అలాంటి పిల్లలను వదిలించుకోవాలని చూస్తే జైలు శిక్ష.. | Law Advice: It is the duty of all children to take care of their parents | Sakshi
Sakshi News home page

అలాంటి పిల్లలను వదిలించుకోవాలని చూస్తే జైలు శిక్ష..

Feb 18 2026 5:08 PM | Updated on Feb 18 2026 5:45 PM

Law Advice: It is the duty of all children to take care of their parents

నాకు పెళ్లయి 15 సంవత్సరాలు. పెళ్లి అయిన తర్వాత నా భర్త నన్ను అమెరికాకు తీసుకువెళ్లారు. ఇద్దరు పిల్లలు అక్కడే పుట్టారు. దురదృష్టవశాత్తూ ఇద్దరికీ తీవ్రమైన ఆటిజం.. అమెరికాలో ఉండగా కూడా నా భర్త పిల్లలను పట్టించుకోకపోగా కొట్టేవాడు. విషయం తెలుసుకున్న అక్కడి అధికారులు పిల్లలను తమ రక్షణలోకి తీసుకుని నా భర్తపై చర్యలు కూడా తీసుకున్నారు. ఇదే క్రమంలో తను ఇండియా పారిపోయి వచ్చాడు. చాలా కష్టాలు పడి నేను కూడా వచ్చాను. తీవ్రమైన లెవెల్‌ 3 ఆటిజంతో ఉన్న పిల్లలను పెంచడం చాలా కష్టంతో – ఖర్చుతో కూడుకున్న పని. అతను వాళ్లని వదిలించుకోవడమే కాదు, మేమిద్దరం కలిసి కొనుక్కున్న ఆస్తికి ఈఎంఐలు కట్టకుండా ఇబ్బంది పెడుతున్నాడు. నేను 24 గంటలు పిల్లల చుట్టే ఉండవలసిన పరిస్థితి కాబట్టి నేను పని కూడా చేయలేను. ఆటిజం బారిన పడిన పిల్లలకు మన దేశంలో సరైన చట్టాలు పెద్దగా లేవు – ప్రభుత్వ వసతులు కూడా లేవు అని అంటున్నారు. పరిష్కారం సూచించగలరు.
– సుమతి, వరంగల్‌

మీ బాధ వింటుంటే హృదయాన్ని కలచివేస్తుంది. మీరన్నది నిజమే! మన దేశంలో ఆటిజంపై పెద్దగా అవగాహన లేదు – బహుశా అందుకే ప్రభుత్వ వసతులు, పథకాలు కూడా పెద్దగా అందుబాటులో లేవు. దివ్యాంగుల హక్కుల చట్టం 2016 కింద ఆటిజంను మానసిక/మేధోవైకల్యంగా పరిగణిస్తారు. ఈ చట్టం కింద ఎటువంటి వైకల్యం కల్గిన వ్యక్తినైనా వివక్షకు గురిచేస్తే కఠిన శిక్షలు ఉన్నాయి. అలాగే జాతీయ ట్రస్ట్‌ చట్టం 1999 అనేది ఆటిజం, సెరిబ్రల్‌ పాల్సీ, మానసిక వికలాంగత, బహుళ వైకల్యాలున్న వ్యక్తుల సంరక్షణ, చట్టపరమైన సంరక్షకులను నియమించడం, స్వతంత్ర జీవనానికి మద్దతు ఇవ్వడం కోసం ఏర్పాటు చేసిన చట్టం/సంస్థ. 

అయినప్పటికీ ఆటిజం ఉన్నవారికి మిగతా వారిలా సరైన ఇన్సూరెన్స్‌ కూడా లేదు! అమెరికాలో ఉన్నట్టు పటిష్టమైన ప్రభుత్వ వసతులు, సంస్థలు లేనందున ఆర్థికంగా బలహీనమైన, మధ్యతరగతి తల్లిదండ్రులు చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు వీటిపై బలమైన మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. మీ విషయానికి వస్తే మీ భర్తపై ముందుగా క్రిమినల్‌ కేసులు పెట్టండి. 

మీ భర్త చేసినవి నేరాలు! బీ.ఎన్‌.ఎస్‌.లోని సెక్షన్‌ 93 (పూర్వం ఐ.పీ.సీ 317) ఇలా చెప్తుంది: ‘‘పన్నెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల తండ్రి అయినా, తల్లి అయినా లేదా అలాంటి పిల్లల సంరక్షణ కలిగి ఉన్న ఎవరైనా, ఆ బిడ్డను పూర్తిగా విడిచిపెట్టాలనే ఉద్దేశ్యంతో – ఆ బిడ్డను వదిలించుకునే ఉద్దేశంతో బహిర్గతం చేసినా లేదా వదిలేసినా, ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించబడతాయి.’’ 

అంతేకాదు. జువెనైల్‌ జస్టిస్‌ యాక్ట్‌ 2015, సెక్షన్‌ 75 ప్రకారం: పిల్లలను శారీరకంగా, మానసికంగా క్రూరత్వానికి గురి చేయడం లేదా నిర్లక్ష్యం చేయడంపై కఠిన చర్యలు ఉన్నాయి. పిల్లలపై బాధ్యత లేదా నియంత్రణ ఉన్న వ్యక్తి, వారి ఆరోగ్యం లేదా భద్రతకు హాని కలిగించేలా ప్రవర్తిస్తే 3 ఏళ్ల వరకు జైలుశిక్ష,  లక్ష వరకు జరిమానా ఉంటుంది.

కాబట్టి పై కేసులు పెట్టండి. పోలీసులకి గానీ, శిశు సంక్షేమ శాఖవారి ద్వారా కానీ పిర్యాదు చేయవచ్చు. అదనంగా మీ పిల్లల కోసం – మీకోసం కూడా మెయింటెనెన్స్‌ కోరుతూ కేసు వేయండి. డీ.వీ.సీ. చట్టం కింద భారీ పరిహారం, గృహ వసతి కూడా కోరవచ్చు. మీకు త్వరగా ఉపశమనం కావాలి అనుకుంటే అదనంగా హై కోర్టును ఆశ్రయించి త్వరితగతిన కేసులు తేల్చవలసిందిగా దరఖాస్తు చేసుకోవచ్చు.

– శ్రీకాంత్‌ చింతల, హైకోర్టు న్యాయవాది
మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.com  కు మెయిల్‌ చేయవచ్చు.  

(చదవండి: కిరణ్ రావుకు చికున్‌గున్యా నిర్థారణ..! ఏకంగా కీళ్ల ఆరోగ్యాన్ని..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement