ఫేక్ పర్సనాలిటీ వద్దు..మీరు మీలా ఉండండి..! | Health tips: Bridging the Gap between Real Self and Ideal Self | Sakshi
Sakshi News home page

The 'Ideal Self' Trap: ఎదుటివారిలా ఉండాలనుకోవడమే సమస్య!

Feb 23 2026 7:10 AM | Updated on Feb 23 2026 7:10 AM

Health tips: Bridging the Gap between Real Self and Ideal Self

మనం రోజూ ఉదయం లేవగానే ఇన్‌స్టాగ్రామ్ లేదా యూట్యూబ్ ఓపెన్ చేస్తాం. అక్కడ ఒకరు సిక్స్ ప్యాక్ బాడీతో కనిపిస్తారు, ఇంకొకరు ఖరీదైన కారులో తిరుగుతూ కనిపిస్తారు, మరొకరు అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు. వారిని చూడగానే "నేను కూడా వాళ్ళలాగే ఉండాలి" అనే ఆలోచన మొదలవుతుంది.

మెల్లమెల్లగా మనం 'మనం'లా ఉండటం మానేసి, ఎవరోలా మారడానికి ప్రయత్నిస్తాం. సైకాలజీలో దీన్నే 'Ideal Self Trap' అంటారు. ఇది ఒక మానసిక జబ్బు లాంటిది, ఇది మీ అసలైన వ్యక్తిత్వాన్ని (Real Personality) చంపేస్తుంది.

1. Real Self vs. Ideal Self: అసలు గొడవ ఎక్కడ?
కార్ల్ రోజర్స్ సిద్ధాంతం ప్రకారం, ప్రతి వ్యక్తిలో రెండు రూపాలు ఉంటాయి. ఒకటి మనం ప్రస్తుతం ఉన్న రూపం (Real Self), రెండోది మనం ఎలా ఉండాలని కోరుకుంటామో ఆ రూపం (Ideal Self).

Real Self (నిజమైన నేను): ప్రస్తుతం మీరు ఎవరు? మీ బలాలు ఏంటి? మీ బలహీనతలు ఏంటి? మీ సహజమైన ప్రవర్తన ఎలా ఉంటుంది? అనేది ఇది.

Ideal Self (ఆదర్శవంతమైన నేను): మీరు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? సమాజం మిమ్మల్ని ఎలా చూడాలని మీరు ఆశపడుతున్నారు? అనేది ఇది.

ఈ రెండింటి మధ్య దూరం పెరిగినప్పుడు మనిషిలో 'Anxiety' (ఆందోళన) మరియు 'Self-Hatred' (తన్ను తాను అసహ్యించుకోవడం) మొదలవుతాయి.

ఉదాహరణకు, మీరు సహజంగా మితభాషి (Introvert) అనుకుందాం. కానీ మీరు ఒక పాపులర్ మోటివేషనల్ స్పీకర్‌ను చూసి, అతనిలాగా గలగలా మాట్లాడాలని (Extrovert) ప్రయత్నిస్తే.. మీరు మీ 'Real Self'ను మోసం చేస్తున్నట్లే. ఈ గ్యాప్ పెరిగే కొద్దీ మీ పర్సనాలిటీ విచ్ఛిన్నమవుతుంది.

2. మార్కెట్ మోటివేషన్ ఎలా ట్రాప్ చేస్తుంది?
పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ట్రైనర్లు, motivation స్పీకర్లు ఈ 'Ideal Self' ట్రాప్‌ను క్యాష్ చేసుకుంటారు. "నువ్వు వారిలా తయారవ్వచ్చు, వీరిలా గెలవొచ్చు, ఈ స్టెప్స్ ఫాలో అయితే నువ్వు ఒక సూపర్ హ్యూమన్ అవుతావు" అని చెప్తారు. అంటే వారు మీకు ఒక 'అద్దె వ్యక్తిత్వాన్ని' (Borrowed Personality) అమ్ముతున్నారు.

సైకాలజీ ఏం చెప్తుందంటే.. "నువ్వు ఎవరిలాగో అవ్వాల్సిన అవసరం లేదు. నీలోని ఉత్తమ వెర్షన్‌గా మారితే చాలు."

వేరొకరిని కాపీ కొట్టడం అంటే మీ ఒరిజినాలిటీని ఖననం చేయడమే. పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా, మార్కెట్ ఇచ్చే 'సక్సెస్ టిప్స్' మిమ్మల్ని ఒక ఫేక్ పర్సనాలిటీగా మారుస్తాయి.

