అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్న సీఎం చంద్రబాబు
హెరిటేజ్ ఉత్పత్తులు.. ఇందాపూర్‌లోనే తయారీ
ఏడు కొండలపై జీవోను నేనెప్పుడూ వ్యతిరేకించలేదు
తిరుమల క్షేత్రంపై మాట మార్చి సభలో చంద్రబాబు పచ్చి అబద్ధాలు
2009 ఎన్నికల సభలో జీవోలను వ్యతిరేకించిన బాబు
సాక్షి, అమరావతి: టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్న ఇందాపూర్ డెయిరీ తమ కుటుంబ సంస్థ హెరిటేజ్‌కు కో–మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ అని శాసన సభ సాక్షిగా సీఎం చంద్రబాబు ఒప్పుకున్నారు. ఇందాపూర్ డెయిరీలో హెరిటేజ్ ఉత్పత్తులు తయారవుతాయని వెల్లడించారు. తమకు కో–మాన్యుఫ్యాక్చరింగ్ చేస్తున్న ఇందాపూర్‌పై ఆరోపణలు చేస్తున్నారని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
టీటీడీకి నెయ్యి సరఫరా వ్యవహారంలో హెరిటేజ్‌కు ముడిపెడుతున్నారని, దీనిపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించామని చెప్పారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై శాసన సభలో మంగళవారం నిర్వహించిన లఘు చర్చలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. హెరిటేజ్ సంస్థ తన ఉత్పత్తులను ప్రభుత్వానికి ఎన్నడూ సరఫరా చేయలేదని తెలిపారు. తిరుమల క్షేత్రం ఏడు కొండలపై వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జారీ చేసిన 746, 747 జీవోలను తానెప్పుడూ వ్యతిరేకించలేదన్నారు.

లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వుతో కల్తీ చేసిన నెయ్యిని వాడారని ఎన్డీడీబీ అనుమానిత నివేదిక ఆధారంగానే ప్రకటన చేశానని చంద్రబాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో కల్తీ నెయ్యితో తయారు చేసిన 20.01 కోట్ల లడ్డు ప్రసాదాలను విక్రయించారని ఆరోపించారు. సీబీఐ సిట్ సిఫార్సులు అమలు చేయడం కోసం ఏకసభ్య కమిషన్‌ను నియమించామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక టీటీడీ ప్రక్షాళనకు చర్యలు తీసుకున్నామన్నారు.
గతంలో టీటీడీ చైర్మన్‌గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి సతీమణి బైబిల్ పట్టుకున్నారని, కరుణాకర్‌రెడ్డి కుమార్తె వివాహం క్రైస్తవ సంప్రదాయంలో చేశారని విమర్శించారు. కాగా 2009 ఎన్నికల ప్రచారం సందర్భంగా తాను అధికారంలోకి వస్తే 746, 747 జీవోలను రద్దు చేస్తామని గుంటూరులో నిర్వహించిన సభలో చంద్రబాబు ప్రకటించడం గమనార్హం. ఆ విషయాన్ని కప్పి పుచ్చి, ఆ జీవోలను తాను వ్యతిరేకించలేదని అసెంబ్లీ వేదికగా తనకు అలవాటైన రీతిలో కళ్లార్పకుండా అబద్ధాలను వల్లె వేశారు.
పెరుమాళ్లకే ఎరుక: పవన్ కళ్యాణ్
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకం విషయంలో గత ప్రభుత్వ అధినేత తప్పు చేశారని తానెక్కడా అనలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలోని టీటీడీ పాలక మండలి దీనికి బాధ్యత తీసుకోవాలన్నారు. రసాయనాలు కలిపిన నెయ్యితో లడ్డూలు తయారు చేశారని తేలిందన్నారు. ఇందులో లక్ష లడ్డూలు అయోధ్యకు పంపారని, అయితే ఇది రికార్డుల్లో నిరూపితం కావడం లేదన్నారు. రసాయనాల్లో ఏముందో పెరుమాళ్లకే ఎరుక అని వ్యాఖ్యానించారు. నిబంధనలు సవరించి, నచ్చిన సంస్థలకు గత ప్రభుత్వంలో నెయ్యి సరఫరా కాంట్రాక్ట్‌లు ఇచ్చారని విమర్శించారు.


