నేను ఒక ప్రభుత్వ కార్యాలయానికి ఆర్టీఐ దరఖాస్తు ఇచ్చాను. వారు సమాధానం ఇవ్వకపోవడంతో నేను ఫస్ట్ అప్పీల్ దాఖలు చేశాను. ఇప్పుడు వారు రిజిస్టర్డ్ పోస్టు ద్వారా ఒక లేఖ పంపి, 7 రోజులలోపల విచారణకు హాజరు కావాలని చెప్పారు. నన్ను ఎందుకు రమ్మంటున్నారో అర్థం కాలేదు. ఇప్పుడు నేను తప్పనిసరిగా ఆ విచారణకు హాజరు కావాలా? లేదా ఏమీ చేయకుండా సెకండ్ అప్పీల్ సమయం వచ్చిన తర్వాత నేరుగా రెండవ అప్పీల్ వేయాలా లేక కమిషన్‌కుపోవాలా?
– నరేష్, నందిగామ
ఆర్టీఐ చట్టం ప్రకారం, కోరిన సమాచారం సాధారణంగా రాతపూర్వకంగా లేదా మీరు కోరిన రూపంలో ఇవ్వాలి. ఇవ్వని పక్షంలో సమాచార హక్కు చట్టం, 2005 ప్రకారం, మొదటి అప్పీల్‌కు ప్రజా సమాచార అధికారి ఇచ్చిన సమాధానం వుంటే ఆ సమాధానం ఆధారంగా లేదా అప్పీల్‌లో పేర్కొన్న కారణాల ఆధారంగా నిర్ణయిస్తారు. అప్పీల్ అధికారి తన విచక్షణ ప్రకారం అప్పీల్‌దారుని విచారణకు పిలవవచ్చు కానీ మీరు హాజరు కావడం తప్పనిసరేమీ కాదు. రాతపూర్వక రికార్డుల ఆధారంగానే అప్పీల్‌ను నిర్ణయించవచ్చు. చాలా అప్పీలు దరఖాస్తులు అప్పీలు దారుడు వ్యక్తిగతంగా హాజరు కాకుండానే నిర్ణయించబడుతాయి.
మీరు హాజరు కావాలనుకోకపోతే, రాతపూర్వకంగా కేసును పరిశీలించి రికార్డు ఆధారంగా నిర్ణయించాలని అభ్యర్థించవచ్చు. విచారణకు పిలవడం ద్వారా ఆర్టీఐ దరఖాస్తుకు రాతపూర్వక (లేదా మరే ఇతర విధానంలో కోరితే అలాగ) సమాధానం ఇవ్వాల్సిన బాధ్యతను కాదనలేరు. అందువల్ల, మీ ఆర్టీఐ ప్రశ్నలకు రాతపూర్వక సమాధానం ఇవ్వాలని మీరు కోరడం పూర్తిగా చట్టబద్ధమైనది.
మీరు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావడం సాధ్యం కాదని, అప్పీల్‌ను రాతపూర్వక రికార్డుల ఆధారంగా నిర్ణయించాలని అభ్యర్థిస్తున్నారని లేఖ రాయండి. పోస్టల్ స్లిప్పులు భద్రపరచుకోండి. మీకు సమాచారం లేదా పరిష్కారం దొరక్కపోతే, 90 రోజుల్లోగా కమిషన్‌ను ఆశ్రయించవచ్చు. ఇలా చేయడం వల్ల మీరు విచారణ నోటీసును పూర్తిగా పట్టించుకోలేదని ఎవరూ చెప్పలేరు. సంబంధిత అధికారం కేంద్ర ప్రభుత్వానికి చెందితే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వానికి చెందితే స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ – వద్ద అప్పీల్ చేయాలి.
– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది
(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. )
(చదవండి: స్ట్రోక్ బాధితురాలి ఘనత..! ఏకంగా రెండు ప్రపంచ రికార్డులు..)


