అమెరికా ప్రధాన నగరం న్యూయార్క్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. శివరాత్రితో పాటు మహిళా దినోత్సవం రెండు వేడుకలను కలిపి నైటా సంబరాలను అద్వితీయంగా జరిపారు. న్యూయర్క్, న్యూజెర్సీతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న తెలుగువారందరూ పెద్ద సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మ్యూజికల్ కన్సర్ట్ అందరినీ అలరించింది. భక్త కన్నప్ప స్కిట్, టీ&టీ సిస్టర్స్ నృత్య ప్రదర్శన, ఘర్షణ బ్యాండ్, అంజనా సౌమ్య, సృష్టి చిల్లాల ఫెర్మార్మెన్స్‌లు ఆహుతులను ఆకట్టుకున్నాయి. చిన్నారులు ప్రదర్శించిన కళారూపాలు, వివిధ స్కిట్‌లు ఆహా అనిపించాయి.

నైటా ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాల సమాహారంతో రూపొందించిన ప్రత్యేక నైటా సంబరాల సావనీర్-2026ను ప్రముఖ ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త, వితరణశీలి డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. సంస్కృతీ సంప్రదాయాల కలబోతగా న్యూయార్క్ వేదికగా నైటా నిర్వహిస్తున్న కార్యక్రమాలను ప్రశంసిస్తూ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, న్యూయార్క్ కాన్సులేట్ జనరల్ ప్రత్యేక సందేశాలు పంపారు. అమెరికాలో స్థిరపడినా పుట్టినప్రాంత పండగలు, సంప్రదాయాలను గౌరవిస్తూ కొనసాగిస్తున్నామని, వేడుకల విజయాన్ని ఆకాంక్షిస్తూ సహకరించిన అందరికీ నైటా అధ్యక్షుడు రవీందర్ కోడెల కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో నైటా వైస్ ప్రెసిడెంట్ హరిచరణ బొబ్బిలి, సెక్రటరీ మహేష్ బాబు, ట్రెజరర్ డాక్టర్ సౌమ్య శ్రీ, ఇతర కార్యకవర్గ సభ్యులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, అడ్వయిజరీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


