ఏయూలో మరోసారి ఉద్రిక్తత | High Tension In Visakha Andhra University: ABVP Students Protest | Sakshi
Sakshi News home page

ఏయూలో మరోసారి ఉద్రిక్తత

Feb 22 2026 5:09 AM | Updated on Feb 22 2026 5:09 AM

High Tension In Visakha Andhra University: ABVP Students Protest

వర్సిటీ ఎదుట ఏబీవీపీ విద్యార్థుల ఆందోళన

వివాదాల పరిష్కారానికి పీస్‌ కమిటీ ఏర్పాటు

విశాఖ సిటీ: ఆంధ్రా యూనివర్సిటీలో రెండు రోజుల క్రితం ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాన్ని ఎస్‌ఎఫ్‌ఐ అడ్డుకోవడంతో మొదలైన వివాదం.. శనివారం ఏబీవీపీ నిరసనతో మరోసారి ఉ­ద్రి­క్తతకు దారితీసింది. తమపై దాడి చేసిన ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. ఈ ఉద్రిక్తతలను తగ్గించేందుకు పోలీ­సు­లు ఈస్ట్‌ ఏసీపీ పరిధిలో సెక్షన్‌ 30 యాక్ట్‌ను అమలు చేశారు. అయినప్పటికీ శనివారం ఉదయమే ఏబీవీపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో ఏయూ మెయిన్‌ గేట్‌ వద్దకు చేరుకుని భారీ నిరసన చేపట్టారు.

తమ కార్యకర్తలపై దాడులు చేసిన వారి­ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. యూనివర్సిటీ లోపలకు చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట, వాగ్వాదం చోటు­చేసుకుంది. పోలీసులు వర్సిటీ గేట్లను మూసివేసి, కేవలం ఐడీ కా­ర్డులు ఉన్న విద్యార్థులను మాత్రమే లోపలికి అనుమతించారు. ఏబీవీపీ నేతల ఆందోళనకు మద్దతుగా బీజేపీ నేతలు కూడా రావడంతో అక్కడ వాతావరణం మరింత వేడెక్కింది. 

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించం 
నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి, ఈస్ట్‌ ఏసీపీ లక్ష్మణమూర్తి వెంటనే అక్కడకు చేరుకున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎవ­రు తప్పు చేసినా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఏబీవీపీ సంఘం నేతలు కాస్త మెత్తబడ్డారు. అనంతరం ఏయూ రిజి్రస్టార్, ఇతర అధికారులు విద్యార్థి సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. క్యాంపస్‌లో విద్యా వాతావరణాన్ని దెబ్బతీయవద్దని, రాజకీయ లేదా మతపరమైన కార్యక్రమాలకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులు సంయమనం పాటించాలని కోరారు. 

వివాదాల పరిష్కారానికి పీస్‌ కమిటీ ఏర్పాటు 
ఆంధ్రవిశ్వవిద్యాలయంలో గత కొన్ని రోజులుగా విద్యార్థి సంఘాల మధ్య జరుగుతున్న వివాదాన్ని పరిష్కరించడానికి ప్రత్యేకంగా ఒక పీస్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్‌ సమక్షంలో రెక్టార్‌ ఆచార్య పి.కింగ్, ఆర్డీఓ సుధా సాగర్, ఏసీపీ లక్ష్మణమూర్తి విద్యార్థి సంఘాలతో శనివారం సమావేశం అయ్యారు. వివాదానికి సంబంధించిన వీడియోలు, సాక్ష్యాధారాలను సోమవారం మధ్యాహ్నంలోగా రిజిస్ట్రార్‌కు అందించాలని రెండు వర్గాలకు సూచించారు. ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, ఏబీవీపీ నాయకుల నుంచి వినతులు, అభ్యంతరాలు, వాదనలను పీస్‌ కమిటీ సభ్యులు సుమారు రెండు గంటల పాటు సావధానంగా విన్నారు. అలాగే మార్చి 2న పీస్‌ కమిటీ మరోసారి సమావేశమై తుది నిర్ణయం వెలువరిస్తుందని, అందుకు రెండు సంఘాలు కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు.

ఏయూ ప్రధాన గేటు వద్ద నిరసన తెలుపుతున్న ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement