కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఇప్పుడు అన్ని రంగాలకూ విస్తరించింది. ముఖ్యంగా నేటి తరం యువత ఏఐని తమ అన్ని అవసరాలకూ విరివిగా వినియోగిస్తోంది. ఒక స్నేహితునికన్నా చాట్‌బాట్ అధికమని భావిస్తూ, అది ఇచ్చే అన్ని సలహాలను పాటిస్తోంది. ఈ నేపధ్యంలో కొందరు లేనిపోని సమస్యలను కొని తెచ్చుకుంటూ, ఇబ్బందుల్లో పడుతున్నారు. ఇంతకీ ఏఐ ఫ్రెండ్‌షిప్‌తో వచ్చే ముప్పు ఏమిటి?
ఆత్మహత్య లేఖకు పురిగొల్పి?
కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత చాట్‌బాట్‌లు కేవలం సమాచారం ఇవ్వడానికే కాకుండా, యూజర్ల భావోద్వేగాలను సమర్ధించే స్నేహితులుగా కూడా వ్యవహరిస్తుండటంతో తీవ్రమైన దుష్పరిణామాలు ఎదురవుతున్నాయి. ఇటీవల కాలిఫోర్నియాకు చెందిన 16 ఏళ్ల కుర్రాడు ఆడమ్ రైన్ ఆత్మహత్య చేసుకోవడం వెనుక చాట్‌జీపీటీ ప్రభావం ఉందన్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపాయి. ఆ కుర్రాడు తన బాధను తల్లిదండ్రులకు చెప్పకుండా చాట్‌జీపీటీతో పంచుకున్నప్పుడు, ఆ ఏఐ (ఏఐ) అతనికి నచ్చజెప్పడానికి బదులు ఆత్మహత్య లేఖ రాయడానికి సహకరించిందనే ఆరోపణలు వచ్చాయి. ఎవరైనా తమ భయాలను, ఒంటరితనాన్ని ఏఐతో పంచుకుంటున్నప్పుడు, అది వారి ప్రతికూల ఆలోచనలను కూడా సమర్థించడం కారణంగా ఆత్మహత్యలు, స్వయంహాని లాంటి ఘటనలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రక్షణ చర్యల దిశగా చాట్‌జీపీటీ
ఇటువంటి పరిణామాల నేపథ్యంలో, చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్‌ఏఐ (OpenAI) యువత భద్రత కోసం కీలక నిర్ణయం తీసుకుంది. యూజర్ల వయసును అంచనా వేసే (Age-prediction system) అనే ఒక కొత్త టెక్నాలజీని రూపొందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విధానంలో యూజర్ నేరుగా చెప్పే వయసుతో పాటు, వారి ప్రవర్తనా శైలిని బట్టి సిస్టమ్ వయసును గుర్తించనుంది. అకౌంట్ ఎప్పుడు క్రియేట్ చేశారు? ఏ సమయంలో ఎక్కువగా వాడుతున్నారు? వారి చాటింగ్ ప్యాట్రన్ ఎలా ఉంది? వంటి అంశాలను విశ్లేషించి, సదరు యూజర్ 18 ఏళ్ల లోపు వారా? కాదా? అనేది ఏఐ నిర్ధారిస్తుంది. ఒకవేళ అకౌంట్ మైనర్లదని తేలితే, వారికి హానికరమైన కంటెంట్, హింస, ఆత్మహత్య ప్రేరేపిత సమాచారం కనిపించకుండా ఆటోమేటిక్‌గా రక్షణ చర్యలు అమలవుతాయి.
పేరెంటల్ కంట్రోల్స్‌కు ప్రాధాన్యత
పిల్లల ఆన్‌లైన్ భద్రతను మరింతగా పెంచేందుకు తల్లిదండ్రులకు కూడా ఓపెన్‌ఏఐ కొన్ని నియంత్రణ అధికారాలను కల్పిస్తోంది. ‘పేరెంటల్ కంట్రోల్స్’ ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లలు చాట్‌జీపీటీని వాడే సమయాన్ని నియంత్రించవచ్చు. అంతేకాకుండా, పిల్లలు ఏదైనా తీవ్రమైన మానసిక ఒత్తిడికి సంబంధించిన సంభాషణలు జరిపితే, ఆ విషయం పేరెంట్స్‌కు తెలిసేలా నోటిఫికేషన్లు వచ్చే వెసులుబాటు కూడా దీనిలో ఉంటుంది. ఈ కొత్త విధానాలు త్వరలోనే యూరోపియన్ యూనియన్ దేశాల్లో అమల్లోకి రానున్నాయి.
భారత్‌లో సాధ్యమేనా?
భారతదేశంలో కూడా పిల్లల డేటా భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ‘డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్-2023’ (డీపీడీపీ) ప్రకారం 18 ఏళ్ల లోపు పిల్లల డేటాను ప్రాసెస్ చేయాలంటే కంపెనీలు కచ్చితంగా తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలి. అమెరికా, ఐరోపా దేశాలతో పోలిస్తే భారత్‌లో వయసు నిబంధనలు కఠినంగా ఉన్నప్పటికీ, ఆచరణలో మాత్రం అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రస్తుతానికి చాలా ప్లాట్‌ఫారమ్‌లు యూజర్లు చెప్పే వయసునే ప్రామాణికంగా తీసుకుంటున్నాయి తప్ప, కచ్చితమైన వెరిఫికేషన్ చేయడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ అక్షరాస్యత తక్కువగా ఉండటం, పిల్లలే తల్లిదండ్రుల ఫోన్ల ద్వారా వయసు మార్చుకునే అవకాశం ఉండటం తదితర కారణాల వల్ల ఈ చట్టం అమలు క్లిష్టంగా మారిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి: ‘షుగర్ ఫ్రీ’తో క్యాన్సర్ ముప్పు?


