శివాజీనగర(కర్ణాటక): ఐపీఎస్ అధికారి డి.రూపా మౌద్గిల్ తనపై వేసిన పరువు నష్టం కేసును రద్దు చేయాలని కోరుతూ ఐఏఎస్ అధికారి డి.రోహిణి సింధూరి సమరి్పంచిన పిటిషన్‌ను శనివారం హైకోర్టు డిస్మిస్ చేసింది. కేసు విచారణ కొనసాగుతుందని తెలిపింది. దీంతో కింది కోర్టులో కేసు విచారణకు ఉన్న అడ్డంకి తొలగినట్లయింది. 2023 ఫిబ్రవరిలో రోహిణి సింధూరి మీద రూప ప్రైవేట్ కేసు (పీసీఆర్) నమోదు చేశారు.
సోషల్ మీడియాలో రోహిణి తనను అవమానపరిచేలా పోస్టులు పెట్టారని, పరువుకు నష్టం కలిగించారని, మానసిక అస్వస్థురాలిగా పేర్కొన్నారని రూపా ఆరోపించారు. ఆమె పోస్టుల వల్ల ప్రభుత్వం తనకు కొన్ని నెలలపాటు పోస్టింగ్ ఇవ్వకుండా బదిలీ చేసింది, కుటుంబ సభ్యులకు తీవ్ర మానసిక క్షోభ కలిగిందని డీ.రూపా కోర్టు మెట్లెక్కారు. కేసు విచారణలో ఉండగా, కొట్టివేయాలని రోహిణి హైకోర్టును ఆశ్రయించగా ఈ మేరకు తీర్పు వచ్చింది. ప్రస్తుతం రూపా అదనపు డీజీపీగా, రోహిణి ఓ శాఖ కార్యదర్శి స్థాయిలో ఉన్నారు.


