ముంబై: ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మేయర్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. జనవరి 31న జరగాల్సిన ఈ ఎన్నిక, గ్రూప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తలెత్తిన సాంకేతిక కారణాలతో ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదా పడింది. బీజేపీ - ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గాలు తమ కార్పొరేటర్ల గ్రూప్ రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయడంలో విఫలం కావడంతోనే ఈ ఆకస్మిక వాయిదా అని సమాచారం. రిజర్వేషన్లు ఖరారైనప్పటికీ, ధ్రువీకరణ పత్రాలను మున్సిపల్ కార్యదర్శికి సమర్పించడంలో జాప్యం కారణంగా ఎన్నికల ప్రక్రియ స్తంభించిపోయింది.
మేయర్ ఎన్నిక కోసం ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ), రాజ్ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) తమ వ్యూహాలను పకడ్బందీగా అమలు చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలు తమ 65 మంది కార్పొరేటర్ల గ్రూప్ రిజిస్ట్రేషన్‌ను శరవేగంగా పూర్తి చేసి, అధికార కూటమి కంటే ఒక అడుగు ముందే ఉన్నాయి. మరోవైపు, బీజేపీ, షిండే వర్గం ఉమ్మడి గ్రూపుగా ఏర్పడతాయా లేక వేర్వేరుగా పోటీ చేస్తాయా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
ఈ అనిశ్చితి 227 మంది సభ్యులున్న సభలో మేయర్ పీఠాన్ని దక్కించుకోవడంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. రూ. 60,000 కోట్ల బడ్జెట్ కలిగిన బీఎంసీపై పట్టు సాధించేందుకు జరుగుతున్న ఈ పోరులో ప్రతి నిమిషం కీలకంగా మారింది. ఎన్నికల వేడి ఇలా ఉంటే ఉద్ధవ్ థాకరే బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన తండ్రి బాలసాహెబ్ థాకరే శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన ‘శివసేన కేవలం ఒక పార్టీ కాదని, అదొక సిద్ధాంతమని, ముంబై మట్టి బిడ్డల ఆత్మగౌరవమని ఉద్ఘాటించారు. శివసేనను అంతం చేయాలని బీజేపీ కలలు కంటోందని, కానీ అది అసాధ్యం. అణగారిన వర్గాల గుండెల్లో రగిలే జ్వాల శివసేన. ఆ జ్వాలను ఆర్పడం ఎవరివల్లా కాదు’ అని అన్నారు.
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ-షిండే సేన కూటమి (మహాయుతి) ఘన విజయం సాధించి, బీఎంసీపై పట్టు సాధించింది. 227 సీట్లలో మెజారిటీకి కావాల్సిన 114 సీట్లను దాటి, ఈ కూటమి 118 స్థానాలను కైవసం చేసుకుంది. ఇందులో బీజేపీ 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, షిండే సేన 29 సీట్లు గెలుచుకుంది. దీంతో బీఎంసీపై మూడు దశాబ్దాల పాటు సాగిన థాకరే కుటుంబ ఆధిపత్యానికి తెరపడింది.