3. ఎదుటివారిలా ఉండాలనుకోవడం 'జబ్బు' ఎందుకు?
ఇది జబ్బు అని ఎందుకు అంటున్నానంటే, దీనివల్ల మూడు ప్రమాదాలు ఉన్నాయి:

Constant Comparison (నిరంతర పోలిక): మీరు ఎప్పుడూ ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారు. దీనివల్ల మీ దగ్గర ఉన్నవి మీకు తక్కువగా అనిపిస్తాయి.

Loss of Identity (గుర్తింపు కోల్పోవడం): మీకంటూ సొంత ఆలోచనలు ఉండవు. ఎదుటివారు దేన్ని సక్సెస్ అంటే దాన్నే మీరు కూడా సక్సెస్ అనుకుంటారు.

Low Self-Esteem: మీరు 'Ideal Self'ను అందుకోలేనప్పుడు.. "నేను దేనికీ పనికిరాను" అనే భావన బలపడుతుంది.

4. Real Personality Development: ట్రాప్ నుండి బయటపడటం ఎలా?
Genius Matrix Hub ఫిలాసఫీ ప్రకారం, ఈ ట్రాప్ నుండి బయటపడి మీ లెగసీని ఎలా నిర్మించుకోవాలి?

STEP 1: BREAK (ముసుగును తొలగించండి)
ముందుగా మీరు ఎవరిని చూసి ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నారో గుర్తించండి.

"నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నది నా అవసరం కోసమా? లేక పక్కింటి వ్యక్తిని చూసి గొప్పలు పోవడానికా?"

"నేను ఈ బట్టలు వేసుకుంటున్నది నాకు నచ్చిందా? లేక సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టడానికా?"

ఈ విశ్లేషణ మీలోని 'ఫేక్ ఐడియల్ సెల్ఫ్'ని బ్రేక్ చేస్తుంది.

STEP 2: BUILD (కంగ్రూయెన్స్ - ఏకీకరణ)
మీ 'Real Self'కు మరియు 'Ideal Self'కు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించాలి. అంటే, అసాధ్యమైన లక్ష్యాలు పెట్టుకోకుండా.. మీ సహజ సిద్ధమైన నైపుణ్యాలను (Natural Talents) పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి.
* మీరు మంచి రచయిత అయితే, బలవంతంగా స్పీకర్ అవ్వాలని ట్రై చేయకండి. మీ రైటింగ్‌లోనే మీ పర్సనాలిటీని బిల్డ్ చేయండి.
* Self-Acceptance (నిన్ను నీవు అంగీకరించడం) లేనిదే వికాసం మొదలవ్వదు.

STEP 3: BEYOND (అథెంటిసిటీ)
ఒక్కసారి మీరు ఎదుటివారిలా ఉండాలనే తాపత్రయం వదిలేస్తే, మీలో ఒక వింతైన ధైర్యం వస్తుంది. అదే అథెంటిసిటీ (Authenticity). ప్రపంచం ఎప్పుడూ 'ఒరిజినల్'కే విలువ ఇస్తుంది, 'కాపీ'కి కాదు. మీరు మీలా ఉంటూనే ప్రపంచాన్ని ప్రభావితం చేయడమే 'Beyond' స్టేజ్.

5. మీ కోసం చిన్న పరీక్ష
ఈ రోజు మీరు ఒక ప్రశాంతమైన చోట కూర్చుని ఈ ప్రశ్నలకు సమాధానం వెతకండి:

నేను ఏ విషయంలో ఇతరులను చూసి అసూయ పడుతున్నాను? ఆ లక్షణం నిజంగా నా వ్యక్తిత్వానికి అవసరమా?

నేను ఎవరి ముందైనా నటించకుండా ఉండగలుగుతున్నానా?

నన్ను నేను మెరుగుపరుచుకోవాలనుకుంటున్నది నా ఆనందం కోసమా? లేక లోకానికి నిరూపించుకోవడానికా?

మీ సీటులో మీరు కూర్చోండి!
బ్రో, ప్రపంచం ఒక పెద్ద నాటక రంగం అయితే, ఇక్కడ అందరూ హీరోలే అవ్వాలని చూస్తున్నారు. కానీ నిజమైన సక్సెస్ ఎక్కడ ఉందంటే.. మీకు కేటాయించిన పాత్రను (మీ రియల్ సెల్ఫ్) అద్భుతంగా పండించడంలోనే ఉంది.

ఎదుటివారిలా ఉండాలనుకోవడం ఒక జబ్బు అయితే, దానికి మందు "మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం". మీలోని లోపాలను కూడా గౌరవించండి, అవే మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడతాయి.

"Be a first-rate version of yourself, instead of a second-rate version of somebody else."

సైకాలజిస్ట్ విశేష్ 
Genius Matrix Hub 
8019 000066
www.psyvisesh.com

(చదవండి: Parenting or Programming: మిమ్మల్ని మీరు మార్చుకోవచ్చా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement