చక్కెర లేని తీపిని ఆస్వాదించేందుకు, కేలరీలను తగ్గించుకునేందుకు కృత్రిమ తీపి పదార్థాలు ఒక పరిష్కారంగా మార్కెట్‌లోకి ప్రవేశించాయి. కాలక్రమేణా ఇవి డైట్ సోడాలు, షుగర్-ఫ్రీ స్నాక్స్, దైనందిన ఆహారాలలో భాగంగా మారిపోయాయి. ఎఫ్‌డీఏ (ఎఫ్‌డీఏ), ఈఎఫ్‌ఎస్‌ఏ (ఈఎఫ్‌ఎస్‌ఏ) తదితర నియంత్రణ సంస్థలు వీటిని పరిమితి మేరకు వాడితే సురక్షితమే అని చెబుతున్నప్పటికీ, తాజా అధ్యయనాలు మాత్రం దీర్ఘకాలిక వినియోగంపై ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి.
ఈ అంశంపై బెంగళూరు ఆస్టర్ వైట్‌ఫీల్డ్‌కు చెందిన ప్రముఖ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ నరేంద్ర బి.ఎస్. ‘ఇండియా టీవీ’తో మాట్లాడుతూ.. ఈ స్వీటెనర్లు అందరికీ పూర్తిగా హానికరం కానప్పటికీ, చాలామంది అనుకుంటున్నంత సురక్షితం కూడా కాదన్నారు. వీటి వాడకంతో వచ్చే క్యాన్సర్ ముప్పు గురించి ఆయన మాట్లాడుతూ తాజా పరిశోధన ఫలితాలను సంక్లిష్టంగా ఉన్నాయన్నారు. ఆర్టిఫిషియల్ షుగర్‌లోని ఆస్పర్టేమ్ అనే పదార్థాన్ని ఐఏఆర్‌సి (ఐఏఆర్‌సీ)‘క్యాన్సర్ కారకం కావచ్చు’ అని వర్గీకరించింది. దీని అర్థం అది కచ్చితంగా క్యాన్సర్ కలిగిస్తుందని కాదు, కానీ దానిపై మరింత లోతైన పరిశోధన అవసరమని ఆయన తెలిపారు.
ఇక బరువు తగ్గే విషయంపై ఆయన మాట్లాడుతూ, చక్కెరతో పోలిస్తే ఇవి కేలరీలను తగ్గించడంలో కొంత మేలు చేస్తాయని, అయితే అనారోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ కేవలం స్వీటెనర్లను వాడటం వల్ల బరువు సమస్యలు మాయం కావని స్పష్టం చేశారు. ఫలితాలనేవి వ్యక్తిని బట్టి మారుతుంటాయని అన్నారు. ఈ స్వీటెనర్ల ప్రభావం కేవలం బరువుకే పరిమితం కాదు. సుక్రలోజ్, సాకరిన్ వంటి కొన్ని స్వీటెనర్లు పేగులలోని మంచి బ్యాక్టీరియా, ఇన్సులిన్ పనితీరు, గ్లూకోజ్ స్థాయిలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని జంతువులు, మనుషులపై చేసిన కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయని డాక్టర్ నరేంద్ర పేర్కొన్నారు.
వృద్ధులలో తక్కువ లేదా జీరో-కేలరీ స్వీటెనర్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల మెదడు పనితీరు వేగంగా మందగించే అవకాశం ఉందని కొన్ని పరిశీలనాత్మక అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయని నరేంద్ర తెలిపారు. గర్భిణులు, చిన్న పిల్లలు, జీవక్రియ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ స్వీటెనర్ల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని, వ్యక్తిగత వైద్య సలహాలు తీసుకోవాలని డాక్టర్ నరేంద్ర సూచించారు. రోజువారీ వినియోగం సురక్షిత పరిమితుల్లో ఉన్నప్పటికీ, ఇది ఆరోగ్యానికి శ్రేయస్కరమని చెప్పలేమన్నారు. కేవలం రుచి కోసం వీటిపై ఆధారపడకుండా పండ్లు, పెరుగు వంటి సహజసిద్ధమైన ఆహార పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన తెలిపారు.
ఇది కూడా చదవండి: ‘తగ్గేదే లే..’.. అదే మాటపై శశి థరూర్


