‘ఫ్యూచర్ రెడీ’ పోలీసింగ్‌లో రోల్ మోడల్‌గా తెలంగాణ | Telangana Emerges as a Role Model in Future Ready Policing Sridhar Babu | Sakshi
Sakshi News home page

‘ఫ్యూచర్ రెడీ’ పోలీసింగ్‌లో రోల్ మోడల్‌గా తెలంగాణ

Mar 8 2026 9:00 PM | Updated on Mar 8 2026 9:00 PM

Telangana Emerges as a Role Model in Future Ready Policing Sridhar Babu
  • భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు ‘ట్రిపుల్ టీ’ వ్యూహం
  • నేరాల జరగకముందే అడ్డుకునేలా ‘ప్రెడిక్టివ్ పోలీసింగ్’కు ప్రాధాన్యం
  • తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్ 2026’లో మంత్రి శ్రీధర్ బాబు

‘ఫ్యూచర్ రెడీ’ పోలీసింగ్‌లో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలపాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పోలీసింగ్ లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ‘ట్రిపుల్ టీ’(టెక్నాలజీ, ట్రస్ట్, టాలెంట్) వ్యూహంతో ముందుకెళ్తున్నామన్నారు.  ఆదివారం ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో పోలీస్ ఉన్నతాధికారులకు ‘తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్ 2026’ పేరిట నిర్వహించిన ప్రత్యేక కార్యశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.... ఒకప్పుడు పోలీసింగ్ అంటే కేవలం శాంతి భద్రతల పరిరక్షణ మాత్రమే, ఇప్పుడు డేటా సెక్యూరిటీ, డిజిటల్ ట్రస్ట్ గా రూపాంతరం చెందిందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా క్రైం కూడా భౌతిక సరిహద్దులను దాటి డిజిటల్ రూపంలోకి విస్తరించిందన్నారు. డీప్‌ఫేక్ వీడియోలు, వాయిస్ క్లోనింగ్, ఆటోమేటెడ్ ఫిషింగ్ స్కామ్‌లు పోలీసులకు పెను సవాల్‌గా మారాయన్నారు. 

ప్రస్తుతం నేరగాళ్లకు ఆయుధాలతో పనిలేదని, స్మార్ట్ ఫోన్, డేటా, డిజిటల్ ఐడెంటిటీస్ తో నేరాలకు పాల్పడుతున్నారన్నారు. ఒక్క 2024లో దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు రూ.22,845 కోట్లు  కొల్లగొట్టారని, అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 206 శాతం ఎక్కువన్నారు. సైబర్ బాధితుల్లో నిరక్షరాస్యుల కంటే అక్షరాస్యులే అధికంగా ఉంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 

ఇలాంటి తరుణంలో ప్రొఫెషనలిజం, ఆపరేషనల్ రెడీనెస్, లీడర్‌షిప్, ఇన్నోవేషన్, కొలాబరేషన్ , ఎథిక్స్ తో కూడిన ఫ్యూచర్ రెడీ పోలీసింగ్ ఆవశ్యకమన్నారు. ఇప్పటికే టెక్నాలజీ ఎనేబుల్డ్ పోలీసింగ్ లో తెలంగాణ ముందు వరుసలో ఉందన్నారు. రాబోయే రోజుల్లో డేటా అనలిటిక్స్, ఏఐ లాంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ సాయంతో నేరాల జరగకముందే అడ్డుకునే ‘ప్రెడిక్టివ్ పోలీసింగ్’కు పెద్దపీట వేస్తామన్నారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్య సాధనలో పోలీసుల పాత్ర కీలకమన్నారు. 

ప్రజల నమ్మకాన్ని చూరగొన్నప్పుడే అసలైన పోలీసింగ్ సాధ్యమవుతుందన్నారు. నక్సలిజంపై పోరాటంలో అసువులు బాసిన పోలీస్ అమరవీరులను ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు స్మరించుకున్నారు. వారి త్యాగం వృథా కాలేదన్నారు. కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్, పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష భిష్త్, రిటైర్డ్ డీజీపీలు హెచ్ జే దొర, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement