పాలకుల పా‘పానీ’కి బలి | 68 people seriously ill with diarrhea in Srikakulam city | Sakshi
Sakshi News home page

పాలకుల పా‘పానీ’కి బలి

Feb 25 2026 5:29 AM | Updated on Feb 25 2026 5:29 AM

68 people seriously ill with diarrhea in Srikakulam city

స్ట్రెచర్‌ లేకపోవడంతో దుప్పటిలో బాధితులను తీసుకువెళ్తున్న దృశ్యం

నలుగురిని మింగేసిన డయేరియా

మున్సిపల్‌ కుళాయి నీరే కాలకూట విషం 

శ్రీకాకుళం నగరంలో మోగిన మృత్యుఘంటిక  

మరో 68 మందికి తీవ్ర అస్వస్థత  

ఆలస్యంగా స్పందించిన ప్రభుత్వ యంత్రాంగం  

సగం నగరం డయేరియా బారినే..!

చంద్రబాబు సర్కారు కల్తీ, కలుషిత పాపానికి ప్రజల ప్రాణాలు బలైపోతున్నాయి. ఇప్పటికే నకిలీ మద్యం, కల్తీ పాలు అమాయకులను పొట్టనబెట్టుకున్నాయి. తాజాగా శ్రీకాకుళంలో కలుషిత నీరే కాలకూటమై కబళిస్తోంది. డయేరియా రూపంలో పంజా విసురుతోంది. ఇప్పటికే నలుగురిని మింగేసింది. మరో 68 మందిని తీవ్ర అస్వస్థత పాలుజేసింది. మంగళవారం ఒక్క రోజునే ఇద్దరు మృత్యువాత పడడం తీవ్ర కలకలం రేపింది. అయినా సర్కారులో చలనం లేదు. డయేరియా విజృంభణకు కారణాలు అన్వేషించి నియంత్రణ చర్యలు చేపట్టకుండా మరణాలకు వేరే కారణాలు ఉన్నాయని సాకులు వెతుక్కుంటోంది. దీంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.  

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల నిర్లిప్తత వల్ల గత నాలుగు రోజుల నుంచి శ్రీకాకుళంలో డయేరియా విజృంభిస్తోంది. కలుషిత నీరు తాగి ప్రజలు వ్యాధి బారిన పడుతున్నారు. ఇప్పటివరకు అతిసారంతో నలుగురు దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఇద్దరు మంగళవారం ఒక్కరోజునే మరణించడం వ్యాధి తీవ్రతకు అద్దంపడుతోంది. మరో 68 మంది తీవ్ర అస్వస్థతకు గురై వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇవన్నీ అధికారిక లెక్కలే. వాస్తవానికి డయేరియా బాధితుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని, నగరంలో సగం డయేరియా విషకోరల్లో చిక్కుకుందని సమాచారం.   

నిలువెత్తు నిర్లక్ష్యం 
నాలుగు రోజులుగా డయేరియా ప్రబలుతున్నా.. ప్రజలు మరణిస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోలేదు. సోమవారం మధ్యాహ్నం వరకు కేసుల వివరాలు బయట పెట్టలేదు. అయితే దమ్మల వీధికి చెందిన మడ్డు లక్ష్మణ(61) వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ఆదివారం చనిపోయాడు. మోణింగి సంతోష్(41) కూడా వాంతులు, విరేచనాలతో సోమవారం ఉదయం మరణించాడు. ఆస్పత్రికి వెళ్లే వరకైనా వీరి ప్రాణాలు నిలబడలేదు. ఆ తర్వాత ఒక్కసారిగా కేసులు పెరగడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

మంగళవారం దమ్మల వీధికి చెందిన ఆటో డ్రైవర్‌ మండల సురేష్‌ (41) రిమ్స్‌లో చికిత్స పొందుతూ చనిపోగా, సదాశివుని నర్సింగరావు(62) ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే మార్గం మధ్యలో చనిపోయాడు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది.  అంతవరకు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించిన యంత్రాంగం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మరణాలకు డయేరియా ఒక్కటే కారణం కాదని, వేరే కారణాలు ఉన్నాయని చెబుతోంది. 

శ్రీకాకుళం నగరంలోని మేదరవీధి మెయిన్‌రోడ్డులో కాలువలను పునర్నిర్మిస్తుండడంతో పైప్‌లైన్‌లోకి మురుగునీరు చేరి మంచినీరు కలుషితమవుతోందని తెలుస్తోంది. డయేరియాకు ఇదే కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. ముఖ్యంగా కార్పొరేషన్‌ కార్యాలయం సర్వీసు ట్యాంక్‌ నుంచి ఏయే ప్రాంతాలకైతే కుళాయిల ద్వారా నీరు సరఫరా అవుతోందో ఆ ప్రాంతాల ప్రజలు ఎక్కువగా డయేరియా బారిన పడ్డారు.  

ఆస్పత్రులు కిటకిట  
శ్రీకాకుళం నగరంలో సగానికిపైగా ప్రాంతాలు డయే­రియా బారిన పడ్డాయి. దమ్మల వీధి, కుమ్మరి వీధి, మేదరవీధి, కాకి వీధి, గుడి వీధి, మంగువారి తోట, గోల్కొండ రేవు, మొండేటి వీధి, వాంబే కాలనీ, అరసవల్లి, హౌసింగ్‌ బోర్డు కాలనీ, ఎల్‌బీఎస్‌ కాలనీల్లో అధికంగా  కేసులు నమోదయ్యాయి. ఫలితంగా శ్రీకాకుళం రిమ్స్, పట్టణ ఆరోగ్య కేంద్రాలతోపాటు జెమ్స్, కిమ్స్, మెడికవర్, సిందూర, అప్సర ఆస్పత్రులు బాధితులతో కిటకిటలాడుతున్నాయి. కొందరు ఇంటి వద్దే చికిత్స తీసుకుంటున్నారు. 

వ్యాధి తీవ్రత దృష్ట్యా ఆరు యూపీహెచ్‌సీలు, జెమ్స్, కిమ్స్, మెడికవర్‌ ఆస్పత్రులతోపాటు శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్ప­త్రుల్లో అధికారులు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశా­రు. డయేరియా ప్రబలడానికి గల పూర్తి కారణాలను తెలుసుకునేందుకు విశాఖపట్నం, శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పత్రి నుంచి నలుగురితో కూడిన వైద్య బృందం నమూనాలు సేకరిస్తోంది. నగరంలో డయేరియాతో ప్రజలు చనిపోతుంటే అధికార పార్టీ నాయకులు పత్తా లేకుండాపోవడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement