భరించలేకపోయా..అందుకే ఈ కఠిన నిర్ణయం..! | A video of a woman revealing that she shaved her head | Sakshi
Sakshi News home page

భరించలేకపోయా..అందుకే ఈ కఠిన నిర్ణయం..!

Mar 11 2026 6:03 PM | Updated on Mar 11 2026 6:21 PM

A video of a woman revealing that she shaved her head

ఈరోజుల్లో కూడా అమ్మాయి పెళ్లి విషయంలో కుటుంబం నుంచి వస్తున్న ఒత్తిడి ఏవిధంగా ఉందో తెలిపే ఘటన ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. పెళ్లి చేసుకోవాలంటూ కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న ఒత్తిడి తట్టుకోలేక ఓ యువతి శిరోముండనం చేయించుకుంది. కాజల్స్‌ మూవ్‌ అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా పోస్ట్‌ చేసిన ఈ వీడియోలో తన ఆవేదనను పంచుకుంది. 

‘అందరు అమ్మాయిల్లాగే నాకు కూడా నా జుట్టు అంటే ఎంతో ఇష్టం. కానీ, ప్రతిరోజూ ఇంట్లో పెళ్లి సంబంధాల గురించి వస్తున్న ఒత్తిడి, చుట్టుపక్కల వారి మాటలు భరించలేకపోయాను. ఈ ఒత్తిడి నుంచి విముక్తి పొందేందుకే నేను ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాను’ అని ఆమె తెలిపింది. 

ఈ సందర్భంగా ఆ యువతి సమాజపు ద్వంద్వ ప్రమాణాలపై, వివక్షపై గళమెత్తింది. మగవారు తమ ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటే పట్టించుకోని ఈ సమాజం, ఒక మహిళ తన రూపం గురించి, తన జీవితం గురించి స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటే ఎందుకు వేలెత్తి చూపుతుంది.. 

పెళ్లి ప్రస్తావన లేకుండా ఒక మహిళను తన స్వంత కాళ్లపై నిలబడనివ్వరా.. ప్రతిదానికీ ఒక టైమ్‌ లైన్‌ ఉండాలని ఒత్తిడి చేయడం ఎంతవరకు సమంజసం.. అంటూ ప్రశ్నించింది. తాను ఈ వీడియోను ఎవరి సానుభూతి కోసం చేయలేదని ఆమె స్పష్టం చేసింది. తనలాగే పెళ్లి ఒత్తిడిని ఎదుర్కొంటున్న వేలాది మంది యువతుల్లో ధైర్యం నింపడమే తన ఉద్దేశమని తెలిపింది. ‘జీవితం ఒక్కటే.. అది చేజారిపోయాక ఎవరూ వచ్చి మనకేం కావాలని అడగరు. 

కాబట్టి, మీ కలల కోసం, మీ జీవితం కోసం పోరాడండి’ అని ఆమె పిలుపునిచ్చింది. ఈ వీడియో పోస్ట్‌ చేసిన కొంతసమయానికే 3.7 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. దీనిపై స్పందించిన నెటిజన్లు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. తమ జీవితాలను తామే శాసించుకోవాలనుకునే మహిళలకు నువ్వు ఒక స్ఫూర్తి, అని ఒక నెటిజన్‌ కామెంట్‌ చేయగా, ఇది ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం కాదు, సమాజంపై ఒక తిరుగుబాటు అని మరొకరు రాసుకొచ్చారు. 

 

(చదవండి: స్ట్రోక్‌ బాధితురాలి ఘనత..! ఏకంగా రెండు ప్రపంచ రికార్డులు..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement