పొట్ట కొడుతున్న ‘ఏఐ’.. ‘రియాలిటీ’ యజమాని కన్నీరు! | AI pivot was best Financial move but worst Emotional experience | Sakshi
Sakshi News home page

పొట్ట కొడుతున్న ‘ఏఐ’.. ‘రియాలిటీ’ యజమాని కన్నీరు!

Feb 23 2026 11:03 AM | Updated on Feb 23 2026 11:10 AM

AI pivot was best Financial move but worst Emotional experience

ఒట్టావా: కృత్రిమ మేధ (ఏఐ) రాకతో కార్పొరేట్ రంగంలో సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు పదుల సంఖ్యలో ఉద్యోగులు అవసరమైన పనులను నేడు ‘ఏఐ’ క్షణాల్లో పూర్తి చేస్తోంది. అయితే ఈ సాంకేతిక పరివర్తన ఆర్థిక లాభాలను తెస్తున్నప్పటికీ, తీవ్రమైన మానసిక వేదనను  మిగిలుస్తున్నదని కెనడాకు చెందిన ‘ఫౌండర్ రియాలిటీ’ వ్యవస్థాపకుడు జార్జ్ పు  పేర్కొన్నారు.

తన సంస్థను నిలబెట్టుకోవడానికి 14 మంది ఉన్న బృందాన్ని కేవలం ఐదుగురికి తగ్గించాల్సి రావడం తన వృత్తి జీవితంలోనే అత్యంత కఠినమైన నిర్ణయమని జార్జ్  ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఏడాదిలో టీమ్ సభ్యులను భారీగా తగ్గించి, కొత్త నియామకాలు చేపట్టకుండా ఏఐపైనే ఆధారపడటంతో ఆర్థికంగా అద్భుతమైన ఫలితాలు వచ్చాయని అయితే  అది మానవత్వాన్ని మరచిన ఒంటరి ప్రయాణంగా మారిందని  చెబుతూ ఆయన కన్నీరు పెట్టుకున్నారు.
 

వ్యాపార వ్యయాలు పెరిగి, ఆదాయంపై ఒత్తిడి పడుతున్న తరుణంలో సంస్థ మనుగడ కోసమే ఈ  నిర్ణయం తీసుకున్నట్లు జార్జ్ తెలిపారు. గతంలో మనుషులు అవసరమని భావించిన ప్రతి పనినీ ప్రస్తుతం కృత్రిమ మేధతోనే పూర్తి చేస్తున్నామని, సాంకేతికత మన అంచనాలకు మించి ఫలితాలనిస్తోందని ఆయన వివరించారు. ఈ మార్పు వల్ల కంపెనీ మార్జిన్లు పెరిగినప్పటికీ, తోటి ఉద్యోగులను పంపించివేయడంతో కలిగిన మానసిక క్షోభ  ఎవరూ తీర్చలేనిదని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

‘ఇది నా కెరీర్‌లో అత్యుత్తమ ఆర్థిక నిర్ణయం.. కానీ అత్యంత దారుణమైన భావోద్వేగ అనుభవం’ అంటూ ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ప్రయాణంలో ఎదురయ్యే ఒంటరితనం గురించి ఎవరూ మాట్లాడరని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పోస్ట్‌పై నెటిజన్ల నుండి భిన్నమైన స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కృత్రిమ మేధ పనితీరును (ఔట్‌పుట్) భర్తీ చేయగలదు కానీ, ఒక సంస్థ నిర్మాణం వెనుక ఉండే మనుషుల ఉద్వేగాలను, వారి శక్తిని భర్తీ చేయలేదని పలువురు అభిప్రాయపడ్డారు. పొదుపు చర్యల పేరుతో ఉద్యోగులను తొలగించడం వల్ల యజమానిపై పనిభారం పెరగడమే కాకుండా, సహోద్యోగులతో ఉండే సంబంధాలు తెగిపోతాయని పలువరు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Mexico: డ్రగ్ మాఫియా డాన్ ‘ఎల్ మెంచో’ హతం

Advertisement
 
Advertisement
Advertisement