత్యుడు తన ముఖ్య అనుచరుల ద్వారా ఈ దందా నడిపించినట్లు అధికార పార్టీ నేతలే చెబుతున్నారు. ముడా చైర్మెన్‌గా బీజేపీ చెందిన వ్యక్తిని నియమించారు. పచ్చ నేతలతో వేగలేక ఆయన కొన్ని రోజులకే రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది.
ఇలా సేకరించాలంటూ బ్లూ ప్రింట్
⇒ మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎంత భూమి తీసుకోవాల్సి ఉంటుందో ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయిలో అధికారులు, సిబ్బందికి నివేదించారు. కాదు.. కూడదని ఎవరైనా కోర్టులకు ఎక్కే, రోడ్డెక్కి గొడవ చేసే వాళ్ల నోరు ఎలా మూయిస్తారో మీ ఇష్టం.. అవసరమైతే పోలీసు శాఖ సహాయం తీసుకోండని సూచించినట్లు తెలిసింది. అంటే అక్రమ కేసులు పెట్టి మరీ వేధించి భూములు లాక్కోవాలని ఆదేశాలిచ్చినట్లు స్పష్టమవుతోంది. ప్రశ్నించే వారి లోటు పాట్లు కనుక్కొని, అడ్డు రాకుండా ముందే జాగ్రత్త పడాలని సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
⇒ ఆయా గ్రామాల్లో ప్రభుత్వ భూమి కాకుండా ప్రైవేట్ భూమి తొలి దశలో 2805.64 ఎకరాలు, రెండో దశలో 2046.66 ఎకరాలు అంటున్నారంటే.. మూడో దశలో ఇంకెంత ఉంటుందోనని మచిలీటప్నం ప్రాంత రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో ఇదే చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధి పేరుతో భూములు లాక్కోజూసినా పప్పులు ఊడకలేదు. అది మనుసులో పెట్టుకొని ఇప్పుడు పక్కా ప్లాన్‌తో సరికొత్త ‘రియల్ వెంచర్’కు స్కెచ్ వేసినట్లు అధికార పార్టీకి చెందిన నేతల్లోనే చర్చ సాగుతోంది.
⇒ ప్రభుత్వం భూ సేకరణ చేయనున్న మంగినపూడిలో 1,600 జనాభా, తవిసిపూడిలో 1,600, గోపువానిపాలెంలో 1,000.., కొత్త పూడిలో 800, పొట్లపాలెంలో 800, గోకవరంలో 1,800 జనాభా ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో ఆయా గ్రామాల ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి తట్టా బుట్టా చేత పట్టుకుని వలస వెళ్లాల్సి ఉంటుంది. వీరికి ఏ మేరకు పునరావాసం కల్పిస్తారో స్పష్టత లేదు.
⇒ వాస్తవానికి పరిశ్రమల కోసం ప్రభుత్వ భూమి ఉంటే ఇవ్వొచ్చు. లేదంటే పరిశ్రమలు పెట్టాలనుకుంటున్న యజమానులే సొంతంగా భూమి కొనుగోలు చేస్తారు. కానీ వారి తరఫున ప్రభుత్వమే ఇలా బలవంతంగా భూ సేకరణ చేయడం విస్తుగొలుపుతోంది.


