అతను చూడగానే చిన్నపిల్లాడిలా అనిపిస్తాడు. అప్పుడే వస్తున్న నూనూగు మీసాలు అతని ముఖానికి కొత్తదనాన్ని తెచ్చాయి. అయితే కనిపించే ఈ రూపానికి భిన్నంగా అతని భుజాలపై మెరిసే నక్షత్రాల బ్యాడ్జీ, హుందాగా కనిపించే యూనిఫాం... ఇదంతా గమనిస్తే ఇంతకీ ఆ పిల్లాడు ఎవరు అనే సందేహం అందరిలో మెదులుతుంది. అతనే రాజస్థాన్ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అభిజీత్ పాటిల్.. భారత 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. దేశసేవలో భాగస్వామి అయిన ఈ 22 ఏళ్ల కుర్రాడి సక్సెస్ స్టోరీ..
నమ్మి తీరాల్సిందే..
దేశంలో అతి పిన్న వయసులో ఐపీఎస్ సాధించిన అభిజీత్ పాటిల్‌ను చూసిన వారు అతని రూపాన్ని చూసి తెగ ఆశ్చర్యపోతుంటారు. ఇంత చిన్న వయసులో శాంతిభద్రతల లాంటి క్లిష్టమైన బాధ్యతలను ఇతను నిర్వహిస్తున్నాడా? అని ముక్కున వేలేసుకుంటారు. మొదట ఎవరైనా ఇతనిని చూడగానే పోలీసు ఉన్నతాధికారి అంటే నమ్మలేరు. మహారాష్ట్రలోని థానేలో జన్మించిన అభిజీత్ 22 ఏళ్ల వయసులోనే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించి, దేశ యువతకు స్ఫూర్తిగా నిలిచారు.
తొలి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా ర్యాంక్
అభిజీత్ పాటిల్ విద్యాభ్యాసం ఎంతో ఆసక్తికరంగా సాగింది. 2022లో సివిల్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ చివరి సంవత్సరం చదువుతుండగానే అభిజీత్ యూపీఎస్సీ ప్రిపరేషన్ మొదలుపెట్టారు. ఆశ్చర్యకరంగా డిగ్రీ సర్టిఫికేట్ చేతికి రాకముందే ఆయన ప్రిలిమ్స్ పాస్ అయ్యాడు. ఆ తర్వాత మెయిన్స్ కూడా క్లియర్ చేసి, 2022 సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో 470వ ర్యాంకు సాధించాడు. కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగకుండా, ఇంటి వద్దే ఉండి, ఈ అద్భుత విజయాన్ని సొంతం చేసుకోవడం విశేషం.
రోజుకు 8 గంటలు చదువుతూ..
అభిజీత్ విజయ రహస్యం ఆయన సొంతంగా రూపొందించుకున్న ప్రణాళిక. లక్షల రూపాయలు వెచ్చించి, కోచింగ్ తీసుకునే స్తోమత లేని వారికి అభిజీత్ ఓ రోల్ మోడల్ అని చెప్పుకోవచ్చు. యూట్యూబ్‌లో ఒక టాపర్ వీడియో చూసి. అభిజీత్ తాను ఐపీఎస్ కావాలని నిర్ణయించుకున్నాడు. ఎనిమిది నెలల పక్కా ప్రణాళికతో చదివాడు. రోజుకు 8 గంటల పాటు సిలబస్‌ను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం, పాత ప్రశ్నాపత్రాలను విశ్లేషించడం, మాక్ టెస్టులు రాయడం ద్వారా విజయం సాధించారు. లక్ష్యంపై స్పష్టత ఉంటే సివిల్స్ లాంటి కఠినమైన పరీక్షలను కూడా సులభంగా ఛేదించవచ్చని అభిజీత్ నిరూపించాడు.
సామాన్యుల గుండెల్లో 'యంగ్ హీరో'
ప్రస్తుతం రాజస్థాన్‌లోని చురు జిల్లా రాజ్‌గఢ్‌లో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎఎస్‌పీ)గా అభిజీత్ విధులు నిర్వర్తిస్తున్నారు. 172 సెంటీమీటర్ల ఎత్తు ఉన్నప్పటికీ, ఆయనకున్న ‘బేబీ ఫేస్’ కారణంగా అతనిని చూసినవారంతా ఆయనను చిన్నపిల్లాడిగా పొరబడుతుంటారు. విధి నిర్వహణలో అభిజీత్ పనితీరు ప్రజల్లో ఆయనకు ప్రత్యేక స్థానాన్ని సంపాదించిపెట్టింది. ఇటీవల రాజ్‌గఢ్‌కు చెందిన ఒక కూలీ తన కుమారుని పుట్టినరోజు నాడు అభిజీత్ వద్దకు వచ్చి, తన కుమారుడిని ఆశీర్వదించాలని కోరడం ఆయనకున్న క్రేజ్‌కు నిదర్శనం. ఆ పిల్లాడు కూడా భవిష్యత్తులో పోలీస్ ఆఫీసర్ కావాలని కలలు కంటున్నాడని తెలుసుకున్న అభిజీత్ ఎంతో సంతోషించారు.
ఇది కూడా చదవండి: 40 ఏళ్లకే రిటైర్మెంట్? వణికిస్తున్న ‘లే-ఆఫ్’లు


