ప్రస్తుత కార్పొరేట్ ప్రపంచంలో మాంద్యం కన్నా ‘లే-ఆఫ్’ గండం అందరినీ భయపెడుతోంది. కేవలం ఒక ఈ-మెయిల్ లేదా ఒక ఫోన్ కాల్‌తో ఉద్యోగుల దశాబ్దాల కెరీర్ పేకమేడలా కూలిపోతోంది. ఒకప్పుడు 58 లేదా 60 ఏళ్లకు ఉండే పదవీ విరమణ వయసు, ఇప్పుడు అకస్మాత్తుగా 40 ఏళ్లకే వచ్చి పడుతోందా? అనే ఆందోళన సర్వత్రా నెలకొంది.
బాధ్యతలు మోసే వయసులో..
40 ఏళ్ల వయసులో ఉద్యోగం పోవడమంటే కేవలం ఉపాధి కోల్పోవడం మాత్రమే కాదు, పెండింగ్‌లో ఉన్న ఇంటి రుణాల (ఈఎంఐ) నుండి పిల్లల స్కూల్ ఫీజులు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల వైద్య ఖర్చుల వరకు కుటుంబ ఆర్థిక వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తమైపోతుంది. తదుపరి 20 ఏళ్ల పాటు ‘సర్వైవల్ మోడ్’లో బతకాల్సిన దుస్థితిని ఈ కొత్త లే-ఆఫ్ సంస్కృతి సృష్టిస్తోంది.
ఆశలు చిదిమేస్తూ..
‘ఇండియా టుడే’లోని ఒక కథనం ప్రకారం బెంగళూరుకు చెందిన 43 ఏళ్ల రాజీవ్ (పేరు మార్చాం) లాంటి మిడ్-లెవల్ మేనేజర్ల పరిస్థితి ఇందుకు నిదర్శనం. మల్టీ నేషనల్ కంపెనీలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన రాజీవ్.. తాను భవిష్యత్‌లో ఇదే ఉద్యోగంలో కొనసాగుతానని నమ్మాడు. అయితే అతను కంపెనీ దృష్టిలో ‘కోర్’ మెంబర్ కాదని, కేవలం ‘అదనపు ఖర్చు’ అని తేలింది.దీంతో ఒక్క వారం రోజుల వ్యవధిలోనే అతన్ని ఇంటికి పంపించేశారు.
20 ఏళ్ల అనుభవం ఉన్నా..
40 ఏళ్లు దాటాక జీవితం స్థిరపడుతుందని, ఇంటి రుణాలు తీరుస్తూ, పిల్లల చదువుల కోసం ప్లాన్ చేసుకోవచ్చని అనుకునే సమయంలో కంపెనీలు ఇలాంటి వారిని పాతబడిపోయిన వారిగా చూస్తున్నాయి. హెచ్‌ఆర్ (హెచ్‌ఆర్) పరిభాషలో దీనిని 'రోల్ రేషనలైజేషన్' అని పిలుస్తున్నారు. 18-20 ఏళ్ల అనుభవం ఉన్న ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగించి, వారి స్థానంలో తక్కువ జీతానికి వచ్చే యువతను నియమించుకునేందుకు కంపెనీలు ఆసక్తి చూపిస్తూ, ఇలాంటి సాకులు చెబుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మరో ఉద్యోగం పొందలేక..
భారతదేశంలో ఇలా అర్ధాంతరంగా ఉద్యోగాలు కోల్పోతున్న వారికి మద్దతుగా నిలిచే సామాజిక భద్రతా వ్యవస్థలు లేకపోవడం విచారకరం. టాలెంట్ సెర్చ్ నిపుణుడు అంకుర్ అగర్వాల్ చెప్పినట్లుగా.. 40 ఏళ్ల వయసులో ఉద్యోగం కోల్పోయిన వారు తిరిగి మరో ఉద్యోగం పొందలేకపోతున్నారు. వారికి మద్దతు ఇచ్చే వ్యవస్థ మన దేశంలో లేదు. గృహ రుణాలు తీసుకున్న వారి ఈఎంఐలు 58 ఏళ్ల వరకు ఉన్న తరుణంలో, మధ్యలోనే ఆదాయం ఆగిపోతే ఆ కుటుంబం పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది.
జీవితం అగమ్యగోచరం
వీరు జూనియర్ రోల్స్ చేయడానికి ఓవర్ క్వాలిఫైడ్‌గానూ, సీనియర్ లీడర్ల పాత్రలకు సరిపోని వారిగానూ ముద్రిపొందుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పలు కంపెనీలు ఎక్కువ అనుభవం ఉన్నవారిని భరించేందుకు సిద్ధంగా లేవనే మాట వినిపిస్తోంది. ఈ పరిస్థితి మున్ముందు ఇలానే కొనసాగితే, పింఛను లేని, గౌరవం లేని, భవిష్యత్తు లేని ఒక కొత్త రిటైర్మెంట్ వయసును (40 ఏళ్లు) మనం సృష్టించుకున్నట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: చాట్‌జీపీటీతో ఫ్రెండ్‌షిప్ యమడేంజర్?


