పోలవరం 41.15 మీటర్లే! | Polavaram project water storage height is 41. 15 meters says Union Jal Shakti Department in 2025-26 annual report | Sakshi
Sakshi News home page

పోలవరం 41.15 మీటర్లే!

Feb 22 2026 5:03 AM | Updated on Feb 22 2026 5:09 AM

Polavaram project water storage height is 41. 15 meters says Union Jal Shakti Department in 2025-26 annual report

నీటి నిల్వ ఎత్తుపై 2025–26 వార్షిక నివేదికలో కేంద్ర జల్‌ శక్తి శాఖ పునరుద్ఘాటన

ప్రాజెక్టు పూర్తికి రూ.12,157.53 కోట్లు మాత్రమే ఇచ్చేందుకు 2024 ఆగస్టు 28 కేంద్ర కేబినెట్‌ ఆమోదం

సాక్షి, అమరావతి: రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్ట్‌ నీటి నిల్వ ఎత్తు 41.15 మీటర్లేనని 2025–26 వార్షిక నివేదికలో కేంద్ర జల్‌శక్తి శాఖ పునరుద్ఘాటించింది. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేయడానికి రూ.12,157.53 కోట్లు ఇచ్చేందుకు 2024 ఆగస్టు 28న కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిందని గుర్తు చేసింది. అందులో రూ.5,052.71 కోట్లను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి 2024–25లో అడ్వాన్సుగా ఇచ్చామని వెల్ల­డించింది. అంటే.. ఇక రూ.7,104.82 కోట్లు మాత్రమే పోలవరానికి కేంద్రం ఇవ్వనుంది.

గోదావరి ట్రిబ్యునల్‌ అనుమతి మేరకు.. సీడబ్ల్యూసీ(కేంద్ర జలసంఘం), అటవీ పర్యావరణ సహా అన్ని అనుమతులు సాధించి.. 45.72 మీటర్ల గరిష్ట నీటి మట్టం, 194.6 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 2005లో జలయజ్ఞంలో భాగంగా పోలవరం నిర్మాణాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు ద్వారా కుడి, ఎడమ కాలువల కింద 7.20 లక్షల ఎకరాలు.. కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలు మళ్లించి 13.08 లక్షల ఎకరాలను స్థిరీకరించడం, గోదావరి డెల్టాలో 10.13 లక్షల ఎకరాలకు రెండో పంటకూ సమృద్ధిగా నీళ్లందించి స్థిరీకరించడం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా 8 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా అప్పట్లో ఉత్తర్వులు జారీ చేశారు.

అనంతరం కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ 2021 జూన్‌ 11 నాటికే 45.72 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వ చేసేలా పోలవరం స్పిల్‌ వేను వైఎస్‌ జగన్‌ సర్కార్‌ పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో 45.72 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ఇచ్చేందుకు 2020 మార్చి 17న కేంద్రం అంగీకరించింది. కానీ.. అనంతరం చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చాక 2024 ఆగస్టు 28న కేంద్ర కేబినెట్‌లో పోలవరం నీటి నిల్వ ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేసి ఆ మేరకు రూ.12,157.53 కోట్లు మాత్రమే ఇచ్చేలా తీర్మానాన్ని ఆమోదిస్తే.. ఆ కేబినెట్‌లో ఉన్న టీడీపీ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు అభ్యంతరం చెప్పకపోవడం గమనార్హం. ఇక దానిపై చంద్రబాబు సర్కార్‌ కనీసం నోరు విప్పలేదు. దీన్ని బట్టి రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టేసినట్లు స్పష్టమవుతోంది.

రిజర్వాయర్‌ నుంచి బ్యారేజ్‌గా..!
పోలవరంలో 41.15 మీటర్ల ఎత్తుకే నీటి నిల్వను పరిమితం చేస్తే 119.4 కేవలం టీఎంసీలు మాత్రమే ఉంటాయి. ఆ స్థాయికే నీటి నిల్వను పరిమితం చేస్తే.. పోలవరం కుడి, ఎడమ కాలువల కింద 1.98 లక్షల ఎకరాలకే.. అదీ గోదావరి వరద రోజుల్లో మాత్రమే నీళ్లందించడానికి అవకాశం ఉంటుందని అధికారులే స్పష్టం చేస్తున్నారు. ఇక కృష్ణా డెల్టాకు 80 టీఎంసీల మళ్లింపు.. గోదావరి డెల్టా ఆయకట్టు స్థిరీకరణ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నీళ్లందించే అవకాశమే ఉండదని తేల్చి చెబుతున్నారు. అలాంటప్పుడు పోలవరం–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు నిష్ఫలమే అవుతుందని పేర్కొంటున్నారు. ఇక ఎడమ గట్టుపై 960 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న విద్యుత్కేంద్రంలోనూ గోదావరికి వరద వచ్చే రోజుల్లో మాత్రమే అరకొరగా కరెంట్‌ ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుందంటున్నారు. 
అంటే– పోలవరం రిజర్వాయర్‌ను ఓ బ్యారేజ్‌గా మార్చేశారన్నది స్పష్టమవుతోంది.

