తన రికార్డును తానే అధిగమించిన వైనం
రూ.3,28,321 కోట్లకు చేరిన రాష్ట్ర అప్పులు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేయడంలో తన రికార్డులను తానే బద్దలు కొట్టారు. 2014–19 మధ్య ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు రూ.2,49,530 కోట్లు అప్పు చేసిన ఆయన.. ఇప్పుడు రెండేళ్లు కూడా పూర్తవకుండానే ఆ రికార్డును అధిగమించారు. 20 నెలల్లోనే ఏకంగా రూ.3,28,321 కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని అప్పులఊబిలో ముంచేశారు. మంగళవారం వస్తే చాలు అప్పుల పరంపరను కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలో ఈ మంగళవారం 7.70 శాతం వడ్డీతో చంద్రబాబు సర్కారు రూ.3,100 కోట్లు అప్పు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఆర్‌బీఐ ఈ అప్పును రాష్ట్ర ప్రభుత్వానికి సమీకరించి ఇచ్చింది. దీంతో బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట చంద్రబాబు ప్రభుత్వం అప్పులు ఏకంగా రూ.3,28,321 కోట్లకు చేరాయి. ఇందులో మంగళవారం చేసిన అప్పుతో కలిపి బడ్జెట్ అప్పులు రూ.1,79,264 కోట్లకు, బడ్జెట్ బయట అప్పులు రూ.1,49,057 కోట్లకు చేరాయి.
ఇందులో వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారెంటీతో చేస్తున్న అప్పులు రూ.1,01,670 కోట్లు ఉండగా, రాజధాని పేరుతో తీసుకున్న అప్పు రూ.47,387 కోట్లు. ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పాలన కొనసాగుతోంది. కాగా, చంద్రబాబు ప్రభుత్వం నెలకు సగటున రూ.16,416 కోట్లు, రోజుకు రూ.547 కోట్లు అప్పు చేసినట్లయ్యింది. ఈ అప్పులతో సూపర్ సిక్స్‌తో పాటు ఇతర హామీలు అమలు చేయడం లేదు. అలాగే ఆస్తుల కల్పనకు కూడా వ్యయం చేయడం లేదు. మరి ఇన్ని అప్పులు దేని కోసం చేస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది.


