మనతోపాటు సామాన్యులుగా వచ్చి.. చూస్తుండగానే కోట్లకు పడగలెత్తి ఆదర్శంగా నిలుస్తారు కొందరు. వాళ్లు కూడా మనలానే పైకి ఎదిగే క్రమంలో పలు సవాళ్లు ఎదుర్కొంటారు కూడా. కానీ ఆ సమయంలో కూడా ఎలాంటి తడబాటుకి లోనవ్వకుండా సరైన నిర్ణయాలతో.. ఉన్నతస్థాయికి చేరుకుని స్ఫూర్తిగా నిలుస్తారు. అలాంటి కోవకు చెందిన వాడే రామచంద్ర అగర్వాల్. వైకల్యం శరీరానికే గానీ..మనసుకు కాదంటూ..అచంచలమైన కృషితో వస్త్రపరిశ్రమలో గొప్ప సక్సెస్‌ని అందుకుని అందరిచేత శెభాష్ అనిపించుకున్నారు.
అయనే కొల్‌కతాకు చెందిన రామ్ చంద్ర అగర్వాల్. 1965లో ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. నాలుగేళ్ల వయసులో పోలియో బారినపడి కింద శరీరం అంత చచ్చుబడిపోయింది. అయినా..అతడిలో కష్టపడేతత్వం..అత్యున్నత స్థాయికి ఎదగాలన్న ఆకాంక్ష ప్రగాఢంగా ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే అధికారిక విద్యను పూర్తిచేసిన వెంటనే చిన్న జిరాక్స్ షాప్ పెట్టుకున్నాడు.
దీంతో త్వరితగతిన ఉన్నతస్థాయికి చేరుకోలేమని గ్రహించి..వస్త్రపరిశ్రమ వైపుకి అడుగులు వేశాడు. అలా కోల్‌కతాలో చిన్న బట్టల దుకాణం ప్రారంభించాడు. భారతీయ ఫ్యాషన్ వినియోగదారుల ట్రెండ్‌ని అర్థం చేసుకుంటూ..ఈ పరిశ్రమలో విజయం సాధించడం ఎలాగో నేర్చుకోవడం ప్రారంబించాడు. అలా 2000 ప్రారంభంలో ఢిల్లీకి మకాం మార్చి..2001లో తన మొదటి విశాల్ మెగా మార్ట్ స్టోర్‌ని ప్రారంభించాడు.
ఇది మధ్యతరగతి వ్యక్తులను ఎక్కువగా ఆకర్షించింది, చేరువైంది కూడా. దాంతో ఈ మార్ట్ కిరాణా సామాగ్రి, దుస్తులు..అనుకూలమైన ధరలకే కొనుగోలు చేసే హాట్‌స్పాట్‌గా మారింది. అలా చుట్టపక్కాల మహా నగరాల వరకు ఈ మార్ట్ బ్రాంచ్‌లు విస్తరించాయి. అలా తన దుకాణాన్ని విస్తరించే క్రమంలో దాదాపు భారీగా అప్పులు చేశాడు. సరిగ్గా ఆ టైంలో 2008-09లో ప్రపపంచ ఆర్థిక సంక్షోభం వచ్చింది. దాంతో అప్పు పెరిగిపోయింది, మరోవైపు కస్టమర్లు తగ్గిపోతున్నారు.
చెప్పాలంటే రామ్‌చంద్రకు కఠినమైన సమయం ఇది. దాంతో 2011లో రూ. 2 వేల కోట్ల విలువైన వ్యాపారాన్ని శ్రీరామ్ గ్రూప్ అండ్ ప్రైవేట్ ఈక్విటీ కంపెనీకి దాదాపు రూ. 70 కోట్లకు అమ్మేశారు. కొత్త యజమాన్యంలోకి ఉన్నప్పటికీ విశాల్ బ్రాండ్ కొనసాగడం విశేషం. ఆ తర్వాత అగర్వాల్ వీ2 రిటైల్ లిమిటెడ్ రూపంలో కొత్త వెంచర్ ప్రారంభించాడు. మొదటి స్టోర్ జంషెడ్‌పూర్‌లో ప్రారంభించారు. అనతి కాలంలో వేగంగా పుంజుకుని లాభాల బాటలు పట్టింది. కొన్నేళ్లకు ఏకంగా వంద కోట్ల టర్నోవర్‌ని అందుకుంది. పైగా అనేక భారతీయ నగరాల్లో 150కి పైగా ఎక్కువ దుకాణాలను కలిగి ఉంది.
అలా 2025 కల్లా వీ2 రిటైల్ భారతదేంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రిటైల్ బ్రాండ్‌లో ఒకటిగా ఉద్భవించింది. పైగా మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 6వేల కోట్ల టర్నోవర్‌కు మించిపోయింది. ఇంతటి బిజీ పరిస్థితుల్లోనూ ఆనందానికి, కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడం మర్చిపోడాయన. ఆయనకు అందమై భార్య, పిల్లలు ఉన్నారు. వాళ్ల సహాయ సహకారాలతోనే ఇంత పెద్దసక్సెస్ అందుకున్నానని చెబుతుంటాడు రామ్‌చంద్ర అగర్వాల్.
(చదవండి: Parenting or Programming: మిమ్మల్ని మీరు మార్చుకోవచ్చా?)