గత 20 నెలల్లో చేసిన పనులు 6.85 శాతమే..
పోలవరం పనుల్లో 2024 ఫిబ్రవరి నాటికే 74.60 శాతం పూర్తయ్యాయి. 2025 డిసెంబర్‌ నాటికి 81.45 శాతం పనులు పూర్తయినట్లు వార్షిక నివేదికలో కేంద్ర జల్‌ శక్తి శాఖ పేర్కొంది. అంటే.. చంద్రబాబు సర్కార్‌ అధికారంలోకి వచ్చాక 20 నెలల్లో చేసిన పనులు కేవలం 6.85 శాతం మాత్రమేనని స్పష్టమవుతోంది.

ప్రాజెక్టుకు మొత్తం 1,55,464.88 ఎకరాల భూమిని సేకరించాలి. ఇందులో 1,27,262.79 ఎకరాల భూసేకరణకు 2020 మార్చి 17న కేంద్రం అంగీకరించింది. 2024 ఫిబ్రవరి నాటికి 1,13,124.17 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. ఇందులో లక్ష ఎకరాలను 2009 నాటికే వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో సేకరించారు. 2025 డిసెంబర్‌ నాటికి 1,16,711.44 ఎకరాల భూసేకరణ జరిగింది. అంటే.. 20 నెలల్లో చంద్రబాబు సర్కార్‌ సేకరించిన భూమి కేవలం 3,587.27 ఎకరాలు మాత్రమే. ఇది కూడా 2024కు ముందు సేకరించిన భూమే. 2024ృ25లో కేంద్రం రూ.5,052.71 కోట్లు అడ్వాన్సు ఇవ్వడంతో అప్పట్లో సేకరించిన భూమికి ఇప్పుడు పరిహారం అందించారు.

ప్రాజెక్టుతో 8 మండలాల్లోని 373 గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఆ గ్రామాల్లోని 1,06,006 నిర్వాసిత కుటుంబాలకు పునరావా­సం కల్పిం­చాలి. తొలి దశలో 41.15 మీటర్ల వరకూ 172 గ్రామాల్లోని 38,060 నిర్వాసిత కు­టుం­బాలకు పునరావాసం కల్పించాలని.. ఆ తర్వాత సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు నీటిని నిల్వ చేసే ఎత్తు పెంచుతూ 45.72 మీటర్ల కాం­టూర్‌ పరిధిలోని 201 గ్రామాల్లోని 67,946 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించాలని 2020లో కేంద్రం నిర్దే­శించింది. ఆ మేరకు 2024 ఫిబ్రవరి నాటికే 38 గ్రామా­ల్లోని 12,797 నిర్వాసిత కుటుంబాలను 26 కాలనీల్లో నిర్మించిన ఇళ్లలోకి తరలించి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పునరావాసం కల్పించింది. 2025 డిసెంబర్‌ నాటికి 14,371 కుటుంబాలకు పునరావాసం కల్పించారు.

చంద్రబాబు సర్కారు ఒక్కటంటే ఒక్క పునరావాస కాలనీని కూడా పూర్తి చేయలేదు. అంటే.. 20 నెలల్లో కేవలం 1,574 ని­ర్వా­సిత కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించారు. అదీ కూడా గత ప్రభుత్వం పూర్తి చేసి­న ఇళ్లలో.. కేంద్రం అడ్వాన్సుగా ఇచ్చిన రూ.5052.71 కోట్ల నుంచి పరిహారం చెల్లించి పునరావాసం కల్పించడం గమనార్హం. దీన్ని బట్టి కేంద్రం అడ్వాన్సుగా ఇచ్చిన నిధులను సద్వినియోగం చేసుకుని పోలవరం పనులను పరుగులెత్తిం­చడంలో చంద్రబాబు సర్కార్‌ ఘోరంగా విఫలమైందన్నది స్పష్టమవుతోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement