ఏఐ దెబ్బ: ‘లివ్‌స్పేస్‌’లో వెయ్యి మంది అవుట్! | 1000 Jobs Cut as livspace Bets Big on Artificial Intelligence | Sakshi
Sakshi News home page

ఏఐ దెబ్బ: ‘లివ్‌స్పేస్‌’లో వెయ్యి మంది అవుట్!

Feb 22 2026 9:48 AM | Updated on Feb 22 2026 9:52 AM

1000 Jobs Cut as livspace Bets Big on Artificial Intelligence

న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) ఏ రంగాన్నీ విడిచిపెట్టడం లేదు. ప్రపంచాన్ని ఏఐ రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో హోమ్ ఇంటీరియర్ రంగంలో అగ్రగామి స్టార్టప్ సంస్థ ‘లివ్‌స్పేస్’ సంచలన నిర్ణయం తీసుకుంది. కృత్రిమ మేధ వినియోగాన్ని పెంచి, కార్యకలాపాలను పూర్తిగా ఏఐ ఆధారితంగా మార్చే క్రమంలో భాగంగా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. సుమారు 1,000 మంది సిబ్బందిని, అంటే సంస్థలోని 12 శాతం సిబ్బందిని ఇంటికి పంపినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

కేకేఆర్ (కేకేఆర్‌) లాంటి దిగ్గజ సంస్థల పెట్టుబడులతో రూపుదిద్దుకున్న ఈ యూనికార్న్ స్టార్టప్‌లో  7,000 నుండి 8,000 మంది వరకు సిబ్బంది ఉన్నారు. తాజా పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా డిజైనింగ్, సేల్స్, ఆపరేషన్స్, మార్కెటింగ్ విభాగాలపై ఏఐ ప్రభావం తీవ్రంగా పడింది. ఖర్చులను తగ్గించుకోవడమే కాకుండా రాబోయే రోజుల్లో సంస్థను ‘ఏఐ-నేటివ్ ఏజెంటిక్’ ఆర్గనైజేషన్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ మార్పులు చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.

ఈ పరిణామాలపై కంపెనీ ప్రతినిధి స్పందిస్తూ, ఇది కేవలం పొదుపు చర్య మాత్రమే కాదని, వనరులను వ్యూహాత్మకంగా పునఃకేటాయించడంలో భాగమేనని అన్నారు. సాంకేతికతకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే సంస్థగా కార్యకలాపాలను పూర్తిస్థాయిలో ఆటోమేషన్‌ చేస్తున్నట్లు వివరించారు. గతంలో మానవ వనరులతో సాధ్యమయ్యే పనులను ఇప్పుడు అధునాతన ఏఐ ఏజెంట్లు చేపడుతున్నాయని, దీనివల్ల ప్రస్తుతం ఉన్న బృందాల పనితీరు కూడా మెరుగుపడుతుందని సంస్థ భావిస్తోంది.

లివ్‌స్పేస్ చరిత్రలో ఉద్యోగుల తొలగింపు ఇది మొదటిసారి కాదు. గతంలో 2020లో 400 మందిని, 2023లో దాదాపు 100 మందిని ఆర్థిక లక్ష్యాల సాధనలో భాగంగా తొలగించింది. ఆర్థిక ఫలితాల పరంగా చూస్తే 2025 మార్చి నాటికి ముగిసిన ఆర్థిక సంవత్సరంలో లివ్‌స్పేస్ తన ఆదాయాన్ని గణనీయంగా పెంచుకుంది. మునుపటి ఏడాది 1,185 కోట్లుగా ఉన్న ఆదాయం, తాజాగా 23 శాతం వృద్ధి చెంది 1,460 కోట్ల రూపాయలకు చేరుకుంది. అదే సమయంలో సంస్థ తన నష్టాలను కూడా 416 కోట్ల నుండి 242 కోట్లకు తగ్గించుకోగలిగింది. సుమారు 500 మిలియన్ డాలర్ల నిధులను సేకరించి, ఒక బిలియన్ డాలర్లకు పైగా విలువ కలిగిన సంస్థగా ఎదిగినప్పటికీ, మారిన సాంకేతిక పరిస్థితుల దృష్ట్యా ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

మరోవైపు సంస్థ నాయకత్వంలోనూ కీలక మార్పు చోటుచేసుకుంది. లివ్‌స్పేస్ సహ వ్యవస్థాపకుడు సౌరభ్ జైన్ తన పదవికి రాజీనామా చేశారు. 2015లో తన స్టార్టప్ ‘డిజైన్‌అప్’ను లివ్‌స్పేస్‌లో విలీనం చేసిన నాటి నుండి సంస్థలో కీలక పాత్ర పోషించిన ఆయన, 2022లో చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు. దాదాపు 11 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత తన వ్యక్తిగత  కారణాలతో సంస్థ నుండి నిష్క్రమిస్తున్నట్లు  ఆయన తెలిపారు. సాంకేతిక పరిణామాల నేపథ్యంలో నాయకత్వ మార్పులు కూడా సహజంగానే జరుగుతున్నాయని ఈ సందర్భంగా సంస్థ పేర్కొనడం గమనార్హం. 

ఇది కూడా చదవండి: ‘మూన్‌ మిషన్‌’కు బ్రేక్..‘నాసా’ కీలక ప్రకటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement