కోజికోడ్: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ తాజాగా కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌లో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. తాను కాంగ్రెస్ పార్టీ అధికారిక వైఖరిని పార్లమెంటులో ఏనాడూ ఉల్లంఘించలేదని, అయితే ‘ఆపరేషన్ సింధూర్’ విషయంలో మాత్రం తన అభిప్రాయాన్ని బలంగా వినిపించానని శశి థరూర్ స్పష్టం చేశారు. పహల్గామ్ ఘటన తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో, ఆ ఒక్క విషయంలో మాత్రమే పార్టీతో బహిరంగంగా విభేదించాల్సి వచ్చిందని, దానికి తాను ఏమాత్రం విచారించడం లేదని థరూర్ తేల్చిచెప్పారు.
శనివారం కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌లో మాట్లాడిన శశి థరూర్, పార్టీ నాయకత్వంతో విభేదాలు ఉన్నాయన్న వార్తలపై స్పందించారు. పార్లమెంటులో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలకు, విధానాలకు తాను ఎప్పుడూ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. అయితే, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జరిగిన ‘ఆపరేషన్ సింధూర్’ విషయంలో మాత్రం తాను భిన్నమైన వైఖరిని అవలంబించినట్లు అంగీకరించారు. ఆ సమయంలో దేశ ప్రయోజనాల దృష్ట్యా తాను తీసుకున్న కఠినమైన వైఖరికి కట్టుబడి ఉన్నానని, దానిపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ధరూర్ తేల్చి చెప్పారు.
పహల్గామ్ ఘటన తర్వాత తాను ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో రాసిన కాలమ్‌ను థరూర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆ దాడికి ప్రతీకారంగా ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ పరిమిత సైనిక చర్య చేపట్టాలని తాను ఆనాడే సూచించానన్నారు. భారత్ అభివృద్ధిపై దృష్టి సారిస్తున్న దేశమని, పాకిస్తాన్‌తో సుదీర్ఘ యుద్ధానికి దిగకుండానే ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాలని తాను భావించానన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా తాను సూచించిన తరహాలోనే చర్యలు తీసుకుందని, ఈ విషయంలో తన వైఖరి సరైనదేనని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇటీవల ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ కీలక సమావేశాలకు గైర్హాజరు కావడంపై వస్తున్న ఊహాగానాలపైన కూడా థరూర్ స్పందించారు. మీడియాలో వస్తున్న వార్తల్లో కొన్ని నిజాలు, మరికొన్ని అబద్ధాలు ఉన్నాయని అన్నారు. తాను హాజరుకాలేనని పార్టీకి ముందుగానే సమాచారం ఇచ్చానని, ఏవైనా అంతర్గత సమస్యలు ఉంటే పార్టీ వేదికలపైనే చర్చిస్తానన్నారు. మరోవైపు కేరళ ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ.. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, థరూర్ గైర్హాజరును వివాదంగా చూడాల్సిన అవసరం లేదని అన్నారు.
ఇది కూడా చదవండి: ముంబై మేయర్ ఎన్నికపై మరింత ఉత్కంఠ


