నేను... ఉమన్‌ జర్నలిస్ట్‌ | Funday womens day Special women Journalist | Sakshi
Sakshi News home page

నేను... ఉమన్‌ జర్నలిస్ట్‌

Mar 11 2026 5:10 PM | Updated on Mar 11 2026 5:10 PM

Funday womens day Special women Journalist

జర్నలిస్ట్‌గా 1980లో ప్రయాణం ప్రారంభించినప్పుడు నన్ను నేను ‘మహిళా జర్నలిస్ట్‌’ అని ఎప్పుడూ అనుకోలేదు. వేరే లేబుల్స్‌ లేకుండా నేను జర్నలిస్ట్‌ను. దిల్లీలో క్రైమ్‌బీట్‌ చూశాను. క్రైమ్‌బీట్‌ అంటే ‘ఇది పురుషులకు మాత్రమే’ అన్నట్లుగా ఉండేది పరిస్థితి. తరువాత చెన్నైలో ఒక జాతీయ పత్రికకు కరస్పాండెంట్‌గా పనిచేశాను.

గతతరం జర్నలిస్ట్‌లు ద్వారాలు తెరిచి, ఈ వృత్తిని ఎంచుకున్న మా తరం మహిళలకు పునాది వేశారు. అయినప్పటికీ శ్రీలంక, పాకిస్తాన్‌లలో విదేశీ కరస్పాండెంట్‌గా నా పోస్టింగ్‌ను అసాధారణంగా, ఆశ్చర్యంగా చూశారు. అయితే హైప్రొఫైల్‌ అసైన్‌మెంట్స్‌కు నా జెండర్‌ అడ్డు కాదనిపించింది. పాకిస్తాన్‌లో నేను మొదటి మహిళా జర్నలిస్ట్‌ అయ్యే అవకాశం వచ్చింది. భారతదేశాన్ని వదిలి పాక్‌కు వెళ్లే ముందు...

‘నీకు అప్పగించిన బాధ్యత పురుషులకు కూడా కష్టమైనది. ఒంటరిగా ఉన్నందున ఆ అపాయింట్‌మెంట్‌ను తిరస్కరించడం మంచిది’ లాంటి సలహాలు వినిపించాయి. నేను ఆ సలహాలు పాటించనందుకు సంతోషంగా ఉంది. అక్కడి (పాక్‌) నుంచి రిపోర్టింగ్‌ చేయడం నాకు చాలా ఇష్టంగా అనిపించింది. ఒకటి నేను పురుషుడినై ఉంటే ఇంత కంటే బాగా చేసేదాన్ని అని చెప్పలేను కాని, జర్నలిజంలో నా పనికి గుర్తింపుగా రెండు అవార్డులు వచ్చాయి.

రెండవది, ఆ దేశంలో నేను కలిసిన ప్రతి ఒక్కరూ, పాకిస్తాన్‌లో నియమితురాలినైన మొదటి మహిళా జర్నలిస్ట్‌ నేనే అని చెప్పడం ప్రారంభించారు. మూడవది,  ‘మహిళా జర్నలిస్ట్‌’ అనే మాటకు అర్థం ఏమిటో నాకు పాకిస్తాన్‌లో అర్థమైంది. నేను భారతదేశానికి తిరిగి రావాల్సి వచ్చినప్పుడు నా స్థానంలో వేరొకరిని నియమించడానికి అన్వేషణ మొదలైంది. ఇతర విషయాల సంగతి ఎలా ఉన్నా మహిళ లేదా అవివాహితుడు అయితే బాగుంటుందని అనుకున్నారు.

పూర్వకాలంలో  పాక్‌లో పోస్ట్‌ చేసిన పురుషుల పిల్లలు అంతర్జాతీయ స్థాయి పాఠశాలలో చదవడానికి అయ్యే ఖర్చును ప్రచురణ సంస్థే భరించేది. ఎందుకంటే భారతీయ  పిల్లలకు స్థానిక పాఠశాలల్లో చదవడం కష్టంగా ఉండేది. ఒక పురుష జర్నలిస్ట్‌ను ఇస్లామాబాద్‌లో నియమించారు. దీంతో ఆయన భార్య ఇక్కడ తాను చేసే ఉద్యోగాన్ని వదులుకొని భర్తతో వెళ్లాల్సి వచ్చింది. ఉద్యోగం వదులుకున్నందుకు సంస్థ ఆమెకు పరిహారం కూడా చెల్లించింది.
కాని, కాలం మారిపోయింది. అప్పటి పరిస్థితి ఇప్పుడు లేదు.

పాక్‌ను వదిలి భారత్‌కు వచ్చే ముందు ఇస్లామాబాద్‌లోని నా స్నేహితులకు నా స్థానంలో వచ్చే మహిళ గురించి చెప్పాను. అప్పుడు వారి స్పందన ఇలా ఉంది... ‘వోహ్‌! వచ్చేది కూడా మహిళా జర్నలిస్టేనా? ఇక్కడ మాత్రమే మహిళలను ఎందుకు పోస్ట్‌ చేస్తున్నారు? హానీ ట్రాప్‌లుగా మహిళలను పంపాలనేది మీ నిఘా సంస్థల వ్యూహం అయి ఉండాలి’– అపోహల అద్దాలతో చూస్తున్నప్పుడు, అలాంటి సమయంలో వివరణ ఇవ్వడం అర్థరహితం అనిపించింది.

‘మహిళా జర్నలిస్ట్‌లు మరింత ముందుకు సాగాలి. వారు గొప్ప కథనాలెన్నో రాయగలరు. అదే సమయంలో సంస్థ వారి దీర్ఘకాలిక కెరీర్‌ పురోగతి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు’ అని ఒక అగ్ర సంపాదకుడు రాశారు. ఎందుకంటే చాలామంది మహిళా జర్నలిస్ట్‌లు వివాహం కాగానే రెండు, మూడు సంవత్సరాల్లోనే ఫీల్డ్‌ను వదిలిపెట్టారు. ఈ రకంగా ఆయన నిజం మాట్లాడారు.

ఈరోజుల్లో ఎక్కువగా కనిపించే బైలైన్‌లను చూడండి. వారందరూ మహిళా జర్నలిస్ట్‌లే. కాని ఎడిటర్‌లు ఎవరో చూడండి. గత ఇరవయ్యేళ్లుగా మీడియాలో వచ్చిన మార్పుల కారణంగా కొంతమంది మహిళలు ఉన్నత స్థానంలో ఉన్నారు. ముఖ్యంగా ప్రసార మాధ్యమాలు(బ్రాడ్‌కాస్ట్‌ మీడియా), ఆన్‌లైన్‌ వార్తా సంస్థలలో గ్రాఫ్‌ ఇప్పటికీ పురుషులకు అనుకూలంగానే ఉంది. 

జర్నలిజం స్కూల్స్‌లో పురుషులతో పోల్చితే మహిళా విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. నేను క్లాస్‌ చెప్పే ఒక జర్నలిజం స్కూల్‌లో పదిహేనుమంది విద్యార్థులలో ముగ్గురు మాత్రమే పురుషులు. వార్త సంస్థలలో మహిళల నాయకత్వానికి సంబంధించిన ఆశ బహుశా భవిష్యత్తులోనే ఉంటుంది.
నిరూపమా సుబ్రమణియన్‌, సీనియర్‌ జర్నలిస్ట్‌ 

(చదవండి: హెల్త్‌కేర్‌’లో నారీశక్తి)

Advertisement
 
Advertisement
Advertisement