- ‘ఎప్‌స్టీన్’ తాజా పత్రాల్లో వెల్లడి
- కొట్టిపారేసిన శ్వేతసౌధం
వాషింగ్టన్: అమాయక టీనేజర్లు, యువతులను సంపన్నులు, రాజకుటుంబీకులు, ఉన్నతాధికారుల లైంగిక అవసరాల కోసం ఎరవేసిన అంతర్జాతీయ లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్ ఉదంతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం నేరాలకు పాల్పడ్డాడని బాధిత యువతి సంచలన విషయం బయటపెట్టింది. అమెరికా న్యాయశాఖ ఇటీవల విడుదల చేసిన తాజా పత్రాల్లో ఈ విషయం వెల్లడైంది. టీనేజర్‌గా ఉన్నకాలంలో తనను ట్రంప్‌కు ఎప్‌స్టీన్ పరిచయం చేశాడని, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆ యువతి ఒక ఇంటర్వ్యూల్లో ఆరోపించింది.
2019 ఏడాదిలో జరిగిన పలు ఇంటర్వ్యూల తాలూకు మూడు భాగాలను ఎఫ్‌బీఐ తన నివేదికలో పొందుపరిచింది. 2019 ఆగస్ట్ ఏడో తేదీ నాటి ఇంటర్వ్యూలో ‘‘13–15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నన్ను ట్రంప్‌కు ఎప్‌స్టీన్ పరిచయం చేశాడు. సరిగా గుర్తులేదుగానీ అప్పుడు న్యూయార్క్ లేదా న్యూజెర్సీ నగరంలో వాళ్లను కలిశా. ఎప్‌స్టీన్, ట్రంప్ ఇద్దరూ నాపై లైంగిక దాడికి ప్రయత్నించారు. లైంగిక దాడి వేళ తప్పించుకునేందుకు ట్రంప్‌ను కొరికేశా. దాంతో కోపంతో ట్రంప్ నన్ను కొట్టాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని నాకు, నా ఆప్తులకు బెదిరింపులు ఫోన్‌కాల్ వచ్చాయి’ అని ఆమె చెప్పారు. ఇవి తప్పుడు ఆరోపణలని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ కొట్టిపారేశారు.


