సమాచార వెల్లడిపై సీఐసీకి బ్యాంకుల అప్పీల్
బ్యాంకింగ్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనంపై సమాచార హక్కు చట్టం కింద దాఖలైన పత్రాలు చర్చనీయాంశం అయ్యాయి. మొండి బకాయిలు, ఉద్దేశపూర్వక ఎగవేతదారులు, తనిఖీ నివేదికలు(Inspection Reports) వంటి సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేయడాన్ని సవాలు చేస్తూ దేశంలోని ప్రధాన బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యెస్ బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంకులు కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ)ను ఆశ్రయించాయి.
అసలు వివాదం ఏమిటి?
సమాచార హక్కు చట్టం (RTI) కింద ధీరజ్ మిశ్రా, వాతిరాజ్, గిరీష్ మిట్టల్, రాధా రామన్ తివారీ వంటి సామాజిక కార్యకర్తలు ఆర్‌బీఐ వద్ద కొన్ని కీలక పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ముఖ్యంగా..
టాప్ 100 ఎన్‌పీఏల వివరాలు.
బ్యాంక్ ఆఫ్ బరోడాకు విధించిన రూ.4.34 కోట్ల జరిమానాకు సంబంధించిన తనిఖీ నివేదికలు.
యెస్ బ్యాంక్ ఉద్దేశపూర్వక ఎగవేతదారులు.
ఎస్‌బీఐ, ఆర్‌బీఎల్ బ్యాంకులపై ఆర్‌బీఐ జరిపిన పర్యవేక్షణ మూల్యాంకన నివేదికలు.
ఆర్‌బీఐ వర్సెస్ బ్యాంకులు
ఆర్టీఐ నిబంధనల ప్రకారం ఈ సమాచారాన్ని వెల్లడించవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) భావించింది. సుప్రీంకోర్టు గతంలో జయంతిలాల్ ఎన్. మిస్త్రీ కేసులో ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ ఆర్‌బీఐకి బ్యాంకులతో ఎటువంటి విశ్వసనీయ సంబంధం (Fiduciary Relationship) లేదని, కాబట్టి సమాచారాన్ని దాచాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే, బ్యాంకులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సమాచారం వెల్లడిస్తే తమ వాణిజ్య ప్రయోజనాలకు, మార్కెట్ పోటీతత్వానికి హాని కలుగుతుందని, ఇది తమ వ్యాపారాన్ని దెబ్బతీస్తుందని బ్యాంకులు వాదిస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ జయంతిలాల్ మిస్త్రీ తీర్పును పునపరిశీలించాలని సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది.
సీఐసీ కీలక నిర్ణయం
ఈ వ్యవహారాలను విచారించిన సమాచార కమిషనర్ ఖుష్వంత్ సింగ్ సేథీ వీటి సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకుని కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి సంక్లిష్టమైన అంశాలను గతంలో డబుల్ బెంచ్ విచారించినందున ఈ కేసులన్నింటినీ సీఐసీ నేతృత్వంలోని లార్జర్ బెంచ్‌కు బదిలీ చేస్తున్నట్లు చెప్పారు. ఇది తుది నిర్ణయం తీసుకునే వరకు ఆయా సమాచారాలను దరఖాస్తుదారులకు వెల్లడించకూడదని మధ్యంతర ఉత్తర్వుల ద్వారా నిలిపివేశారు.
డిపాజిటర్ల హక్కులు, ప్రభుత్వ రంగ బ్యాంకుల జవాబుదారీతనం విషయంలో ఈ తీర్పు అత్యంత కీలకం కానుంది. ఒకవేళ లార్జర్ బెంచ్ సమాచార వెల్లడికి మొగ్గు చూపితే బ్యాంకింగ్ రంగంలోని లోపాలు, ఎగవేతదారుల వివరాలు బహిర్గతం అవుతాయి. లేదంటే బ్యాంకుల గోప్యతకు చట్టబద్ధమైన రక్షణ లభిస్తుంది.
ఇదీ చదవండి: రూ.2.7 కోట్ల జీతం.. ఉద్యోగం వదిలేసిన 22 ఏళ్ల యువకుడు..


